ఈ రకమైన శిక్షలేని, శిక్షాభయం లేని అధికార ఉన్మాదం, ఇంప్యునిటీ 1980ల నుంచీ పెరుగుతూనే వస్తోంది. ఈ స్వభావాన్ని ఎంతగా పెంచి పోషించారంటే, ఈ పోలీసులు ప్రైవేటు దుస్తులతో, ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలతో, నంబర్ ప్లేట్లు లేని వాహనాలలో వచ్చి మనుషులను చంపిపోతారు. ఆ స్వభావాన్ని వ్యతిరేకించి పోరాటం చేయడమే పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం. ఇంత కాలంగా పౌరహక్కుల ఉద్యమ కారులందరము చేస్తున్నది ఆ పోరాటమే..!
జస్టిస్ భార్గవా కమిషన్ విచారణ సందర్భంగా నేను గమనించిన మరొక విషయమేమంటే పోలీసు అధికారులు నిజంగా చాలా పిరికివాళ్ళు. నా చేతులు పట్టుకుని, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో అన్న పోలీసు అధికారులు ఎందరో ఉన్నారు.
ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి.
డాక్టర్ మాజీద్‌ఖాన్ అని ఒక మానసిక వైద్యుడు ఉన్నారు. భార్గవా కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు. ఆయన నాకు అంతకుముందు పరిచయమే. ఫోన్ చేసి ‘‘మీరేదో కేంద్ర ప్రభుత్వానికి కొందరు పోలీసు అధికారుల మీద ఫిర్యాదు చేశారట. ఎవరెవరి పేర్లు రాశారో చెపుతారా’’ అని అడిగాడు.
తార్కుండే కమిటీ విచారణలో ఏయే పోలీసు అధికారుల మీద అభియోగాలు వచ్చాయో ఆ పేర్లు మేం కేంద్ర ప్రభుత్వానికి సీల్డ్ కవర్లలో పంపుతుండేవాళ్ళం. ఆ సీల్డ్ కవర్లలో తమ పేర్లున్నాయేమోనని అధికారులు భయపడి చస్తుండేవాళ్ళు. అట్లా భయంతో, మానసిక వేదనతో ఈ మానసిక వైద్యుడిని సంప్రదించి ఉంటారు.
డా. మాజీద్‌ఖాన్ నాకు ఫోన్ చేసి, ‘మీరు ప్రభుత్వానికి పంపిన జాబితా చదివి వినిపించండి. నా దగ్గరికి వైద్యానికి వస్తున్న అధికారి ఉన్నాడో లేడో తెలుస్తుంది. తద్వారా నేను సరైన చికిత్స చేయగలను’ అన్నాడు.
‘‘డాక్టర్ గారూ-మీరూ ఒక వృత్తి నిపుణులు. మీ దగ్గరికి ఎవరెవరు ఏయే వైద్యం కోసం వస్తారో మీరు రహస్యంగా ఉంచుతారు. మీ దగ్గరికి వచ్చే రోగులు.. అందువల్లనే మీ మీద విశ్వాసం ఉంచుతారు. మరి నేనూ మీ లాగనే మరొక వృత్తి నిపుణుడిని. భార్గవా కమిషన్ విచారణ వల్ల మనసు చెదిరిపోయి మీ దగ్గరికి చికిత్సకు వచ్చే అధికారి ఎవరో నేను అడగను. నేను ఎవరి పేర్లు రాశానో మీరు అడగకూడదు. అది వృత్తి రహస్యం’’ అన్నాను.
అంతేనా అన్నాడాయన. అంతే అన్నాను.
ఎవరెవరు భయంతో మానసిక వైద్యుడిని ఆశ్రయించారో ఆ తర్వాత నాకు తెలిసింది. అది వేరే కథ.
మీకు ఒక విశ్వాసం ఉంటే ధైర్యంగా చెప్పండి. ‘‘నేను సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేకిని. అందువల్ల కమ్యూనిస్టయిన ప్రతి వాడినీ చంపి పారేస్తాను’’ అని బహిరంగంగా ప్రకటించండి, కాని తప్పుడు సాకులు చెప్పకండి.
ఇది కేవలం నక్సలైట్ల విషయంలో మాత్రమే కాదు. ఎవరి విషయంలోనైనా అంతే. చంపే అధికారం పోలీసులకు లేదు.
నక్సలైట్ల కేసులు ఏవయినా తీసుకోండి. ఆ కేసులో ముద్దాయిల సంఖ్యలో కనీసం సగం మందిని ఛార్జిషీటు పెట్టకముందే పోలీసులు చంపేసి ఉంటారు. అంటే వాళ్ళు చేసిన నేరమేమిటో కోర్టుకు నివేదించకముందే, వాళ్ళు ఆ నేరం చేశారా లేదా, లేదా సాక్ష్యాధారాలతో కోర్టు నిర్ధారించకముందే పోలీసులే వాళ్ళకు శిక్ష విధించేశారన్న మాట. అదికూడా ఏకంగా మరణశిక్ష విధించారన్నమాట. ఇది ఏం పాలన? ఇటువంటి ఆకృత్యాలకు అడ్డుపడాలని పౌరహక్కుల కార్యకర్తలు ప్రయత్నిస్తే, వాళ్ళనూ చంపుతారు, లేదా కేసుల్లో ఇరికిస్తారు. పోలీసుల హింసను ఎవరు వ్యతిరేకిస్తారో, పోలీసులకు ఆ హింస చేసే అధికారం లేదని ఎవరు గొంతెత్తుతారో వాళ్ళను టెర్రరిస్టుగా చిత్రిస్తారు పోలీసులు.
ఇటువంటి ఆరోపణలు జస్టిస్ తార్కుండే పైన కూడ చేశారు. బ్రహ్మ చెల్లానీ అనే జర్నలిస్టు కేసు చేసినందుకు తార్కుండేను కూడ టెర్రరిస్టు అన్నారు. తార్కుండే ఒకరకంగా కమ్యూనిస్టు వ్యతిరేకి. రాడికల్ హ్యూమనిస్టు. హైకోర్టు జడ్జిగా పని చేశాడు. అయినా ఆయన మీద ఇటువంటి ఆరోపణ చేశారు.
సరే, జస్టిస్ భార్గవా కమిషన్ గిరాయిపల్లి సంఘటనను సంపూర్ణంగా విచారించింది గనుక, సాక్ష్యాల సేకరణ, పరిశీలన పూర్తయింది గనుక అంతవరకయినా మధ్యంతర నివేదిక వస్తే పోలీసు వ్యవస్థ పనితీరు కొంతలో కొంతయినా మెరుగుపడేది. ఆ నివేదిక రాకపోవడంతో, జస్టిస్ భార్గవా కమిషన్‌ను మూసివేయించడంలో పోలీసులు విజయం సాధించడంతో, ఆవిధంగా మెరుగుపడే అవకాశమే పోయింది. ఇప్పుడిక మనుషులను చంపడమే ఒక పాలనా విధానంగా పాలకులు తయారు చేసుకున్నారు. అందుకు వాళ్ళ చేతుల్లో ఆయుధంగా పోలీసులు ఉపయోగపడుతున్నారు.
జస్టిస్ భార్గవా కమిషన్ విచారణ ఇట్లా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే దాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదు. అప్పటికే జనతా ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి రాగానే ఎన్‌కౌంటర్ హత్యలు మళ్ళీ మొదలయ్యాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రంలో జనతా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, భార్గవా కమిషన్ విచారణ జరుగుతున్నన్ని రోజులు రాష్ట్రంలో కూడ ఎన్‌కౌంటర్ హత్యలు లేవు.
ఆ రోజుల్లో నల్గొండ జిల్లాకు సూపరింటెండెంట్‌గా కెఎస్ వ్యాస్ పనిచేసిన కాలంలో కుప్పలు తెప్పలుగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. అప్పటినుంచి ఎన్‌కౌంటర్ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ ఎన్‌కౌంటర్ హత్యలలో చెప్పుకోవలసిన సంఘటన మందాడి రవీందర్ రెడ్డి, నర్సయ్యల ఎన్‌కౌంటర్. వాళ్ళిద్దరూ సికిందరాబాద్ కుట్రకేసులో నిందితులు. ఆ కేసులోనూ, ఇతర కేసుల్లోనూ వాళ్ళమీద వేర్వేరు కోర్టులలో విచారణ జరుగుతూనే ఉంది.వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళను అరెస్టు చేసి సూర్యాపేట మున్సిఫ్ మేజిస్ట్రీట్ ఇంటి దగ్గర, ఆ మేజిస్ట్రీట్ ముందర హాజరు పరిచారు. లోపల హాజరు పరిచి, బైటికి తీసుకువచ్చి, గేటు దాటగానే కాల్చి చంపేశారు. అంటే జుడిషియల్ కస్టడీలో ఉండగా కాల్చి చంపేశారు. చాలా ప్రత్యేకమైన, దుర్మార్గమైన సంఘటన ఇది. హైకోర్టు పట్టించు కోలేదు. చట్టబద్ధపాలన అమలు చేస్తామనే వాళ్ళెవరూ పట్టించుకోలేదు. పోలీసులు దాన్నీ ఎన్‌కౌంటర్‌గానే చూపారు.ఈ ఎన్‌కౌంటర్ పై నిజనిర్ధారణ జరపడానికి నేను, జార్జిఫెర్నాండెజ్, మరికొంత మంది వెళ్ళాం. మేజిస్ట్రీట్‌తో మాట్లాడాం. మా నివేదిక విడుదల చేశాం. ఏమీ జరగలేదు.
నా యాభై ఏళ్ళ అనుభవంతో స్పష్టంగా చెప్పగలదేమంటే పోలీసుల దుర్మార్గాలను సరిచేయాలని ప్రభుత్వాలు అనుకోవడం లేదు. తాము అనాగరికంగా ప్రవర్తిస్తున్నామని, తమ పనితీరు మార్చుకుని, చట్టబద్ధంగా ప్రవర్తించాలని పోలీసులు అనుకోవడం లేదు.
కొంతమంది చెడ్డ ఆఫీసర్లు ఉండడం వల్లనో, కొందరి దుష్ప్రవర్తన వల్లనో ఇలా జరుగుతోందని, ఇది ఒక మినహాయింపు మాత్రమేనని కొందరు అంటారు. కాని అది తప్పు. ఇది వ్యక్తిగత వ్యాధి కాదు. జాతీయ పోలీసు అకాడమి నుంచి పది, పదిహేను మంది పోలీసు అధికారులు వచ్చి దుకాణాదారును కొట్టారంటే అది మినహాయింపు కాదు.
అది అధికార ఉన్మాదం. పోలీసు శాఖలో ఎందుకు చేరుతున్నామంటే అధికారం సంపూర్ణంగా దక్కుతుంది. ఎవరినయినా అణచివేయడానికి అవకాశం దొరుకుతుంది అని. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే గాని అధికారపు మజా తెలియదు.
ఈ రకమైన శిక్షలేని, శిక్షాభయం లేని అధికార ఉన్మాదం, ఇంప్యునిటీ 1980ల నుంచీ పెరుగుతూనే వస్తోంది. ఈ స్వభావాన్ని ఎంతగా పెంచి పోషించారంటే, ఈ పోలీసులు ప్రైవేటు దుస్తులతో, ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలతో, నంబర్ ప్లేట్లు లేని వాహనాలలో వచ్చి మనుషులను చంపిపోతారు. ఆ స్వభావాన్ని వ్యతిరేకించే పోరాటం చేయడమే పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం. ఇంతకాలంగా పౌరహక్కుల ఉద్యమకారులందరమూ చేస్తున్నది ఆ పోరాటమే..!
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం