మరో తొమ్మిది నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధపడుతున్న పార్టీలకు ముందుగానే తమ బలాబలాలు తేల్చుకునే అవకాశం ఏర్పడింది. నేటికి సరిగ్గా 22 రోజుల్లో జరుగనున్న మినీ సంగ్రామంలో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఖాలీ ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలకు గాను ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్, కూర్మయ్యగారి నవీన్‌రావుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండడంతో ఈ స్థానాలకు ఎన్నికలను నిర్వహించబోతున్నారు. ఇందుకుగాను మార్చ్ ఆరవ తేదీ నుండి 13వ తేదీవరకు నామినేషన్‌లను స్వీకరిస్తారు. నామినేషన్‌ల ఉపసంహరణకు పదహారు ఆఖరు తేదీ కావడంతో పోటీకి తమ అభ్యర్థిత్వం కోసం ఆయాపార్టీ నాయకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఒక విధంగా ఈ మూడు స్థానాలు కూడా అధికార బిఆర్‌ఎస్‌కే దక్కే అవకాశాలున్నప్పటికీ తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఆయా పార్టీలుకూడా సిద్ధపడుతున్నాయి. అధికార పార్టీకి మెజార్టీ కనిపిస్తుండడంతో ఆ పార్టీలోని ఆశావహుల జాబితా పెరిగిపోతూనే ఉంది. సునాయాసంగా గెలిచే అవకాశాలుండడంతో చాలాకాలంగా పదవులకోసం ఎదురుచూస్తున్నవారు ఈసారైనా తమకు అవకాశం లభించకపోతుందా అంటూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గతంలో ఎంఎల్‌ఏ టికట్‌కె•సం ఆశించి భంగపడినవారు ఈసారైనా పెద్దసారు కనికరించకపోతారా అంటూ ఆశాగా ఎదురుచూస్తున్నారు. ఇతర పార్టీలనుండి వొచ్చిన వారికిచ్చిన ముందస్తు హామీల్లో ఎంఎల్సీ అవకాశ హామీకూడా లేకపోలేదు. ఇప్పటికే హైదారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. భారాస మద్దతివ్వడంతో మజ్లిస్ అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ గెలుపు సులభమైపోయింది. కాగా ఎంఎల్యే కోటాలో ఖాలీ అవుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమ గాడ్ ఫాదర్ల చుట్టూ అనేక మంది ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు.
అయితే ఖాలీ అవుతున్న ఈ మూడు స్థానాల్లో ఒక స్థానంలో మాత్రం పాత అభ్యర్థికే తిరిగి అవకాశం లభిస్తుందన్న ప్రచారం జరుగుతున్నది. వారిలో కూర్మయ్యగారి నవీన్‌కు మరో అవకాశం తప్పక లభిస్తుందంటూ వార్తలు వొస్తున్నాయి.
ఎంఎల్సీగా ఆయన కేవలం రెండేళ్ళు మాత్రమే పదవిలో ఉన్నకారణంగా ఆయనకు ఇంకో అవకావం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలుగుదేశం పార్టీనుండి భారాసలో చేరిన గంగాధర్‌గౌడ్‌కు ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇవ్వడంతో మరో అవకాశం ఆయనకు రాకపోవచ్చనుకుంటున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ నుండి ప్రాతినిధ్యం వహించిన ఎలిమినేటి కృష్ణారెడ్డి స్థానంలో మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటున్నారు. వీరి స్థానంలో కొత్తవారికి, ముఖ్యంగా ఉద్యమకాలంనుండి పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటున్న వ్యక్తులకు అవకాశం కలిగించాలని పార్టీ నాయ••త్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు దేశపతి శ్రీనివాస్. తన పాట, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
అంతేగాక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఓఎస్డీగా ఆయన కనుసన్నల్లో నిత్యం మెదులుతున్న వ్యక్తి. తెలంగాణ ఏర్పడినప్పటినుండి జరుగుతున్న ఎంఎల్సీ ఎన్నికల ప్రతీసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయనకు అవకాశంరాలేదు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో శాసనసభ ఎన్నికలకు ముందు వొచ్చే ఈ మినీ ఎన్నికలు పార్టీలకు ముఖ్యంగా భారాసకు అత్యంత ప్రాధాన్యమైనది. అందుకు ఎంఎల్సీ పరిధిలోని ప్రజలను ప్రభావితం చేయగలిగేవారిని ఎంచుకోవాలన్నది పార్టీ ఆలోచన. ఎమ్మెల్యే కోటాలోని మరో స్థానానికి అనూహ్యంగా అలంపూర్ మాజీ ఎంఎల్యే చల్లా వెంకట్‌రెడ్డి పేరు వెలుగులోకి వొచ్చింది. అలంపూర్ ఏపిలోని కర్నూల్ జిల్లాకు సమీపంలో ఉండడంతో భారాస విస్తరణకు ఆయన ఎంపిక సరైందిగా ఆ పార్టీ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది.
వీటితోపాటు మరిన్ని ఎంఎల్సీ స్థానాలు తెలంగాణలో త్వరలో ఖాలీ కానున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, గవర్నర్ కోటాలో పదవిపొందిన రాజేశ్వర్‌రావు, ఫారుఖ్ హుస్సేన్, స్పోర్టు అథార్టి మాజీ చైర్మన్ అల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేర్‌లింగంపల్లి నేత బండి రమేశ్, మరో సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్, వరంగల్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ సుధాకర్‌రావు, వైరా మాజీ ఎంఎల్‌ఏ చంద్రావతి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఉపాధ్యయ ఎమ్మెల్సీ ఎన్నికలో వామపక్ష అనుబంధ ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు పోటీకి సిద్దపడ్డారు. తెలంగాణ పిఆర్‌టియూతో సహా వివిధ ఉపాధ్యాయ సంఘాలు తమ ప్రతినిధులను బరిలోకి దింపడంతో వామపక్షాలతో భారాస ఎలాంటి మైత్రిని కొనసాగిస్తుందన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.