Take a fresh look at your lifestyle.

పోలవరం ఉద్యమంపై పోలీసు కాల్పుల కేసు కొట్టివేత

  • 79 మందిపై 16 సంవత్సరాలుగా కొనసాగిన కేసు
  • తీర్పు పట్ల నేతల హర్షం
  • భద్రాచలం ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమం కొనసాగుతుందని వెల్లడి

భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : 2007లో పోలవరం ఉద్యమంపై భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో జరిపిన పోలీస్‌ ‌కాల్పుల కేసును శుక్రవారం జిల్లా అడిషనల్‌ ‌సెషన్స్ ‌కోర్టు జడ్జి నీరజ కొట్టివేశారు. నిర్వాసిత ఉద్యమకారుల తరఫున వాదించిన సీనియర్‌  ‌న్యాయవాదులు  కొల్లి సత్యనారాయణ, కె. పుల్లయ్యలు వాదించగా…పోలీసులు ఉద్యమకారులపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని కోర్టు నమ్ముతున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. గత 16 సంవత్సరాల కాలంలో ఈ కేసులో ఉన్న మొత్తం 79 మందిలో 11 మంది చనిపోవడం జరిగింది. మిగిలిన 67 మందిని నిరపరాదులుగా కోర్టు తీర్పు వెలువడించింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన శుక్రవారం నాడు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలవరం వ్యతిరేక ఉద్యమ నాయకులు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ ‌మాట్లాడుతూ పోలవరం కాల్పుల కేసు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

2004లో సిపిఎం నాయకత్వంలో  పోలవరం ముంపు నుండి భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని, భద్రాచలం పట్టణాన్ని రక్షించాలని పెద్ద ఎత్తున నిర్వహించిన ఉద్యమం పట్ల నాటి ప్రభుత్వం ప్రదర్శించిన దమనకాండలో భాగంగా 2007 జనవరి 29వ తేదీన భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో పోలీసులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా భాష్వవాయువు గోళాలు ప్రయోగించటం, లాఠీ చార్జీ చేయటం, పోలీసు కాల్పులు నిర్వహించడం ద్వారా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడం జరిగింది. ముంపు లేని ప్రత్యామ్నాయం చూడాలని అనేకమంది ఇంజనీరింగ్‌ ‌నిపుణులు చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగానే భద్రాచలం ప్రాంతం ముక్కలైందని, రాముని జపం చేసే బిజెపి ప్రభుత్వం మోదీ ప్రధాని అయిన తరువాత నియోజకవర్గంలోని నాలుగు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌తీసుకువచ్చి ఈ ప్రాంతానికి బిజెపి ద్రోహం చేసిందని అన్నారు. పోలవరం నిర్మాణం ముంపు ప్రమాదం గత సంవత్సరం వరదల్లో ప్రజలు చవి చూశారని, ఇప్పటికీ భద్రాచలం పట్టణానికి పోలవరం బ్యాక్‌ ‌వాటర్‌ ‌ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు.

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్‌ ‌నిపుణులు భద్రాచలం పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలు పోలవరం బ్యాక్‌ ‌వాటర్‌తో ముంపు గురికాకుండా కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, సుమారు 1600 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని నివేదికలు పంపిన నేపథ్యంలో తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్‌ ‌చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్‌, ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు జిఎస్‌ ‌శంకర్రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి, బండారు శరత్‌ ‌బాబు, పి సంతోష్‌ ‌కుమార్‌, ‌నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు జీవనజ్యోతి, జి లక్ష్మణ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply