నిఖార్సయిన ఉద్యమకారుడు నల్లెల్ల రాజయ్య!

ఫిబ్రవరి15, ఉదయం 8: 20 నిమిషాల ప్రాంతంలో ఒక ఫోన్‌ కాల్‌ విషాద వార్తను మోసుకొచ్చింది. ప్రజా గొంతుక, శ్రామిక పక్షపాతి, నిత్య శ్రామికుడు , ప్రజా కవి, రచయిత అయిన నల్లెల రాజయ్య సారు ఇక లేరు అన్నది ఆ దుర్వార్త సారాంశం! హృదయాన్ని ఎక్కడో కోస్తున్నట్టుగా అనిపించింది. నాలో ఏదో తెలియని ఆందోళన.భూమిపై నా కాళ్లు నిలబడలేనట్టుగా అనిపించింది. కళ్ల లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఒకవైపు ఈ వార్త నిజం కావద్దని మనసు కోరుకుంటున్నా..శంకర్రావు సార్‌ మోసుకొచ్చిన వార్త నిజమే అయ్యింది.గుండెల్ని పిండేసింది. తిరుతో, హరితో, అజయ్‌, ఇతర మిత్రులతో నా ఆవేదనని పంచుకున్నాను. నన్ను నేను సముదాయించుకుంటూ, కాస్తా కంట్రోల్‌ అయ్యాక, ఒక్కసారి ఆయన గురించిన పూర్వపు ఆలోచనల్లోకి వెళ్లిపోయాను. మొన్ననే కదా! దాదాపు నెల పైబడిరది అనుకుంటాను! ఫస్ట్‌ జనవరి, 2024. సార్‌ నాకు ఫోన్‌ చేసి ఒక్కసారి రండి, కలుద్దాం అన్నారు. సహజంగా మేము కలిసినప్పుడు స్థానిక, సామాజిక సమస్యలపై చర్చించు కుంటాము. కాని ఆరోజు ఎందుకో చిన్న గెట్‌ టుగెదర్‌ ఏర్పాటు చేశారు. అది కూడా ఒక స్టార్‌ హోటల్లో. సార్‌ ఏంటి…ఇలాంటి హోటల్స్‌కి ఆహ్వానించడమేమిటి అనిపించింది. భోజనం కానిచ్చాక , కొన్ని స్థానిక విషయాలు మాట్లాడుకున్నాము.

హోటల్‌ బిల్లు నేను కట్టడానికి వెళితే నివారించి, మీరు ఆహ్వానితులు నా ఆహ్వానం మేరకు వచ్చారు. బిల్లు కట్టడం నా ధర్మం వదిలిపెట్టండని బిల్లు కట్టి మాకు వీడ్కోలు పలికాడు. అదే చివరి మీటింగ్‌. తర్వాత సార్‌ ని కలవడం కానీ, కనీసం ఫోన్‌ ద్వారానైనా సంభాషించడం కానీ జరగలేదు. మనసు పొరల్లో ఎక్కడో చాలా గ్యాప్‌ వచ్చిందే.. సర్‌ తో మాట్లాడాలని అనుకునేవాడిని. నిన్నగాక మొన్న అంటే – సార్‌ మరణానికి ముందు రోజు నేను ఒక కాన్సెప్ట్‌ రాసి తనకి షేర్‌ చేసి ఒపీనియన్‌ తెలుసుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకో పని ఒత్తిడి మూలాన ఆ పని చేయలేకపోయాను. అంతలోనే జీర్ణించుకోలేని అత్యంత విషాదకరమైన వార్త . ఈ వార్త కేవలము నాకు మాత్రమే కాదు తనతో అసోసియేట్‌ అయి ఉన్న మిత్రులందరి హృదయాలను బరువెక్కించిందేమో. సార్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన మిత్రులు, బంధువులు, సాహితీమిత్రులు, ప్రజా సంఘాల నేతలు , కవులు, కళాకారులు సామాన్య ప్రజలు, నగరవాసులు తండోపతండాలుగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. మరణం ఎవరికైనా అనివార్యమే అయినా 63 యేళ్లు పూర్తిగా నిండని వయసులో మనల్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ హెల్త్‌ ఇష్యూస్‌ ఉన్నాయని ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఉంటాయని కూడా మనం అనుకోం . ఎందుకంటే ఆయన పని విధానం అలా ఉండేది. 2000 సంవత్సరం నుండి సార్‌ నాకు పరిచయం.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న కాలంలో సార్‌ నాకు దగ్గర అయ్యాడు .ఏ వేదికల్లో చూసినా ఏ పోరాటంలోనైనా రాజ్యాన్ని ప్రశ్నించడంలో, యంత్రాంగాన్ని నిలదీయడంలో, స్థానిక సమస్యలపై స్పందించే విషయాల్లోనూ సారూ ముందుండేవారు.

దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా వారికీ మోరల్‌ బూస్ట్‌ ఇవ్వడానికి ఒక వేదికను ఏర్పాటు చేశాడు. దాని అధ్వర్యలో రైతు చట్టాలు, ఫాసిజానికి వ్యతిరేకంగా కవులు ,రచయితలను కూడగట్టి ఒక కవితాగోష్ఠిని నిర్వహిస్తే దానికి నేను అటెండ్‌ అయ్యాను. సార్‌ విషయంలో అనుభవంలో వచ్చిన ఒక విషయం ఏమిటంటే సభలు సమావేశాలలో సార్‌ పాల్గొన్నట్లయితే, సభ ఆరంభం నుండి చివరి వరకు అన్ని పనులు తనే చూసుకునేవారు. ఆయన పని విధానం అందరినీ ఆశ్చర్యం గొలిపేది. ఇంత సంసిద్ధత తనకు ఎలా వచ్చింది ! మార్క్స్‌ తాత్వికత అతన్ని అలా నిలిపిందా!? నిబద్ధతకి, నిజాయితీకి పీఠం వేయగలిగారంటే ఆ సైధ్ధాంతికత కూడా కొంత కారణం కావచ్చు. అలాగే ఇంతకుముందున్న వ్యక్తులు, వాళ్ల జీవితాలు, వాళ్ల నిత్య కార్యాచరణ ఆ ప్రభావశీలత ఏదో రకంగా తనపై పడివుండవచ్చు! లేకపోతే మనిషి అంత త్యాగాలకు సిద్ధపడటం ఏమిటి? మొన్ననే కదా సిపిఐ పార్టీ ఆఫీసులో స్వేచ్ఛ జేఏసీ ఏర్పాటు అయ్యే క్రమంలో రాజయ్య సార్‌ జిల్లా కన్వీనర్‌ గా బాధ్యతలు తీసుకొని రాష్ట్ర కన్వీనరైన నా చిరకాల మిత్రుడు సహ వైద్య విద్యాధికుడు డాక్టర్‌ తిరుపతయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

రాజ్యం చేసే దాష్టీకాన్ని ,కుట్రని ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ , సంఘ పరివార్‌, బజరంగదళ్‌, బిజెపి చేసే పాశవిక హత్యాకాండలు..హిందూ ధార్మికత, ఏకతా పేర ఫాసిజాన్ని దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్‌ చేస్తుంటే, దానిని ఎదుర్కొనే క్రమంలో మాట్లాడే గొంతుకలు ఉండాలని విశ్వసించేవారు. రచయితలను, ఉపాధ్యాయులను, సామాజిక కార్యకర్తలను అకారణంగా నెలలు తరబడి, సంవత్సరాల తరబడి జైల్లలో కుక్కుతున్న వైనం, 90 శాతం అంగవైకల్యుడైనటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబా, 80 ఏళ్ల వయోవృద్దుడైన వివి సార్‌ విడుదలపై ,ఒక పోరాట వేదిక ..ఒక కామన్‌ ప్లాట్‌ ఫారమ్‌ ఉండాలని, వామపక్ష ,ప్రగతిశీల విద్యార్థి, మేధావి ప్రజా సంఘం వాళ్ళందరితో కలిపి ఏర్పాటు చేసిన వేదికే ‘స్వేచ్ఛ జేఏసీ’. దాని నిర్వహణ బాధ్యతలు తనపై వేసుకుని, జేఏసీ నడిపించిన క్రమాన్ని ఎలా మర్చిపోగలం? రాజ్యం విషయంలో, యంత్రాంగం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆ తెగువ, ఆ పోరాటపటిమ, ఆ సింప్లిసిటీ అది ఎట్ల సాధ్యమైంది? ఇవన్నీ ఆయనను దగ్గరుండి చూసిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది .ఎంతటి అర్థవంతమైన జీవితం తనది!? ప్రజల కోసం పరితపించే మనసు అతనిది. ఆనాడు కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆయన సహాయక చర్యలు చేపట్టారు.

ఆ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పిచ్చి చేష్టలపై తప్పుడు విధానాలపై మమ్మల్నందర్నీ కూడగట్టి మాతో నాలుగు కవితా పంక్తులు రాయించి పుస్తకాన్ని కూడా ప్రచురింప చేశాడు. దుర్మార్గుడైన ఒక అమెరికన్‌ పోలీస్‌ అధికారి ఏదో ఒక చిన్న నేరారోపణపై, ఒక నీగ్రోని అతని మెడను తన కాలి కింద బలంగా నొక్కి పెట్టి ,ప్రపంచ ప్రజలు వీక్షిస్తుండగా అతని ప్రాణం అనంత వాయువులో కలిసిపోయేటట్టు చేసిన వైనాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది.. ఆ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన గళాన్ని, కలాన్ని రaుళిపించాడు. మానవ విలువల కోసం, సమాజ హితం కోసం స్వప్నించిన ఎందరో మహానుభావులు.. చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని సుస్థిరపరుచుకుంటారు. . అలాంటి వారి కోవకు చెందినవాడు మన సారు. హక్కుల సూర్యుడు బాలగోపాల్‌ సార్‌, ప్రజా కవి కాళోజి తరువాత ఆ పోరాటపటిమ రాజయ్య సర్‌ కి మాత్రమే ఉంది. ఆయన వియోగం రెండు దశాబ్దాల సాన్నిహిత్యం ఉన్న నన్నే కలిచివేస్తుంటే … నాలుగు దశాబ్దాల కాలం ఆయనతో సన్నిహితంగా మెదిలిన ఆయన సమకాలికులు ముఖ్యంగా టీచర్లు సాహితీ మిత్రులు శంకర్రావు సార్‌ లాంటివాళ్ళు ప్రజాస్పందన వేదిక మిత్రుల మానసిక వేదన ఇంకెంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ప్రజా కవులు కళాకారులు రచయితలు గాయకులు అందరితో ఆయనకున్న సాన్నిహిత్యం ఆ అనుబంధం ఆత్మీయ పలకరింపు ఆయనకుండే, కార్యశీలత కార్యదక్షత ఇంకొకరిలో చూడలేం . అది అరసం కావచ్చు ,విరసం కావచ్చు, మానవహక్కుల కోణం నుండి చూసినా, పౌర హక్కుల కోణం నుండి చూసినా సామాన్యుని మొదలుపెడితే అసామాన్యుడి వరకు సార్‌ తెలియని వాళ్లు లేరేమో!ముఖ్యంగా వరంగల్‌ వాసులు ఆ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు సార్‌ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు .ఒక్కసారి నగరం మూగబోయింది. ఆప్త మిత్రుల మధ్య ఆయన అంతిమయాత్ర అత్యంత దుఃఖ సాగరంగా నడిచింది. ఎవరికి వారు విషణ్ణ వదనం తో రాజయ్య సార్‌ ఇక లేడు అన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. చివరికి ఆయన ఇచ్చిన ధైర్యం, బలం మళ్లీ మనల్ని మామలు మనుషులు చేసి భవిష్యత్‌ కార్యాచరణకు సంసిద్దులను చేస్తుంది. ఎన్నో సాహసాలకి ప్రతిరూపం రాజయ్య సార్‌. ఈ నెల 25 న హన్మకొండ టీజీవో కార్యాలయంలో ఆయన సంస్మరణ సభ సందర్భంగా ఇదే నా ఉద్యమ జోహార్లు.
-డాక్టర్‌ చంద్రభాను
సలహాదారులు, పౌర స్పందన వేదిక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *