‘‘ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది ప్రభుత్వ రంగమే. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ మా ప్రభుత్వ విధానమని, లాభాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపేదిలేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ‘నేషనల్ మానిట్కెజేషన్ ప్రాజెక్ట్’ పేరుతో దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల పరంచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంలో ఏమాత్రం పెట్టుబడులు లేకుండా భారీ ఆదాయాలు దండుకునేలా కార్పొరేట్లకు మార్గం సుగమం చేసింది ప్రభుత్వం.’’
ఏడున్నర దశాబ్దాలుగా దేశానికి సేవలందించిన ప్రభుత్వరంగ సంస్థల్ని వదిలించుకోవాలని ప్రయత్నించటం ఏవిధమైన దేశభక్తి? 2008 ఆర్థిక సంక్షోభంలో అమెరికాతో సహా పలు అగ్రదేశాలలో బీమా, బ్యాంకింగ్, పెన్షన్ మార్కెట్‌లు కుప్పకూలాయి. ప్రభుత్వరంగం వల్లనే ఆర్థిక సంక్షోభాలను తట్టుకోగలమని ఆనాడే రుజువైంది. ప్రభుత్వరంగం లేకుంటే సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ప్రజాసంక్షేమ లక్ష్యాల సాధనకు, దేశ సమగ్రాభివృద్ధికి విఘాతం ఏర్పడుతుంది.
ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది ప్రభుత్వ రంగమే. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ మా ప్రభుత్వ విధానమని, లాభాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపేదిలేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ‘నేషనల్ మానిట్కెజేషన్ ప్రాజెక్ట్’ పేరుతో దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల పరంచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంలో ఏమాత్రం పెట్టుబడులు లేకుండా భారీ ఆదాయాలు దండుకునేలా కార్పొరేట్లకు మార్గం సుగమం చేసింది ప్రభుత్వం.
గత మూడు దశాబ్దాలుగా నూతన ఆర్థిక విధానాల అమలు ఫలితంగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రభుత్వాలు తమ పాత్రను కుదించేసుకొని, ‘సంక్షేమ రాజ్యం’ దృక్పథాన్ని వదిలేసి ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రైవేటీకరణ విధానాలు ప్రజల ప్రయోజనాల కోసమేనంటూ ప్రచారం చేస్తున్నాయి. అవి సామాన్యూల కోసం కాదని, బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమేనని నేడు రుజువైపోయింది. విఫలమైన ఆర్థిక నమూనాను ప్రస్తుత బిజెపి ప్రభుత్వం మరింత వేగవంతంగా అమలుచేస్తోంది.
పలు ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు, భారతీయ ఓవర్‌సీస్ బ్యాంక్, యస్ బ్యాంకుల వంటివి దివాలా తీసి ఘోరంగా విఫలమైతే వాటిని చివరకు ప్రభుత్వరంగ బ్యాంకులలోనే విలీనం చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళటంలో ప్రభుత్వరంగ బ్యాంకులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. 1956 ఎల్‌ఐసి చట్టాన్ని ఏకపక్షంగా పార్లమెంట్‌లో మార్చేసి ఎల్‌ఐసి ఐపిఓ ప్రక్రియను చేపట్టారు. ‘ప్రజల సొమ్ము – ప్రజల సంక్షేమానికి’ అనే లక్ష్యంతో ఏర్పడ్డ ఎల్‌ఐసి ప్రపంచంలోనే పేరెన్నికగన్న అగ్రగామి బీమా సంస్థగా నిలిచింది. గత 22 సంవత్సరాలుగా 23 ప్రైవేటు బీమా కంపెనీలతో పోటీ పడుతూ ఎల్‌ఐసి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. కోట్లాది ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొంది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది.
రైల్వేల తరువాత అత్యధిక ఆస్తులు కలిగిన సంస్థగానున్నది. ప్రజల నమ్మకాన్ని ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టేశారు. ప్రజల పొదుపును మరింత సేకరించి దేశ ప్రగతి కోసం ఆ సొమ్మును పెట్టుబడులుగా మార్చాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోంది. బిజెపి మినహా అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపబోమని తేల్చేశారు. ఆంధ్రుల హక్కుగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకై వేలాది రైతులు తమ భూములిచ్చి త్యాగాలు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎయిర్ ఇండియాను బలహీనపరచి టాటాలకు అప్పజెప్పేశారు. దీని కొనుగోలు కోసం టాటాలకు అప్పులిచ్చేది మళ్ళీ ప్రభుత్వరంగ బ్యాంకులే.
గత 3 సంవత్సరాలుగా రూ.2,10,000 కోట్లు (2020-21), రూ.1,75,000 కోట్లు (2021-22), రూ.65,000 కోట్లు (2022-23) మేరకు ప్రభుత్వ వాటాలను అమ్మేయాలనే లక్ష్యాన్ని కేంద్ర బడ్జెట్‌లోనే ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ టెలికం కంపెనీలను ప్రోత్సహించేందుకు బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీసి, వేలాది ఉద్యోగులు విఆర్‌ఎస్‌పై వెళ్ళేలా చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి కేటాయించలేదు. 2017 నుండి వేతన సవరణ కూడా అమలు చేయలేదు. పోస్టల్ ఉద్యోగులపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా పెరిగాయి. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధంలేని వివిధ రకాల సేవలను వారికి కట్టబెట్టారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడంలేదు.
ప్రభుత్వాలు పెన్షన్ సౌకర్యంపై దాడిచేశాయి. నూతన పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు శాపంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీన్ని రద్దుచేయాలని పోరాటం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎన్నడూలేని అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. పైగా వాటిపై పన్నులు పెంచి పెద్ద ఆదాయ వనరుగా మార్చుకుంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఉద్యోగులతోపాటు కోట్లాది ప్రజల ఆదాయాల నిజ విలువ పడిపోయింది. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరల పెరుగుదలపై రభస చేసిన బిజెపి ఇప్పుడు ప్రజలపై పెను ఆర్థిక భారాలను మోపుతోంది. 44 కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దుచేసి, 4 లేబర్ కోడ్‌లుగా మార్చేశారు. 2021-22 సంవత్సరానికి పిఎఫ్ వడ్డీరేటును 8.5 నుండి 8.1 శాతానికి తగ్గించడం ఉద్యోగ వర్గాల పొదుపుపై దాడి చేయడమే. గత 7 సంవత్సరాలుగా ఇన్‌కంటాక్స్ రాయితీల విషయంలోనూ మధ్యతరగతి వర్గాల వారిని మోదీ ప్రభుత్వం పూర్తిగా నిరాశపరిచింది.