నడకమార్గం భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు
తిరుమల,మార్చి3 : నడక మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. త్వరలో నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ సంభందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్టేష్రన్ శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెట్ వివరాలు ప్రకటిస్తామన్నారు. శ్రీవాణి భక్తులకు తిరుమలలోని ఏటీజీహెచ్, ఎస్‌ఎన్జీహెచ్ అతిధి గృహల్లోని 88 గదులను కేటాయిస్తామని… కాషన్ డిపాజిట్ విధానంపై సక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏప్రిల్ నుండి తిరుమలలో ఎలక్టరికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
మరోవైపు తిరుమలలో మార్చి 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఇంకా పటిష్టం చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపునకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ యాప్ ద్వారా దర్శనం, లడ్డూల పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.