ధాన్యం సేకరణపై జాతీయ విధానం

  • పార్లమెంట్‌ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌
  • ‌వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు
  • ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులతో నిరసన
  • చర్చకు తిరస్కరణతో ఉభయ సభలనుంచి టిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. అమాయకులైన అన్నదాతలను రక్షించండి..అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయకండి..వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించండి..అంటూ టిఆర్‌ఎస్‌ ‌సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై టిఆర్‌ఎస్‌ ‌తమ ఆందోళనలను కొనసాగిస్తూ మంగళవారం మరోమారు లోక్‌సభలో దుమారం రేగింది. టీఆర్‌ఎస్‌ ‌నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఆహార ధాన్యాల సేకరణపై చర్చ చేపట్టాలని టిఆర్‌ఎస్‌ ఎం‌పీలు నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రం తీరును ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు ఆందోళన చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ఎం‌పీల ఆందోళన నేపథ్యంలో స్పీకర్‌ ‌బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ఉదయం స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లాకు లోక్‌ ‌సభలో టీఆర్‌ఎస్‌ ‌పక్ష నేత నామ నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో పండిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్‌సీఐ సేకరణ చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని అభ్యర్థన చేశారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానంపై సభలో చర్చించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, అందుచేత సభ మంగళవారం రోజు కార్యక్రమాలు రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని నామా తన లేఖలో అభ్యర్థించారు. ఈ క్రమంలో యథావిధిగా ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా ..ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు నినాదాలతో హోరెత్తించారు. ధాన్యం సేకరణపై నోటీసులు ఇచ్చిన ఎంపీలు ఉభయ సభల్లో చర్చకు పట్టుపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే దీనిపై ఉభయ సభల్లోనూ చర్చకు అనుమతి ఇవ్వలేదు.

దీంతో లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు వాకౌట్‌ ‌చేశారు. ఒడిషాతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం విధానంతో ఇబ్బందులు పడుతున్నాయని ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఆర్‌ఎస్‌ ఎం‌పీ సురేష్‌ ‌రెడ్డి రాజ్యసభలో డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం ఈ అంశంపై సమాధానం ఇవ్వాలన్నారు. అయితే వారం రోజుల నుంచి ఈ డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రతిరోజూ వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ ఉభయ సభల్లో చర్చకు అనుమతించడం లేదు. ఈ నెల 11న దిల్లీలో కెసిఆర్‌ ‌సమక్షంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని టీఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page