- శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యలను పరిష్కరించాలి
- 7న భద్రాచలంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష
- పట్టణ సమస్యల ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కలసి రావాలని పిలుపు
భద్రాచలం, ఏప్రిల్ 05(ప్రజాతంత్ర ప్రతినిధి) : శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్షం ప్రెస్ మీట్‌లో నాయకులు, ప్రముఖులు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాచలంలోని శ్రీ వెంకటేశ్వర కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశానికి సిపిఎం నాయకులు భీమవరపు వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ నెల 7న భద్రాచలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన దీక్షకు అందరూ పాల్గొనాలని అన్నారు. నిరసన దీక్ష తో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. రాష్ట్ర విభజనలో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలంను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని అన్నారు.
ముఖ్యంగా 2014లో ఒక్క కలం పోటు ద్వారా భద్రాచలం భవిష్యత్తును అంధకారంలో బిజెపి ప్రభుత్వం నెట్టింద అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు ముఖ్యమంత్రి ప్రకటించిన 100 కోట్లు నిధులు హామీ అమలు గురించి ప్రకటించాలని అన్నారు. పార్టీ జెండాలు వేరైనా ఎజెండా మాత్రం భద్రాచల అభివృద్ధి అని వారు స్పష్టం చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పోలవరం ముంపుకు గురైన సమయంలో కేంద్రం నిధులు కేటాయించి భద్రాచలం ముంపు కు గురికాకుండా పటిష్ట చర్యలు ఎలా తీసుకుంటారో ప్రజలకు వివరించాలని వారు అన్నారు. పాండురంగాపురం నుండి భద్రాచలం వరకు రైల్వే లైను నిర్మాణం చేయాలని, పట్టణానికి ఆనుకుని ఉన్న ఐదు పంచాయితీలను కలిపే ఆర్డినెన్స్ తేవాలని వారు అన్నారు.
ఈనెల 7వ తేదీ అంబేద్కర్ సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే నిరసన దీక్షకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్ష ,కార్యదర్శులు అరికెళ్ళ తిరుపతి రావు, కొండి శెట్టి కృష్ణమూర్తి, టిడిపి నాయకులు కుంచాల రాజారామ్, టీఎన్‌జిఓస్ మాజీ జిల్లా అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు,గ్రీన్ భదాద్రి నాయకులు గాదె మాదవ రెడ్డి, మహాజన సోషలిస్టు పార్టీ మండల నాయకులు అలవాల రాజా పెరియార్ , సిఐటియు పట్టణ కన్వీనర్ వై.వి రామారావులు మాట్లాడారు.