నైటింగేల్‌ ‌కు నిజమైన వారసులు నర్సులు

‌ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అని తలంచి, మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు.

అవివాహితలు ఇంటి పనులు, చర్చి పనులే చేయాలనీ ఆంక్షలు విధించ బడిన రోజులవి.స్త్రీలు ఇంటి పట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఆమె ఛేదించింది. ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగ బడింది. పేదలకు, అనాథలకు సేవ చేయాలన్న అభిలాషతో, ఇంటా, బయటా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, లక్ష్య సాధనలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించింది. రోగుల పాలిటి దేవతగా వెలుగొందింది. ఆమే విశ్వ విఖ్యాత ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌.

‌నైటింగేల్‌ ఎం‌తో గొప్పింటి పిల్ల అయినా నర్సుగా సేవలు అందించడానికే నిశ్చయించుకుంది.

ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ 1820, ‌మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌ ‌లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్‌, 1854‌లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది.

‘‘ది లేడీ విత్‌ ‌ది లాంప్‌’’ ‌గా పిలువబడే ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌, ఒక బ్రిటిష్‌ ‌నర్సు, సామాజిక సంస్కర్తగా, గణాంక నిపుణురాలిగా, ఆధునిక నర్సింగ్‌ ‌స్థాపకురాలుగా ప్రసిద్ది గాంచింది.

వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ ‌పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపు కుంటారు. ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటారు.

ఆ రోజుల్లో ఆస్పత్రులు అధ్వాన్న స్ధితిలో ఉండేవి. శుచి, శుభ్రత, ఏమాత్రం ఉండేవికావు. అయినాకూడా ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ ‌నర్సింగు పని చేయడానికే నిర్ణయించుకుంది. తన తల్లి సాహితి ప్రపంచంలో ధ్రువతారగా వెలగాలని కోరినా, ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌, ‌జర్మనీలో కైసర్‌ ‌సంస్థను గూర్చి విని, అక్కడే పని చేయాలనీ నిర్ణయించుకుంది. ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకుని పెంచడం మొదలు పెట్టింది.1852 లో ఐర్లాండ్‌ ‌వెళ్ళింది. అక్కడి ఆసుపత్రులను చూడగానే వాటిల్లో విప్లవాత్మకమైన మార్పులను తేవాలి అనుకున్నది. 1853 లో సిస్టర్స్ ఆఫ్‌ ‌చారిటికి వెళ్ళింది. తిరిగి లండన్‌ ‌వచ్చి, తన నాయనమ్మకు సేవ చేయడానికి రాగా అక్కడ కలరా వ్యాపించింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి రోగులకు, పగలు, రాత్రి అనక సేవలందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854-56 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ ‌వచ్చి తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమాన సేవలందించింది. ధైర్యం చెప్పింది. సాటి నర్సులు విసుక్కునేవారు. ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాం అనేవారు. కానీ ఎంతో ధనిక కుటుంబం లోనుంచి వచ్చిన ఆమె ఏరి కోరి పనిని ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో చేసేది. గుండె నిబ్బరంతో, చిమ్మ చీకట్లో కూడా చిరు దీపం వెంట తీసుకుని వెళ్లి సేవలు చేసేది. అందుకే ఆమె లేడీ విత్‌ ‌ది లాంప్‌ ‌గా వాసికెక్కింది.

మొదట్లో ఆమెను చూసి అధికారులు జ్వలించి పోయేవారు. తరువాత ఆమె నిరుపమాన సేవకు ముగ్ధులయ్యారు. వారికి రోజూ, రోగులకు కావాల్సిన మందులు పరికరాలను పంపమని అభ్యర్ధనలు పంపి, పలుమార్లు స్వంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని తెప్పించేది. ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే, అధికారులను ఒప్పించి పాత ఇళ్ళను, భవంతులను ఆసుపత్రులుగా మార్చేది. రాత్రులలో రెండు, మూడు గంటలే పడుకుని అహర్నిశలు పని చేసేసరికి ఆమె చిక్కి పోయింది. అయినా రోగులకు ఆమె ఆరాధ్య దైవం. ఆమె నడచిన దారి అతి పవిత్రం. వారు విక్టోరియా రాణి మరణిస్తే ఫ్లారెన్స్ ‌ను రాణి చేస్తామని’’ అనేవారట. ఆమె ఎక్కడికి వెళ్ళినా సైనికులు అడవి పూలతో పుష్ప గుచ్చాల నిచ్చేవారట. అది చూసి తోటి డాక్టర్లు, నర్సులు అసూయ చెందేవారట. అయినా ఆమె తన సేవలను మానకుండా చేస్తూండగా ఒకనాడు స్పృహ తప్పి పడిపోయింది. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది. కాసిల్‌ ఆసుపత్రిలో ఆమెను రోగిగా చేర్చుకున్నారు. ఆమెను చూసి మిగతా రోగులు కన్నీరు కార్చారు. అయినా ఆరోగ్యం మెరుగు పడగానే, తిరిగి క్రిమియా, స్కుటారి ఆసుపత్రుల మధ్య తిరుగుతూ రోగులకు సేవలందించింది. గ్రంథాలయాలు, చదువుకునే గదులు అందరికి అందుబాటులో ఉండేటట్లు చూసి అక్షరాస్యతను పెంచింది. ఆమె నోట్స్ఆన్‌ ‌హాస్పిటల్స్, ‌నోట్స్ ఆన్‌ ‌నర్సింగ్‌, అనే గ్రంథాలను వ్రాయడమే కాకుండా, విక్టోరియా రాణికి, ప్రభుత్వ అధికారులకి హాస్పిటల్స్ ‌బాగు కొరకు అభ్యర్థనలను పంపింది. అప్పటి నుంచే నర్సులకు తప్పనిసరిగా శిక్షణను ఇవ్వడం ప్రారంభమైంది. 1860 జూన్‌ 24 ‌న నైటింగేల్‌ ‌ట్రైనింగ్‌ ‌స్కూల్‌ ‌ఫర్‌ ‌నర్సేస్‌ అనే సంస్థను లండన్‌ ‌లో స్థాపించారు. ఆమెను’ మదర్‌ ఆఫ్‌ ‌మోడరన్‌ ‌నర్సింగ్‌’ ‌గా గుర్తించారు..

భారత దేశానికి కూడా ఆమె ఇతోధిక సేవలన ందించింది. 1859 లో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమిషన్‌ ‌ను నియమించింది. చెన్నై నగరపు మేయర్‌ ఆడ నర్సులకు శిక్షణను ప్రోత్సహించారు.

1859లో ‘నోట్స్ ఆన్‌ ‌నర్సింగ్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ‌ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ ‌సేవలను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌నర్సెస్‌’ ‌సంస్థ 1965 నుండి నైటింగేల్‌ ‌పుట్టిన రోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.

నర్సులు దినోత్సవం రోజున, నర్సింగ్‌ ‌విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారత రాష్ట్రపతి నేషనల్‌ ‌ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ అవార్డులను అందిస్తారు. 1973లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసాపతరం, జ్ఞాపికతో పాటు 50వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.

రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం. నర్సులు లేదని ఆసుపత్రి సేవలే లేవు. కరోనా వైరస్‌ ‌పై ఎలాంటి స్థితి నైనా ఎదుర్కొంటూ, పోరాటం సాగిస్తున్నారు నర్సులు.

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అని తలంచి, మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు.

రోగులు ఎంత బంధులైనా, సన్నిహితులైనా, రక్త సంబంధీకులు అయినా, అల్లంత దూరం పారిపోయే నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిల లాడుతున్న వారికి నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. అందుకే వారందరికీ శిరసు వంచి మానవత్వం  ప్రణమిల్లుతోంది. కరోనా బారిన పడిన బాధితులను కాపాడటానికి ఫ్లారెన్స్ ‌నైటింగేల్‌ ‌లు ప్రతి రూపాలుగా వారు చేస్తున్న సేవలు అపూర్వం, అసామాన్యం, అనిర్వచనీయం, అభినందనీయం. కొరోనా బాధితులకు నిత్యం సేవలు చేస్తున్న వైద్య సిబ్బందిలో, తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రధాన పాత్రలు పోషిస్తున్న నర్సుల   సేవలను ఎలా మరిచిపోగలం,  వారి ఋణం ఎలా తీర్చుకోగలం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page