నిశ్శబ్ధాన్ని బద్దలు కొడదాం!

సమాజంలో కొన్ని విషయాల మీద చాలా మార్పు వచ్చినట్లే కనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా అనేక ఆంక్షలు పనిచేస్తూ వుంటాయి. చర్చ జరిగినట్లే గంభీరంగా వుంటుంది, కానీ దాని వెనుక కరడుగట్టిన నియంతృత్వం పనిచేస్తూ వుంటుంది. ఆధునికత, సమానత్వం అనే సూత్రాల వెనుక తమ ఛాందసాన్ని, మూర్కత్వాన్ని దాయాలనుకుంటారు. చర్చ మొదలుకావడమే అపవిత్రం అన్న చందాన తీర్పులు ఇస్తారు. గత కొన్నిరోజులుగా మీడియాలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్త్రీల ‘బహిష్టు’ అంశంపై చేసిన వాఖ్యలుపెద్ద దుమారాన్నే లేపాయి. రాజ్యసభలో ఒక ప్రతిపక్ష సభ్యుడు మనోజ్‌ కుమార్‌ రaా మాట్లాడుతూ స్త్రీల నెలసరి సమయంలో ప్రభుత్వ వుద్యోగులకు తప్పనిసరిగా ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వటం ఒక విధానం అమలుచేయాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించినప్పుడు దానికి సమాధానంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వాఖ్యల మీద మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఒక పురుష సభ్యుడు ఆ అంశం మీద ఒక విధానపరమైన  చర్చ కోసం ప్రశ్న అడిగితే, వ్యక్తిగత అభిప్రాయం చెబుతున్నానంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు జెండర్‌ సెన్సిటివ్‌గా లేవు. ఒక అంశం గురించి విధానపరమైన  చర్చ చేపట్టాల్సిన విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదు. మరీ ముఖ్యంగా విధానపరమైన అంశాలను చర్చించే సభలో బాధ్యతాయుతమైన అధికార స్థానంలో వున్నప్పుడు! ఇంతకీ ఆవిడ ప్రవచించిన వాఖ్యలు ఒకసారి ఇక్కడ చూద్దాం…

‘‘బహిష్టు వికలత్వం కాదు. స్త్రీల జీవితంలో అది ఒక సహజమైన ప్రక్రియ. స్త్రీల సమానత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి అంశాలను మనం ప్రతిపాదించకూడదు’’ అని సెలవిచ్చారు. వినటానికి చాలా బాగుంది. నిజమే, బహిష్టు ఒక సహజమైన శారీరక ప్రక్రియ. కానీ, అది సమానత్వాన్ని కలిగిస్తోందా? ఆ కారణంగా వివక్షకు కారణం అవుతోందా? ఇలాంటి అంశాలను ప్రతిపాదించకూడదు అంటే ఇప్పటికీ బహిస్టు సమాజంలో మాట్లాడకూడని రహస్య అంశమే. అదే ఆవిడ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో వుండి ఆదేశించారు. బహిష్టు విషయంలో శారీరకంగా కానీ ఆర్థికంగా, సామాజికపరంగా కానీ స్త్రీలందరి అనుభవం ఒకటే వుండదు. నిజానికి ఈ అంశం చుట్టూ సమాజ అంతరాల్లో వున్న నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టటానికి, సమాజంలోని అన్ని వర్గాల, సమూహాలలో పేరుకొనివున్న మూఢత్వాన్ని తొలగించటానికి వ్యవస్థాపరంగా ఒక క్రమ పద్ధతిలో చేపట్టాల్సిన చర్యల గురించి ఆవిడ ప్రతిపాదించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల స్త్రీల నుంచి, స్త్రీల సమస్యల మీద పనిచేస్తున్న సంస్థల నుంచి క్షేత్రస్థాయి అభిప్రాయాలను కోరేవిధంగా చొరవ తీసుకోవచ్చు. ఒక విస్తృత జనాభిప్రాయ సేకరణను, సర్వేని చేయాలని సూచించవచ్చు. ఇవన్నీ విధానసభలో జరిగే చర్చకి కొనసాగింపుగా మాట్లాడి వుండవచ్చు. కానీ ఆవిడకు ఇవన్నీ ఒక ఇంటిగుట్టులాంటి వ్యవహారం. బయటకు మాట్లాడితే ఎలా?
వాస్తవంలో ఏం జరుగుతూ వుందో కొంచెం పరిశీలిద్దాం. ప్రకటనల్లో ఆకర్షణీయంగా, అందంగా చూపించినట్లు బహిష్టు అంటే కేవలం మెషీన్‌ తయారీతో వచ్చే శానిటరి నాప్కిన్స్‌ మాత్రమే కాదు. వాటిల్లో చూపించినంత అందంగా ఆ మూడు నాలుగురోజుల వ్యవహారం వుండదు. ఆర్థిక, సామాజిక అంతరాలు అడుగడుగునా వుంటాయి. అల్ట్రామాడ్రన్‌ నాప్కిన్స్‌ కొంతమందికి వాడే అవకాశం వుంటే, మార్చుకోను బట్ట కూడా దొరకని సమూహాలు ఈ దేశంలో ఎన్నో వున్నాయన్నది పచ్చి వాస్తవం.

బట్ట కూడా వాడకపోతే ఆ సమయంలో ఆడవాళ్ళు రక్తస్రావం ఆపటానికి ఏం వాడతారు అనే అనుమానం రావాలి ఎవరికైనా! కానీ రాదు. ఎందుకంటే, ఆ సమూహాల్లో మనం వుండము కాబట్టి! బూడిద, ఇసుక, ఎండు ఆకులు, కొబ్బరి, తాటిపీచు లాంటివి కూడా వాడాల్సి వస్తుందని, వాటి వల్ల ఎన్నో ప్రమాదకర అనారోగ్య పరిస్థితులకు లోనవుతారని, అయినాగానీ ఆ సమూహాలకు అందుబాటులో ఆరోగ్య వ్యవస్థ అనేదే వుండదని సదరు మంత్రిగారికి తెలిసే అవకాశం వుండదు. ఆవిడ మాట్లాడే సమానత్వంలోకి ఈ స్త్రీలు దారిదాపుల్లోకి కూడా రారు.
ఇప్పుడు బహిష్టు చుట్టూ వుండే వివక్ష దగ్గరికి వద్దాం. వివక్ష ఏవో కొన్ని కులాల్లోనే, అదీ ‘ముట్టు గుడిసెలు’ వంటి ఆచారాలను పాటించే కులాల్లోనే వున్నాయనుకోవటం, మిగతా అన్ని కులాలలో విజ్ఞానం, అవగాహన, సమానత్వం  వచ్చిందనుకోవటం ఒక ఆధిపత్య సంస్కృతి. అచ్చం మన మంత్రిగారు సెలవిచ్చినట్లన్నమాట! వందేళ్ల నాటి పరిస్థితులకీ ఇప్పటికీ అనేక మార్పులు చోటుచేసుకునే వుంటాయి. బట్టవాడే స్థాయి నుంచీ శానిటరీ నాప్కిన్స్‌ వాడేవరకూ అవగాహన పెరిగింది. కానీ అదొక్కటే విషయం కాదే! అంతకు మించిన అంశాలు బహిష్టు చుట్టూ నడుస్తున్నాయి కదా! వాటి గురించి ఎప్పుడు మాట్లాడతారు? ఎవరు మాట్లాడుతారు?
బహిష్టు కేవలం వ్యక్తిగతమే కాదు, సామాజికం కూడా! అలానే, కేవలం ఆడవాళ్లకు మాత్రమే సంబంధించిన విషయంగా  మాత్రమే వుండదు. దాని చుట్టూ ఎన్నో క్లిష్టమైన, వివక్షా పూరితమైన పితృస్వామ్య, కుల- మత ఆచారాలు పెనవేసుకుని వున్నాయి. బహిస్టు కేవలం ఒక శారీరక ప్రక్రియ మాత్రమే కాదు. మన దేశంలో ఇది స్త్రీల సెక్సువాలిటీతో ముడిపడిన అంశం కాబట్టి దానిని అదుపుచేసే పితృస్వామ్య వ్యవస్థ మనకు కులాంతర, మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా పనిచేసే ఉన్మాదంగా కూడా కనిపిస్తుంది. శుభ్రం, అపరిశుభ్రం, అపవిత్రత అంశాలు అందులో భాగమనే అంశం వినటానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ స్త్రీల సెక్సువాలిటీ అనే అంశం అంతర్లీనంగా దాగివుంటుంది.

వయసుతో నిమిత్తం లేకుండా చాలామందికి మొదటిసారి బహిష్టు వచ్చే సమయానికి దాని గురించి ఏమీ అవగాహన వుండదు. అవగాహన కల్పించే వ్యవస్థలు చాలా తక్కువ. కుటుంబాల్లో జరిగే ఆచార వ్యవహారాలే సమాచారసాధనంగా వుంటాయి.  ఏ స్త్రీని కదిలించినా, మొదటిసారి బహిష్టు వచ్చినప్పుడు బయట వేరుగా కూర్చోబెట్టి, విడిగా కంచం- గ్లాసు ఇచ్చి అంటరానితనం పాటించిన అవమానం గురించి ఎంతోకొంత మాట్లాడతారు. ఒకప్పటి కంటే, మధ్యతరగతి వర్గాలలో బహిష్టుని ఆచరించే విధానాలలో చాలా మార్పు వచ్చిన మాట నిజమే కానీ, దాని వెనుక వున్న సాంస్కృతిక భావజాలం ఏ మాత్రం మార్పు చెందలేదనేది కూడా అంతే వాస్తవం.

ఇప్పటికీ ప్రతినెలా బహిష్టు ఏ సమయంలో వచ్చినా గానీ, శుభ్రం పేరుతో ఎలాంటి శారీరక అనారోగ్యంతో వున్నా గానీ వెంటనే తలస్నానం చేయటం తప్పనిసరి అనే భావనలో చాలా కుటుంబాలు వుంటాయి. అలాగే బహిష్టు అయిన మూడు లేదా ఐదు రోజుల తర్వాత కూడా తలస్నానం చేయటం. అన్ని రోజులూ ఇళ్ళల్లో పచ్చడి జాడీలు, బట్టలు, బీరువా తాళాలు ముట్టుకోకపోవటం, పూజ చేయటం, దీపం పెట్టకపోవటం వంటివి ఆచరించేవారు అత్యధికంగానే వున్నారనేది వొప్పుకుని తీరాలి. దీనికి కారణం బహిష్టుని ఒక అపవిత్రంగా లోలోపల భావించడమే! బహిష్టుని సహజంగా కన్నా అపవిత్రంగానే చూస్తున్న సమాజంలో దాని గురించి మంత్రిగారు మాట్లాడ వొద్దనటం కూడా అందులో భాగంగానే అర్థంచేసుకోవాలి మనం.
బహిష్టు సహజమైన ప్రక్రియ అయితే, ఇప్పటికీ కూడా ఆ సమయాల్లో పూజలు చేయటం, గుడికి వెళ్లటం, పెళ్లి, వ్రతాలు వేడుకలకు వెళ్లడాన్ని తప్పుగానే భావించడం ఎందుకు జరుగుతోంది? తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితులు వుంటే మందులు వాడి బహిష్టుని వాయిదా వేసుకునే దానికి తమని తాము సిద్ధం చేసుకోవటమే కాదు, కుటుంబాలు కూడా ఆడవాళ్ళని ఆ వైపుగా నెడుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఆధునికత పెరిగేకొద్దీ తమ ఆచార, సాంప్రదాయాలకు అడ్డురాకుండా స్త్రీల ప్రాణాలను పణంగా పెట్టయినా సరే మందులు వాడి బహిష్టుని అదుపుచేయటానికి కుటుంబ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూ వుంటాయనేది వాస్తవం. దీనివలన ఆడవాళ్ళ శరీరాల్లో వచ్చే దుష్ప్రభాలకన్నా మూఢనమ్మకాలే ఆధిపత్యం చేస్తున్నాయనటానికి చాలా అనుభవాలు కళ్ళముందు కనిపిస్తున్నా, వాటి గురించి ఒక ఆరోగ్యకరమైన చర్చను కొనసాగించి, ఒక విధానపరమైన చర్చ చేయటానికి ఎందుకో కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగారు సుముఖంగా వున్నట్లు లేరు.

   -కె.సజయ, సామాజికవిశ్లేషకులు,
స్వతంత్ర జర్నలిస్ట్‌  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *