- మోదీ సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదు..నిర్బంధం
- ప్రధాని వ్యాఖ్యలపై మండిపడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్
- 1500 కోట్లు పెట్రో సబ్సీడీ భరిస్తున్నాం: మోడీ వ్యాఖ్యలపై బెంగాల్ సిఎం మమత మండిపాటు
న్యూ దిల్లీ, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లపై పన్నులు తగ్గించడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇంధనంపై విధించే పన్నుల్లో 68 శాతం వరకు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, అయినప్పటికీ మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నా, బొగ్గు కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టేస్తుందన్నారు. మోదీ చెప్తున్న సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదని, నిర్బంధమని తెలిపారు. అధిక ఇంధన ధరలు-రాష్ట్రాలను నిందించు..బొగ్గు కొరత రాష్ట్రాలను నిందించు…ఆక్సిజన్ కొరత- రాష్ట్రాలను నిందించు… అనే తీరులో కేంద్రం వ్యవహారం ఉందన్నారు. ఇంధన పన్నుల్లో 68 శాతం తీసుకుంటున్నప్పటికీ పీఎం బాధ్యతను వదులుకుంటున్నారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కోవిడ్-19 పరిస్థితిపై మాట్లాడేందుకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రులతో సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ట్వీట్ స్పందించారు.
1500 కోట్లు పెట్రో సబ్సీడీ భరిస్తున్నాం : మోడీ వ్యాఖ్యలపై బెంగాల్ సిఎం మమత మండిపాటు
కేంద ప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్టాల్రు పన్నులను తగ్గించాలని ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో తమ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుమారు 1500 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని దీదీ అన్నారు. ప్రధాని మోదీ తప్పుదోవ పట్టించేలా వన్‌సైడ్‌గా మాట్లాడినట్లు ఆమె ఆరోపించారు. ప్రధాని వెల్లడించిన అంశాలు అవాస్తవం అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై తమ ప్రభుత్వం మూడేళ్ల నుంచి లీటర్‌పై ఒక రూపాయి సబ్సిడీ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.
తమ రాష్ట్రానికి కేంద్రం బాకీ ఉందని, సుమారు 97 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలని ఆమె అన్నారు. అయితే తమకు రావాల్సిన అమౌంట్‌లో సగం వొచ్చినా..ఆ మరుసటి రోజే 3000 కోట్ల పెట్రో సబ్సిడీ ఇవ్వనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. సబ్సిడీతో తనకు సమస్య లేదని, కానీ ప్రభుత్వాన్ని నడపడం ఎలా అని ఆమె ప్రశ్నించారు. సీఎంలతో జరిగిన సమావేశంలో తమకు కౌంటర్ ఇచ్చే అవకాశం రాలేదన్నారు. పెట్రో సబ్సిడీ ఇస్తున్న యూపీ, గుజరాత్ రాష్ట్రాలను మోదీ పొగడడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆ రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందుతుందన్నారు. రాష్ట్రాలను తప్పుపట్టడం చాలా నీచమైన ఎజెండా అని తృణమూల్ పార్టీ విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేయవద్దని ఆ పార్టీ తన ట్వీట్‌లో పేర్కున్నది.