చిన్నారిపై కుక్కల దాడి ఘటనపై హైకోర్టు ఆగ్రహం
దాడులను నియంత్రించాలని ఆదేశం
షెల్టర్ హోమ్‌లకు తరలించే ఆలోచన చేయాలని సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోర్టు ఆదేశించింది. వొచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3లక్షల 80 వేల వీధికుక్కలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని తెలిపింది. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైరవిహారం ఎక్కువైందని కోర్టు పేర్కొంది.
వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వొచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది. కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో సంవత్సరం న్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా…వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ తెలిపారు.
కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం వెల్లడించారు. హైదరాబాదులో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని హైకోర్టుకు ప్రభుత్వం తెలియ జేసింది. ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ ఉంటుందన్నారు. అయితే స్టెరిలైజేషన్ ద్వారా దాడి ఘటనలను ఎలా ఆపుతారని హైకోర్టు మరో ప్రశ్న వేసింది.
షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఎనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నాగపూర్‌లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లో పెట్టినట్టు హైకోర్టుకు అనిమల్ వెల్ఫేర్ తరపున న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని ధర్మాసనం తెలిపింది. అలాగే తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.