“అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే.”
కనుక మనం మార్క్సియన్ ఆలోచనలు ఎందుకు విఫలమయ్యాయో తీవ్రంగా ఆలోచించవలసి ఉంది. అసలు మార్క్స్ ఆలోచనలు విఫలమయ్యాయా, మనమే మార్క్స్‌ను విఫలం చేశామో ఆలోచించవలసి ఉన్నది. నాకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుందంటే, ఛాందసవాదం, అది ఏ పేరు పెట్టుకున్నారే, ప్రమాదరకమైనది. కమ్యూనిస్టు వ్యవస్థలలో కూడా ఛాందసవాదం వల్లనే ఘర్షణలు, చీలికలు వచ్చాయి . ప్రస్తుత, భవిష్యత్ తరాలు తీవ్రంగా పరిశోధించవలసిన ప్రశ్నలు ఇవేనని నేనుకుంటాను. ఎందువల్ల ఉదారవాద, ప్రజాస్వామిక, సమిష్టివాద, ప్రగతిశీల పాలనలు కూలిపోయాయి , విఫలమయ్యాయి ? ఆలోచించవలసి ఉంది.
అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే. ఐతే గుర్తించవలసిన సంగతి ఏమంటే ఇప్పటికీ చర్చ, పోరాటం సాగుతూనే ఉన్నాయి . మనం ఇంకా హక్కుల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కాని రేపు ఎవరైనా, అసలు మానవ హక్కుల ప్రకటన రచయితలకే మానవ హక్కుల మీద విశ్వాసం లేనప్పుడు అసలు ఆ భావనకు అర్థం ఉందా అని ప్రశ్నించవచ్చు. ఈ ఆలోచనలన్నీ నేను శంకర్ గుహనియోగి హత్యకేసులో కిరాయి హంతకుడికి మాత్రం శిక్షపడి, సంపన్నులకు శిక్షలు పడకపోయిన సందర్భంలో చేస్తున్నాను. ఇవన్నీ చట్టబద్ధపాలనకు సంబంధించినవే. చట్టబద్ధ పాలన లేనప్పుడు, హక్కుల ఆధారిత దృక్పథం లేనప్పుడు, అధికారం మీద ఆధారపడిన పాలనా వ్యవహారాలు సాగుతున్నప్పుడు, పల్టన్ మల్లా లాంటి వారికి మాత్రమే శిక్షలు పడతాయి . అతడిని కిరాయికి పెట్టుకున్న వ్యాపారవేత్తలకు శిక్షలు పడవు. అది పూర్తిగా ఊహించదగినదే. ఆ శిక్షకు చాలా లోతైన కారణాలున్నాయి . ఆ కారణాలు మన న్యాయ వ్యవస్థలో ఎక్కడబడితే అక్కడ కనబడతాయి . ఇదంతా ఏదో నిరాశకు దారి తీస్తుందనుకోనక్కరలేదు. హక్కుల ఆధారిత దృక్పథం గురించి మరింత నిబద్ధతతో పని చేయడానికి ఈ చర్చ అవసరం. అంతే హక్కుల ఆధారిత దృక్పథాన్ని హింసాత్మక విప్లవం ద్వారా తేవడం. సాధ్యం కాదని కూడా నాకనిపిస్తుంది.
ప్రాబ్లమ్స్ ఆఫ్ చైనా అని బెర్జ్రాండ్ రస్సెల్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసింది 1920లలో చైనాలో 1949లో విప్లవం వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని పునర్ముద్రించారు. అప్పటికి రస్సెల్ ఇంకా బతికి ఉన్నాడు. ‘ఈ పుస్తకాన్ని మార్చి రాయవలసిన, సవరించవలసిన అవసరమేమీ కనబడడం లేదు.’ అన్నాడు. మావో నాయకత్వంలోని విప్లవం గురించి రస్సెల్ మూడు అభ్యంతరాలు చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం తెలుసునా, మావోదానికి జవాబు రాశాడు. మన దగ్గర అంతే ‘‘బూర్జువా మేధావి, తలచెడిన మేధావి, ఎటు నీ ప్రయాణం, అతని రాతలకు జవాబిచ్చేది ఏమిటి’’ అంటారు గదా, కాని మావో మాత్రం జవాబు రాశాడు.
రస్సెల్ లేవనెత్తిన ఒక్కొక్క అంశానికీ మావో వరుసగా జవాబిస్తూ పోయాడు. ఎందువల్ల ఈ మార్పు హింసాత్మకంగా ఉండవలసి వస్తుంది అని జవాబు రాశాడు. అంతే ఆ తర్వాత ఆయన కూడా విఫలమయ్యాడనుకోండి. అది వేరే సంగతి, మావో చేసిన వాటన్నిటినీ డెంగ్ సియావో పింగ్ మార్చివేశాడు. ఇదంతా జరుగుతూనే ఉంటుంది. సమాజం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి తెచ్చిన మార్పులు వాటితోపాటు అనేక వైరుధ్యాలను తీసుకొస్తాయి . ఆ వైరుధ్యాలు ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతాయి . మనం ఇప్పటికే ఆ మార్పులు చూస్తున్నాం. పెట్టుబడిదారీ విధానం ఎట్లా ప్రపంచ వ్యాప్తమయిందో దానికి ప్రతి ఘటన కూడా అట్లాగే ప్రపంచ వ్యాప్తమయింది . ఈ ప్రపంచ వ్యాప్త ప్రతి ఘటన నిర్మాణాల మీద విశ్వాసం ఉన్నది కాదు. కాని సమాజాన్ని ఏ విధంగా పునర్నిర్మిస్తే అది మెరుగయినదిగా ఉంటుంది, ఆ మార్పుకు మార్గదర్శకంగా ఉండే సూత్రాలేమిటి ఆలోచించవలసిన సమయం ఇదే. ఎందుకంటే ఇవాళ ఎవరూ తమ రాజకీయ తాత్విక దృక్పథం గురించి ఇదే ఇక అంతిమం అని చెప్పగలిగే పరిస్థితి లేదు. అది చాలా కష్టతరమైన విషయమై పోయింది.. ఆ రాజకీయ తాత్విక దృక్పథం ఎంత సరయి నదయినప్పటికీ అది కాలం చెల్లినదయితే దాన్ని ఇవాళ యథాతథంగా అమలు చేస్తామని అనడం కుదురదు.
ఉదాహరణకు ఈ మధ్య అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్ అనే పేరుతో చంపేశారు. ఆ వ్యక్తి భార్య ధర్నాకు కూచుంది. ఈ వాస్తవాన్ని మీరు గుర్తించక పోతే సాధించగలిగినది ఉండదు. నేను ఈ విషయమై రాస్తూనే ఉన్నాను. మీరు మీ ప్రభావ పరిధిని పెంచుకోదలచుకుంటే ఇటువంటి పద్ధతులు వదిలివేయాలని చెబుతూనే ఉన్నాను. ఈ మధ్య వరంగల్ ఎస్ పి స్టీఫెన్ రవీంద్ర చేసిన ఒక ప్రకటన చూశాను. వరవరరావు, కళ్యాణరావు, గద్దర్ ఇతర నక్సలైటు నాయకులు సరెండర్ కావాలని ఆయన ప్రకటన చేశాడు. ఇరవై ఏళ్ల కిందగాని, పది ఏళ్లకిందగాని ఇటువంటి ప్రకటన వచ్చే అవకాశం లేదు. దీని అర్థం ఏమంటే, మీ పద్ధతులు క్రమక్రమంగా అసందర్భంగా మారిపోతున్నాయన్నమాట. అందువల్ల మీ కార్యక్రమాలను, సమస్యల పట్ల వైఖరులను పునరాలోచించుకోవలసి ఉంది. పునర్నిర్మించుకోవలసి ఉంది. కొత్తగా ఆలోచించవలసి ఉంది.
కొంత కాలం కింద ‘‘ఇన్ఫార్మర్లను చంపి శవాలను మాయం చేయండి’’ అని పోలీసులు పార్టీ పేరు మీద ఒక తప్పుడు ప్రకటన చేశారుగదా. అది ఎందువల్ల వచ్చింది? అటువంటి దురాలోచనను పోలీసులు తామే కనిపెట్టలేదు. ఒక ప్రజారాజకీయ పార్టీ తన వైఖరులలో వెసులుబాటు ప్రదర్శించలేదు గనుక, మొండిగా , వెరటుగా తన పద్ధతులు పాటిస్తూ పోయింది గనుక, పోలీసులకు ఆ ప్రకటన చేయడం సులభమయింది . ఇది చెపుతుంటే, నాకు ఒక పాత సంఘటన జ్ఞాపకం వస్తోంది. గిరాయిపల్లిలో బూటకపు ఎన్కౌంటర్ జరిపిన మెదక్ ఎస్పి సుభాష్‌చంద్రబోస్ ఉన్నాడు గదా, భార్గవ కమిషన్ విచారణలో భాగంగా నేను ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాను. పోలీసులు మూస ప్రకటనలు చేస్తుంటారు గదా. వాటిని నేను విప్పిచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ‘‘మీరు ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకుని లాకప్‌లో పెట్టారనుకోండి. అతని మీద నేరారోపణ చేయాలి. అతను నక్సలైటుఅని, అతను చేసినది నక్సలైటు నేరమని మీరు ఎట్లా నిర్ధారిస్తారు?’’ అని అడిగాను.
‘‘ఒక మారణాయుధం, కొన్ని విప్లవ సాహిత్య పుస్తకాలు, కొన్ని నాటు బాంబులు ఉన్న చేతిసంచి అతని దగ్గర గాని, ఆ నేరస్థలంలో గాని దొరుకుతుంది. కాబట్టి అతడిని నక్సలైటుగా గుర్తిస్తాము ’’ అని ఆ ఎస్పి చెప్పాడు.‘‘అంటే ఈ ఆధారాలు ఎక్కడ దొరికినా అది నక్సలైటు నేరమన్నట్టేనా, ఆ పరిసరాలలో ఉన్న వారు నక్సలైట్లు అన్నట్టేనా?’’ అని నేనడిగాను.
వొచ్చే సంచికలో…




