Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ఉభయ సభల్లో మళ్లీ గందరగోళం

  • ఆదానీ వ్యవహారంపై జెపిసికి విపక్షాల డిమాండ్‌
  • ‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల ఆందోళన…కొనసాగుతున్న వాయిదాల పర్వం

న్యూ దిల్లీ, మార్చి 14 : వరుసగా రెండోరోజూ పార్లమెంటులో ఆదానీ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. దీనిపై జెపిసి వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభలో ఇవాళ విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్‌ ‌చేశాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్‌ ఓం ‌బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్‌లో నిరసన చేపట్టారు. అదానీ అంశంపై జేపీసీ విచారణ చేపట్టాలని రెండు పార్టీలు డిమాండ్‌ ‌చేశాయి. భారత రాష్ట్ర సమతితో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని,  ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని ఆయన మండిపడ్డారు.

అదానీ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడిన అనంతరం ఖర్గే పార్లమెంట్‌ ఆవరణలో డియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వ  ధోరణితో నడిపిస్తోందని, పైగా ప్రభుత్వ పెద్దలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. అదానీ కుంభకోణంపై జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ (జెపిసి) కోసం తాము డిమాండ్‌ ‌చేస్తున్నామని, అయితే తాము ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా మైకులు కట్‌ ‌చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో సభలో గందరగోళం నెలకొందంటూ సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. పార్లమెంట్‌ ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు ఆందోళన నిర్వహించారు.ఇడీ, సీబీఐ మరియు ఐటీలను కేంద్రం దుర్వినియోగం చేస్తూ.. విపక్షాల ద కక్ష సాధింపు రాజకీయాలను చేస్తోందని, రాష్ట్రల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడదోస్తూ.. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తుందని బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, విపక్ష సభ్యులు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగారు. ఈ అంశంపై తక్షణం చర్చ నిర్వహించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు.ఉభయ సభలు వాయిదాపడటంతో.. పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరిన బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు అక్కడే ధర్నా నిర్వహించారు.

Leave a Reply