- అధికార పార్టీ తీరుపై సిఎల్‌పి నేత ఖర్గే మండిపాటు
- దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బిఆర్‌ఎస్ ఆగ్రహం
- పార్లమెంట్ ముందు బిఆర్‌ఎస్, ఆప్‌ల ఆందోళన
న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంటులో అదానీ కుంభకోణం నుండి దృష్టి మరల్చేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్ రెండో విడత బ్జడెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం కాగానే…రాహుల్ అంశం తీసుకుని రావడం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే, నాశనం చేసే మోడీ ప్రభుత్వం ఇప్పుడు కాపాడాలంటూ మాట్లాడుతున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. అదానీ కుంభకోణంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జెపిసి)ని నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంటుందని ఖర్గే అన్నారు. ఆప్, బిఆర్‌ఎస్‌లు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చాయి. దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతాయని బిఆర్‌ఎస్ పేర్కొంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్‌కు దూరంగా ఉంది.
ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆయన మండిపడ్డారు. అదానీ అంశంపై విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడిన అనంతరం ఖర్గే పార్లమెంట్ ఆవరణలో డియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వ ధోరణితో నడిపిస్తు న్నదని, పైగా ప్రభుత్వ పెద్దలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. గౌతమ్ అదానీ స్టాక్స్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం తాము డిమాండ్ చేస్తున్నామని, అయితే తాము ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా మైకులు కట్ చేస్తున్నారని, దాంతో గందరగోళం నెలకొనడం సభను వాయిదా వేయడం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. మరోవైపు దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ బీఆర్‌ఎస్, ఆప్ ఎంపీలు పార్లమెంట్ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్రం దాదాగిరి చెల్లదంటూ ఎంపీలు స్లోగన్లు వినిపించారు.
ఆదానీపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ, రాజ్యసభలో నిరసన తెలుపుతామన్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై 16 ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకంగా సమావేశం కాగా బీఆర్‌ఎస్ మాత్రం హాజరుకాలేదు. మరోవైపు పార్లమెంట్ రెండో విడత సమావేశాలు మొదలయ్యాయి. ఏప్రిల్ ఆరుతో పార్లమెంట్ బ్జడెట్ సమావేశాలు ముగియనున్నాయి. బీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరలిల్లింది. ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ ఎంపీలో లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో లోక్‌సభను స్పీకర్ బిర్లా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంట్ విగ్రహం ముందు కూడా విపక్షాలు ధర్నా చేపట్టాయి.