- అక్రమాల పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలా
- పుంగనూరు పాదయాత్రలో లోకేశ్ విమర్శలు
తిరుపతి,మార్చి3 : పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట… భూములు దోచిందానికి పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయన అని పిలవాలా? ఎందుకు పెద్దాయన అని పిలవాలని టిడిపి నేత లోకేశ్ ప్రశ్నించారు. పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపుతామని… తగ్గేది లేదు ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి అంటూ సవాల్ విసిరారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవం తంగా సాగుతోంది. 33వ రోజు పుంగనూరులో యువనేత పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై లోకేష్ విరుచుకుపడ్డారు. తాగే నీళ్ళు లీటరు రూ.20 అమ్ముతున్న రోజుల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి లీటర్ పాలుకు రూ.16 ఇచ్చారన్నారు. చల్లా బాబు పోరాటంతో ఆ ధరను ఇప్పుడు పెంచినట్లు తెలిపారు.
అయినా బయట పాల డైరీలు ఇచ్చే ధర కంటే ఆరు రూపాయలు ఇప్పటికీ తక్కువ ఇస్తూ పాడి రైతులను దోచేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్రంలో అమూల్ డైరీని తీసుకొచ్చారని… పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదన్నారు. పాపాల పెద్దిరెడ్డి శివశక్తి డైరీ కోసం అమూల్ను పుంగనూరుకు తీసుకురాలేదని లోకేష్ విమర్శించారు. పాడి రైతులను కాదు మామిడి రైతులను కూడా పాపాల పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి అనుచరులు వెంకట్రెడ్డి, నాగభూషణం, భాస్కర్‌లు అమాయకుల భూముల ద కన్నేసి భూములు కొట్టేస్తున్నారన్నారు. రూ.500 రూపాయలు విలువైన అటవీశాఖ భూమిని ఇప్పటికే కబ్జా చేసేశారని తెలిపారు.
ఇలా ఎప్పటికీ పదివేల కోట్ల రూపాయలు పాపాల పెద్దిరెడ్డి దోచారని వ్యాఖ్యలు చేశారు. వడ్డీతో సహా కక్కించి పుంగనూరు ప్రజల కోసం ఆ డబ్బుని ఖర్చు పెట్టిస్తానని అన్నారు. రిజర్వాయర్ కోసం బలవంతంగా భూములు లాక్కున్నారని… ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని.. పుంగునూరు, పీలేరు, మదనపల్లిని మదనపల్లి జిల్లాలో కలుపుతామన్నారు. తాను జిల్లా దాటిన తర్వాత చల్లా బాబు ప్రతి ఇంటికి వస్తారని… ఆయన్ను ఆశీర్వదించాలని లోకేష్ కోరారు.