‌ప్రజలకు మనస్పూర్తిగా… అంకిత భావంతో వైద్యసేవలు అందించాలి: తమిళిసై సౌందరరాజన్‌

రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌

‌యాదాద్రి భువనగిరి, మార్చి 12(ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) : వైద్య వృత్తిలో మనస్పూర్తిగా సంతోషంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌వైద్య విద్యార్థినీ, విద్యార్థులకు సూచించారు. శనివారం నాడు బీబీనగర్‌ ఆలిండియా మెడికల్‌ ‌సైన్స్ ‌కళాశాలలో 2021-22 వైద్య విద్యార్థుల బ్యాచ్‌ ‌వైట్‌ ‌కోట్‌ ‌వేడుకకు రాష్ట్ర గవర్నర్‌ ‌ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌మాట్లాడుతూ, వైద్య రంగంలో వినియోగించే తెల్ల కోటు సేవా రంగానికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు చిహ్నమని అన్నారు. మనస్పూర్తిగా సంతోషకరమైన వాతావరణంలో వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి అనుభవాలను, తన మాతృమూర్తి వైద్య వృత్తి పట్ల గౌరవంతో తనను తెల్ల కోట్‌లో డాక్టర్‌గా చూడాలనే కోరికను నెరవేర్చానని అంటూ, తాను వైద్య వృత్తిలో ఎదుర్కున్న అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.

గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవల పట్ల దృష్టి పెట్టాలని, పేషెంట్ల పట్ల అంతఃకరణ శ్రద్ధ వహించి సేవలు అందించాలని, కొత్తగా వైద్య రంగంలోకి వొస్తున్న వారు పేషెంట్లకు అందించే చికిత్స పట్ల వారికి అవగాహన కలిగించాలని, వారు నేర్చుకున్న విషయాల పట్ల సిన్సియర్‌గా ఉండాలని అన్నారు. ప్రధానమంత్రి వైద్యరంగం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పట్ల శ్రద్ధతో వైద్య ఎయిమ్స్‌లో వైద్య అధ్యాపకులను, వసతులను పెంచడం జరిగిందని అన్నారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పేరుతో చేపట్టిన వైద్యసేవలు ప్రపంచంలోనే పెద్దవని, జన ఔషధ్‌ ‌ద్వారా తక్కువ ధరలో మందులు లభిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌, ‌జన్‌ ఔషధ్‌ ‌ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని, తెలంగాణకు ఎయిమ్స్ ‌గౌరవ చిహ్నామని అన్నారు.

ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ ‌వికాస్‌ ‌భాటియా నేతృత్వంలో అద్భుతమైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో వైద్యరంగంలో ఎయిమ్స్ అ‌గ్రగామిగా నిలుస్తుందని అన్నారు. ఎయిమ్స్ ‌ద్వారా అందుతున్న వైద్య సేవలను సూపరింటెండెంట్‌ ‌నీరజ్‌ అగర్వాల్‌ ‌వివరించారు. కార్యక్రమం అనంతరం రాష్ట్ర గవర్నర్‌ ఎయిమ్స్ ఆవరణలో మొక్క నాటారు. తొలుత ఎయిమ్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌దీపక్‌ ‌తివారీ రాష్ట్ర గవర్నర్‌కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డిసిపి నారాయణరెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్‌ ‌రెడ్డి, ఎయిమ్స్ ‌మెడికల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌నీరజ్‌ అగర్వాల్‌, ‌డీన్‌ ‌రాహుల్‌ ‌నారంగ్‌, ‌ప్రొఫెసర్స్ ‌సంగీతా సంపత్‌, ‌నితిన్‌ అశోక్‌, ‌సామాజిక కర్త గూడూరు నారాయణరెడ్డి, ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page