వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు అధికారులు రెండు రోజులలో ఏర్పాట్లు పూర్తి చేయాలని
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలు కోసం ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టిందని అందుకోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం గూగుల్ మీట్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని నియోజకవర్గం, మండల, మున్సిపల్, గ్రామస్థాయిలలో ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకొని ఉదయం 8 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు రోజు రెండు ధాపాలుగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రజలకు చేరువగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం మహిళలకు రెండు కౌంటర్లు, పురుషులకు ఒక కౌంటర్ చొప్పున వేరువేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి కావలసిన కుర్చీలు, టెంట్లు, త్రాగునీరు లాంటి సదుపాయాలు సమకూర్చాలన్నారు.
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ఒక రోజు ముందు ప్రతి గ్రామాలలో, వార్డుల్లో దండోరా (టామ్ టామ్) వేయించి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అన్ని గ్రామస్థాయిలలో పట్టణ స్థాయిలో అన్ని వార్డులలో సభలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాలు నిర్వహించబోయే తేదీలు సమయాలను ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ సభకు వచ్చే ప్రజలు తమ దరఖాస్తులను పూర్తి చేసుకుని వచ్చేటట్లు చూడాలన్నారు. అన్ని పథకాలకు ఒకటే దరఖాస్తు ద్వారా స్వీకరించాలని తెలిపారు. ప్రతి టీంలో రెవెన్యూ, గ్రామపంచాయతీ అగ్రికల్చర్, పౌర సరఫరాలు, హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, విద్యుత్, వైద్య శాఖల అధికారులు ఉండాలన్నారు. ఎనిమిది రోజులు పని దినాలలో ప్రతిరోజు రెండు గ్రామాల చొప్పున కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామ సభలు నిర్వహించి అవసరం మేరకు కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ సభలలో అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీలు, జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.