రెండుసార్లు ముఖ్యమంత్రి.. అయితేనేమీ కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాడు, నిరుపేదరికాన్ని తలపించే ఆయన స్వగృహం.. ఇవి ఆయన నిరాడంబర జీవితానికి మచ్చుతునకలు. కనీసం విదేశాలకు వేళ్ళేప్పుడైనా మంచిబట్టలు వేసుకోవాలని ఆశించని వ్యక్తి. తొలి శాసనసభ్యుడిగా బీహార్‌నుండి ఆస్ట్రీయాకు వెళ్ళిన ప్రతినిధి బృందం సభ్యుడిగా స్నేహితుడి నుంచి చిరిగిన కోటును అడిగి వేసుకుని వెళ్ళినప్పుడు, అక్కడ యుగోస్లేవియా అధినేత మార్షల్ టిటో ఆయనను గమనించి కొత్త కోటును బహుమతిగా అందించాడంటే ఆయన ఎంతటి నిరాడంబర జీవో అర్థమవుతున్నది.
అలాంటి పరిస్థితిలో కూడా ఆయన సామాజిక` రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్రవేసిన వ్యక్తి.. ఆయనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్. ఆయన జీవనం, రాజీలేని అంకితభావం నేటి రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శప్రాయం. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సోషలిస్టునేతగా, తన జీవితాంతం సామాజిక న్యాయం కోసం, సమాజ అభ్యున్నతికి అలుపెరుగని పోరాటంచేసి ‘జననాయకుడి’గా కీర్తించబడిన కర్పూరీ ఠాకూర్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత ‘భారతరత్న’ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. నేటి భారత దేశానికి అలాంటి వ్యక్తుల అవసరం ఎంత్తైనా ఉంది.
కోట్లాదిమంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కర్పూరీ ఠాకూర్ లాంటి వ్యక్తులు లోపించడం నిజంగానే మన దురదృష్టం. వెనుకబడిన తరగతుల వారికి తగిన గుర్తింపు, గౌరవంకోసం ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. వారి అభ్యున్నతి విషయంలో ఎవరు వ్యతిరేకించినా పట్టువీడని విక్రమర్కుడిలా ఆయన వేసిన పునాది పటిష్టమైనది. వెనుకబడిన వర్గాలకోసం ఏర్పడిన మండల కమిషన్ కన్నా ముందే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏర్పరిచిన ముంగేరీలాల్ కమిషన్ సిఫారసులను అమలుపర్చడం ద్వారా బిసీ వర్గాల విద్య, ఉద్యోగాల్లో వాటాను సిఫారసు చేసింది. సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణంకోసం ఆయన అమలుచేసిన విధానాలు, సంస్కరణల ఫలితంగా లక్షలాది మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు లబ్ధిపొందే అవకాశం లభించింది.
బీహార్‌రాష్ట్రంలోని సమస్థిపూర్ జిల్లాలోని పితోంరaయా గ్రామంలో 1924 జనవరి 24వ తేదీన నాయీ బ్రాహ్మణ సామాజికవర్గంలో జన్మించిన ఠాకూర్, చిన్ననాటినుండే స్వాతంత్య్ర భావాలను పుణికిపుచ్చుకున్నారు. ఆ కాలంలో సాగుతున్న స్వాతంత్య్ర ఉద్యమం ఆయనను బాగా ఆకిర్షించింది. ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థినేతగా ఉన్న క్రమంలోనే చదువుకు స్వస్తిచెప్పి నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఠాకూర్ జైల్ జీవితాన్ని కూడా అనుభవించారు. అనంతరకాలంలో ఉపాధ్యాయుడిగా, సోషలిస్టు నేతగా కొనసాగుతూ 1952, 1977ల్లో రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ఈ రెండుసార్లు కూడా ఆయనను పూర్తికాలం పదవిలో బీహార్ రాజకీయాలు కొనసాగనివ్వలేదు. అయినా ఆయన 1952నుండి చనిపోయేనాటి వరకు కూడా వరుసగా శాసనసభ్యుడిగా ఎన్నుకవుతూనే వొచ్చారు. ముఖ్యమంత్రిగా తక్కువ సమయం కొనసాగినప్పటికీ వెనుకబడిన వర్గాలవారి అభ్యున్నతి కోసం ఆయన విశేష సేవలందించారు.
సోషలిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించిన రాంమనోహర్ లోహియా ప్రభావం ఆయనపైన బాగా పడిరది. అదే క్రమంలో బిసి నేతగా ఆయన ప్రభావంకూడా బిసీ దిగ్గజాలైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, నితీష్‌కుమార్ లాంటివారికి స్ఫూర్తిదాయక మయింది. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూసిన ఆయనకు ఈ జనవరి 24న శతజయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను మంగళవారం నాడు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదలచేయడం ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆ మహనీయుడిని స్వయంగా కలిసే అవకాశం లేకపోయినా ఆయన నిస్వార్థసేవకు జోహర్లు అర్పించకుండా ఉండలేమని మోదీ పేర్కొనడం హర్షించదగిన విషయం. ఆయన తన ప్రకటనలో కర్పూరీ ఠాకూర్ ఎంతటి నిరాడంబరుడన్న విషయాన్ని చెబుతూ.. తన కుమార్తె వివాహానికి కూడా తన సొంత డబ్బును మాత్రమే వ్యయం చేశాడని, అలాగే తన వ్యక్తిగత కార్యక్రమాలేవైనా సొంత డబ్బునే వ్యయం చేసేందుకు ఇష్టపడ్డాన్నారు.
ముఖ్యమంత్రిగా రాజకీయ నాయకులకోసం ఒక కాలనీ నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నా, తాను మాత్రం ప్రభుత్వ భూమి, డబ్బు ముట్టుకోని వ్యక్తి ఠాకూర్. మరో కలచివేసే సంఘటన ఏమిటంటే.. 1977 ప్రాంతంలో దిల్లీ,పాట్నాలో జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని పాట్నాలో జనతాపార్టీ నేతలు, అనేక ప్రముఖులు సమావేశమైనారు. ఆనాడు బీహార్ ముఖ్యమంత్రిగా ఆ సమావేశానికి హాజరైన కర్పూరీ ఠాకూర్ చిరిగిన కుర్తాతో వెళ్ళారట. అదిచూసిన చంద్రశేఖర్ ఠాకూర్‌కు కొత్త కుర్తాకోసం విరాళాలివ్వాలని తనదైన శైలిలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే నిజంగానే డబ్బు వసూలైంది. కాని, విరాళంగా వొచ్చిన ఆ సొమ్మును ఠాకూర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారట. అదే విషయాన్ని ప్రధాని మోదీ ఊటంకిస్తూ.. ఆయనకు (ఠాకూర్‌కు) సాటి ఆయనే, మరెవరూ ఆయనంత నిబ్బరంగా, నిస్వార్థంగా వ్యవహరించలేరన్నారు. అలాంటి మహామనీషి నిజంగా ‘భారతరత్న’మే.