తెలంగాణ భాషను, యాసను పుక్కిట పట్టి మాండలిక పదాలు, జాతీయాలపై ఎంతో పట్టుతో కవిత్వం రాసిన కవి అన్నవరం దేవేందర్. సులభంగా తెలంగాణ భాషా ప్రయోగాలను కవిత్వంలో కూర్చగలిగిన నిపుణత ఆయన రాసిన పలు రచనల్లో కన్పిస్తుంది. బుడ్డపర్కలు పేరిట నానీల సంకలనాన్ని దేవేందర్ వెలువరించారు. లోకంలోకి విసిరేసిన నిఖార్సైన వాస్తవాల అగ్నిగోళాల్లా బుడ్డపర్కలు కన్పిస్తాయి. వందేళ్ళ చరిత్రను గర్భితం చేసుకున్న నానీలివి. సహజ రమ్యతను ఈ నానీలన్నీ కనబరిచాయి. మట్టిగుణం, వాస్తవికత, స్థానీయతను నానీలు ప్రదర్శించాయి.
కరీంనగర్ బలం, బలిమిని చూపించిన నానీ ఇది. కరీంనగర్ జిల్లా/ ఎర్ర శెల్కనేల/ ఎగబడుడు/ ఎదురు తిరుగుడు అంటారు. గేట్ వే ఆఫ్ కరీంనగర్ కమాన్గా అక్కడి పెద్దర్వాజను గర్వంగా ప్రపంచానికి పరిచయం చేశారు. హూస్నాబాదు గురించి రాస్తూ త్యాగాల శిల/ మొగుల్లు తాకింది/ హూస్నాబాదుకు/ అది కీర్తికిరీటం అన్నారు. మహాకవి సినారెను స్మరించిన నానీలో నక్కవాగు/ పారుతలేదు/ అయినా సినారె పెన్నుకు/ ఇరాం లేదు అన్నారు. నానీల సృష్టికర్త ఆచార్య ఎన్ గోపిపై రాసిన నానీలో నానీలు నానీ నానీ/ ఉబ్బినయి/ నాయిన గోపి/ తబ్బిబ్బయితండు అని చెప్పారు. పోరాటాల గడ్డను స్మరిస్తూ రైతు రైఫిలై/ నిజాం మీద/ పోరాడిన నేల యిది/ వారసత్వం నడుస్తోంది అన్నారు. మరో నానీలో ఇక్కడి మన్ను/ ముర్కసూస్తే / పోరాటం వాసన/ పొటమరిస్తది అని గర్వపడ్డారు. పివి, జూకంటి, నలిమెల, జీవగడ్డ విజయ్కుమార్, బిఎస్ రాములు, పి.టి రెడ్డి, కాలువ మల్లయ్య, మలయశ్రీ, పెద్దింటి అశోక్, ముద్దసాని రాంరెడ్డి, జస్టిస్ కుమారయ్య, పరంధాములు, జి రాంరెడ్డి, మిద్దె రాములు, గూడూరి సీతారాం, వానమామలై మదాచార్యులు, కెఎన్ చారి వంటి ఆయా రంగాల ప్రముఖులైన పలువురి కృషిని వివరించే నానీలిందులో ఉన్నాయి.
స్వరాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేస్తూ రాసిన నానీలో మూడుకోట్ల గొంతులు/ ఒక్కటేమాట/ ఒక్కటే ముచ్చట/ సిర్ఫ్ తెలంగాణ అన్నారు. చురకలంటించిన మరొక నానీలో నాగలి పట్టరాదు/ కోండ్రదున్నరాదు / రైతు బాంధవుడని/ పటాటోపం అని రాజకీయుల్ని కడిగేశారు. ఉగాదికి కవులకు/ కవిత రాయక తప్పని పరిస్థితిని వివరిస్తూ మైకు మాటలకు/ ఢోకాలేదు/ రాసుడైతే బల్మీటికి/ ఉగాదికో కవిత అన్నారు.
సర్వ సమానతను ఆకాంక్షిస్తూ రాసిన మరొక నానీలో గిలాసలు పలగ్గొడితే/ ఏమైద్ది?/ రెండు గిలాసల ఫిలాసఫీ/ పల్గొట్టాలె అని కుండ బద్ధలు కొట్టారు. అసోయిదులా! / ధూలా అసోయి/ ఆశన్న ఊషన్నల/ ఆటలన్ని కాటగలిసె అంటూ కోల్పోయిన సంబురాల్ని గుర్తు చేశారు. ఇసుక రవాణాపై మానేట్ల నీళ్ళు/ మాయమైనయ్/ ఉస్కెసుత/ దొబ్బి పోతండ్రు గద! అని వేదన పడ్డారు. నట్టనడుమ/ పెద్ద గడియారం/ నలు దిక్కులకు/ పొద్దు తిరుగుడు పువ్వు అని పెద్ద గడియారం సెంటర్ను యాది చేశారు. సింగరేణి గని/ లక్షల మంది/ జీవితాలను/ వెలిగించే పావని అని అభివర్ణించారు. వెలుగులు వెదజల్లే / ఎన్టీపీసీ కింద/ కందిలి కింద/ చీకటి వున్నట్టే వెల్లడించారు. కొత్త తీర్థంపై రాసిన నానీలో ఏకుడు ప్యాలాల ముద్ద/ శిల్కల పేర్లు/ కొత్తకొండ తీర్థం/ బండి కట్టిన యాది అంటారు. మన్ను వాసన గొప్పతనాన్ని నానీగా కూర్చి ఆయిటిపూని/ చినుకు పడిందా! / అప్పుడు సూడు/ మన్ను కమ్మని వాసన అని చెప్పారు.
మార్చురి నానీలో మార్చురి నిండా / ఎన్ని రహస్యాలో!/ కత్తులకు/ నాల్కలు ఉంటే బాగుండు అన్నారు. అనువాదాల ఊట, జీవనదీ ప్రవాహం వంటి ప్రయోగాలు ముద్దసాని రాంరెడ్డిపై రాసిన నానీలో చేశారు. రైతాంగ ఆత్మగౌరవ పోరాటాలను, సింగరేణి, శ్రీరాంసాగర్లను, అంతర్జాతీయ న్యాయమూర్తి జస్టిస్ కుమారయ్యను అందించిన కొడిమ్యాలను, దొరతనంపై ఎదిరింపును నానీలుగా మలిచారు. కందపద్యం/ జన్మం కురిక్యాల/ అందుకే కరీంనగరం/ కవుల శాల అని ప్రస్తుతించారు. కోరుట్లకు/ రెండు చరిత్రలు/ తొలి కాయిదం పరిశ్రమ/ పెద్ద సైఫన్ అన్నారు. ఊరు, అడవి/ ఏ మట్టినన్నా ముట్టుకో/ గుండెల మీద/ జెండాల రెపరెపలు అని కరీంనగర్ పోరాట వారసత్వాన్ని విశ్లేషించారు. ఆకలి బాధలు, తలాపున మానేరున్నా తీరని జల ఘోష, పేదరికపు అసమానతలకు నానీల రూపమిచ్చారు. అగ్గి పెట్టెల చీరను అద్భుతంగా నేసిన పరంధాములుకు ఏం చేతులే నీయి అని గొప్పగా మొక్కి కృతజ్ఞత చెప్పుకున్నారు. బర్లు మ్యాకలెంట/ నడిస్తే ఉత్తోడే/ తెల్లగ శానిగపోతే/ పాదయాత్ర అన్న తేడాను స్పష్టంగా చూపారు.
రాసిందంతా/ తూర్పాల పట్టు/ గాలికి పోయేది వచనం/ నిలిచిందే కవిత్వం అని కవులకు నొక్కి చెప్పారు. ఇత్తునం అలకడం, మసులుతుంది సలసలా వలుపట, దాపట, తెల్వది, ఎసరు, ఊరి సుట్టూ, తొలుసూరి, తెల్లార్తది, సోపతిగాళ్ళు వంటి వ్యవహార పదాలను నానీలలో ఒద్దికగా కూర్చారు. భూమి తల్లిని/ ముక్కలు ముక్కలుగా కోసి/ అమ్ముకునుడే/ రియల్ ఎస్టేట్ అన్నారు. వడ్ల వ్యాపారికేమో/ తీపి రోగం/ పంటలు పండిస్తే/ ఆకలి చావులు అని రైతులు దీనస్థితిని వివరించారు. సిరిసిల్ల జగిత్యాలను పోరాటపు నిప్పుకణికలు అన్నారు. కరీంనగర్ మట్టి/ పిడికిట పట్టు చెమట, రక్తం, కన్నీళ్ళ/ మిశ్రమం అని నానీతో పోరాటపు నిర్వచనం అద్భుతంగా రాశారు. కడుపు సలసలా/ మసలుతంది/ ఎసరు కవిత్వమై/ పొంగుతుంది అని చెప్పారు. వీరుని మరణాన్ని పొద్దుకాసేపు గూట్లె పడ్డట్టే అన్నారు. మానవ సంబంధాలపై/ కీలకోపన్యాసం/ ఇంట్ల/ పిల్లికి బిచ్చం పెట్టడు అని ఎద్దేవా చేశారు.
కోటి లింగాల శాతవాహనుల తొలిరాజధానిగా, ఫిలిగ్రీ ఆర్ట్కు కేరాఫ్ అడ్రస్గా కరీంనగర్ను చూపించారు. రామడుగుల రాయికి పానం పోయడం, ఊరంతా వాయి వరసలతో సుట్టాలోలె పిలుసుకోవడం, పుక్యానికి, ఏతులు గొట్టడం, ఒడ్డెక్కినంక తెడ్డు సూపడం, చెరువు మత్తడి దుంకి పల్లె నీళ్ళాడడం, ఎక్కిరింపు, పైసలకాడ పీనాసి, నవ్వుడు కూడా కంజూషి, ఉద్యమాల సోపతి, ఇకిలింపు, ఎముడాల రాజన్న కష్టం, బతుకు పోరు, కలె తిరుగడం, కడుమ, జీవగడ్డ, యాసభాష, అటెనుక వెన్నుపోటు ఆత్మగౌరవం, చేతలే జీవితం, సొచ్చుడు, లావట్టడం, బండికాని వంటి విభిన్న అంశాలతో నానీలు ఆసక్తిని రేకెత్తిస్తాయి.
తాగేందుకు సుక్క/ నీళ్ళులేవు/ ఊరి నిండా/ సైడ్ కాలువల కట్టడాలు అని బాధపడ్డారు. కరచాలనం/ కలయిక ఉత్తదే/ హృదయాలు కలిస్తేనే/ సోపతి అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలని కోరుకున్నారు. ఆస్తులు అంతస్తులే కాదు షుగర్ బీపీలు కూడా వారసత్వమేనని చమత్కారంగా తెలిపారు. ప్రపంచీకరణతో కులవృత్తుల విధ్వంసంపై నానీలున్నాయి. రాజకీయాన్ని పాత్రధారుల నాటకంగా చూపారు. ఆట పాట మాట, ధూంధాం కలగలిసి తెలంగాణ సింగిడిగా అభివర్ణించారు. జర్నలిస్టుల మారిన వృత్తి కష్టంపై నానీ నేపధ్యంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసాహిత్య పాత్రికేయపిత బి విజయకుమార్కు అంకితమిచ్చిన బుడ్డపర్కలు దేవేందర్లోని నిష్కర్షతతో కూడిన భావపరంపరకు పోటెత్తిన ప్రతీకలు.
– తిరునగరి శ్రీనివాస్, 84660 53933