- సోమవారం లీటరు పెట్రోలుపై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసలు పెంచిన చమురు కంపెనీలు
- హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117.68 కాగా..డీజిల్ 103.75
- పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన..చర్చకు పట్టు..లోక్‌సభ నుంచి వాకౌట్
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 4 : వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. దీంతో వాహనాలు తీయాలంటేనే భయమేస్తోందని వాపోతున్నారు. భారీగాపెరుగుతున్న ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. వరుసగా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు తాజాగా సోమవారం మరో 40 పైసలు వడ్డించాయి. దీంతో గత 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరుగడం ఇది పన్నెండోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ.9.44, డీజిల్‌పై రూ.9.10 పెరిగింది. తాజా పెంపుతో న్యూ దిల్లీలో పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ రూ.95.07కు చేరింది. ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.118.83కు పెరగగా, డీజిల్‌పై 43 పైసలు అధికమవడంతో రూ.103.07కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.117.68కి, డీజిల్ రూ.103.75కి చేరింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం గత 11 రోజుల నుంచి పథకం ప్రకారం ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నదని ధ్వజమెత్తారు. చమురు కంపెనీలతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకొనే వెసులుబాటు కల్పించారని మండిపడ్డారు. సకల జనులపై తీవ్ర ప్రభావాన్ని చూపే ధరల పెరుగుదలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు వారం రోజులపాటు అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో వినూత్న పద్ధతుల్లో నిరసన చేపట్టామని అన్నారు.
పెట్రో ధరలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన..చర్చకు పట్టు..లోక్‌సభ నుంచి వాకౌట్
రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విపక్షాలు సోమవారం రాజ్యసభలో తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో రెండు సార్లు రాజ్యసభను వాయిదా వేశారు. వెల్‌లోకి దూసుకువెళ్లిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నా ..విపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. దీంతో 2 గంటల వరకు డిప్యూటీ చైర్మెన్ సస్మిత్ పాత్ర సభను వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం రూల్ 267 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని చైర్మెన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. ఇక ఇదే పెట్రో అంశంపై ఇవాళ లోక్‌సభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ.. కాంగ్రెస్, టీఎంసీ, శివసేన పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. వెల్‌లోకి దూసుకువెళ్లిన డీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.