ఆశలు పగిలిన గాజుకళ్ళతో
ఓపికసడలిన బూజుదేహంగా
చింపిరి జుట్టు
చివికిన బట్టల్తో
ఈ దేశవు ముఖచిత్రంలా నిస్తేజంగా
రోడ్డు మలుపులోని మెట్టపై నిర్లిప్తంగా….
ఆమె
ఎక్కుడి నుండి వచ్చిందో తెలియదు
ఎందుకు అక్కడ కూర్చుందో తెలియదు
దానం చేద్దామంటే
యాచకురాలు కాదు
సాయం చేద్దామంటే
లోపలి దుఃఖమేదో తెలియదు
ఓదార్చుదామనుకుంటే
మతి తప్పిన మనిషిసలే
కాదు…. ఆమె
ఎండిపోయిన కళ్ళలోనే కాదు
మండుతున్న గుండెలోనూ
శూన్యాకాశమే…
ఆకలిలేదు•-
కానిమాటల్తో కడుపు నిండుతోంది
దాహంలేదు •
కన్నీటీతో గొంతు తడువుకుంటోంది
ఎ కన్న పేగులకు కానిదయ్యిందో…
అచ్చం దగాపడ్డ పేదతల్లిలా వుంది
ఆమె•
ఎందుకు మౌనంగా ఉందో తెలియదు
ఎప్పటి నుండి శూన్యంగా మారిందో తెలియదు
కసాయి నోళ్ళు ఎంతగా నిందించినా
తన లోకంలో తనుంటుందే తప్ప
అసహానంతో ఏమీ ఊగిపోదు
సాయం చేతులు దానం చేయబోతే
మౌనంగా తీరస్కరిస్తుందేతప్ప
ఆత్మభిమానాన్ని అలా చంపుకోదు
ఆమె నుంచి మనుషులే కాదు
రాజ్యలు కూడా
నేర్చుకోవాల్సింది చాలానే వుంది
ఆమెకు ఆధార్ కార్డున్నా
బ్రతికిలా నిరాధారమయ్యేది కాదు
కనీసం ఓటు హక్కున్నా
అసెంబ్లీ ఆమె ముందు మోకరిల్లేది
ఏ ఖద్దరు చోక్కకి పట్టని
దీన భారతావనిలా రోడ్ల పాలయ్యింది
ఆమె•-
‘‘మనిషేకి ‘‘ నన్న గుర్తింపు కాదు కదా !
అసలు ‘‘బ్రతికి’’ఉందన్న స్పృహే లేదు
అమ్మా !…
నువ్వు ఎవరివైతే ఏం…
తల్లి లేని పిల్లాణ్ణి నేనున్నా
అమ్మ కోసం అలమటిస్తున్నా
నీ పాదాలకు నమస్కరిస్తున్నా
అమ్మాగా నా గుండె వాకిట్లోకిరా …
బిడ్డనై నిన్ను అక్కున చేర్చుకుంటా•-!!
-శోభరమేష్
8978656327