1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రెండు యువ కలాలు ఉద్యమ స్ఫూర్తి సిరాను నింపుకొని వాస్తవ వివరాలను సామాన్య జనానికి అందించడానికి అన్నట్లు ఉద్భవించాయి.ఆ రెండు కలాలలో ఒకటి శ్రీ దేవులపల్లి ప్రభాకరావు గారిది. మొన్ననే (21-4-2022 నాడు) పరమపదిందిన దేవులపల్లి వారికి స్మృత్యాంజలిగా అలనాటి 1969 తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నందించడమే సరియ్కెన నివాళి అని భావిస్తూ, 6 సంవత్సరాల క్రితం మా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వివరాలు మీ కందిస్తున్నాం…
ఇద్దరు పత్రికా రచన దురంధరులు!
‘‘ప్రభాకర’’ ద్వయ 1969 తెలంగాణా ఉద్యమ కలం పాళీలు!!
ఇద్దరి కలాలూ వాడీ వేడీ కలిగినవే! 1969 తెలంగాణా ఉద్యమంలో వాటి పాళీల గుండా ప్రవహించిన ఉడుకు ఉద్యమ సిరా అలనాటి ప్రజలకింకా గుర్తే!
ఇందుర్తి ప్రభాకరరావూ, దేవులపల్లి ప్రభాకరరావూ ఇద్దరూ వరంగల్ వాళ్ళే! కొన్ని నెలల వ్యత్యాసంతో ఇద్దరి వయస్సు ఒకటే!!
వృత్తులు వేరైనా ఇద్దరి ప్రవృత్తీ పత్రికా రచనా, సమగ్ర విశ్లేషణాత్మక వ్యాస రచనా!
ఇద్దరి రచనా మానసిక అనుబంధం ఎంత గొప్పదంటే, మొన్నటికి మొన్న (దాదాపు సంవత్సరం క్రితం) తనెప్పుడో (1976 లో) ఉస్మానియా యూనివర్సిటీలో బిరుదురాజు రామరాజు గారి పర్యవేక్షనలో మరొక గొప్ప పత్రికా రచయిత, సంపాదకుడు ‘‘సురవరం ప్రతాప రెడ్డి గారి జీవితం – రచనల’’ పై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాన్ని గ్రంధరూపం తెచ్చిన సందర్భంలో ఇందుర్తి ప్రభాకరుడు ఆ వ్యాస రచనకు ముందు మాట రాయాలని ఏరి కోరి దేవులపల్లి ప్రభాకరుడిని కోరడం, మెయిల్ రూపంలో మిత్రుడు పంపించిన దానిని యదాతథంగా ఆ గ్రంధంలో పొందుపరచడం నా కింకా గుర్తే!
2014 లో జరిగిన ఆ పుస్తక ఆవిష్కరణలో తన మానసిక మిత్రుడ్ని శాలువాతో సత్కరించాలని అనుకున్న ఇందుర్తి ఆశలను సహజ బిడియస్తుడూ, సన్మాన సత్కారాలకు ఆమడ దూరం వుండే మిత్ర ప్రభాకరుడు వమ్ము చేసినా ఆ ఇద్దరి అనురాగ ఆప్యాయత గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు!
తర్వాత కొన్ని నెలలకే 2015 లో తన మిత్రున్నీ, మా అందరినీ శాశ్వతంగా వీడి దూర తీరాలకు చేరుకున్నా ‘ఇందుర్తి’ ప్రభావం నా పైనే కాదు – మా కుటుంబ సభ్యులందరి పైన గాఢంగా నాటుకున్నది వాస్తవం.
దేవులపల్లి ప్రభాకర రావు గారు 1980 నుండీ తెలుసు. వారు మా అత్తగారికి స్వయానా తమ్ముడు.
ఇందుర్తి ప్రభాకర రావు గారు నాకు దాదాపు 1960 తొలి దశ నుందీ తెలుసు. వారు మాకు దూర బంధువు. ఆయన మా నాన్న గారు శ్రీ పాములపర్తి సదాశివరావు గారి శిష్యుడే! మా కుటుంబంలో ఒక సభ్యుడే!
అన్నిటికంటే ముఖ్యంగా నా వివాహానికి కారకుల్లో ఆయన ఒకరు. అంటే ఇందుర్తి గారి ద్వారానే నాకు దేవులపల్లి ప్రభాకర రావు గారి పరిచయం, బంధుత్వం ఏర్పడిందన్న మాట!
నేను చాలా కాలం హైదరాబాద్ లో పని చేయడం వల్ల చాలా సందర్భాలలో వీరిని కలవడం జరిగేది.
వీరిద్దరినీ దగ్గరగా పరిశీలించిన నాకు కనబడ్డ ఒకే వ్యత్యాసం- మొదటి (ఇందుర్తి) ప్రభాకరుడు ఉద్రేక స్వభావి, మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి. 1969 తెలంగాణా ఉద్యమంలో స్వయంగా పాల్గొని తన ఉపన్యాస పరంపరలతో అలనాటి వరంగల్ గిర్మాజీపేట నుండి హన్మకొండ బెస్తవాడ దాకా అలనాటి యువకులను ఉత్తేజ పరిచిన అలనాటి యువ నాయకుడు. ‘‘విశ్వజ్యోతి’’ మాస పత్రిక సంపాదకుడు శ్రీ కటంగూరి నరసింహారెడ్డీ, ‘‘ధర్మ భూమి’’ పక్ష పత్రిక సంపాదకుడు శ్రీ కనకదండి చంద్రమౌళీశ్వర రావు కలిసి స్థాపించిన తెలంగాణా విమోచనోద్యమ సమితిలో తన భావ జాలాన్ని పొందు పరచినవాడు.
అంతే కాకుండా ‘గోరా శాస్తి, వరదా చారీ గార్ల సంపాదక నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో వెలువడ్డ అలనాటి ఆంధ్రభూమి’ లో పని చేస్తూ మితృడు శ్రీ పీ ఎన్ స్వామి గారితో కలిసి శ్రీ ప్రతాప్ కిషోర్ గారి వెంటుండి తెలంగాణా ప్రజాసమితి రూపు దిద్దుకునేందుకు ఉడుతా భక్తి సేవలందించిన విషయం కొందరికే తెలుసు.
ఇక ‘దేవులపల్లి ‘ బిడియస్తుడు. ప్రచార పటాటోపం తెలియని వాడు. మృదు స్వభావి. ఆయన తన కలం వాడితో ‘ప్రజా సమితి’కి – అలనాటి ఉద్యమ నాయకులకూ ‘దిశా నిర్దేశనం’ గావించిన విషయం చాలా కొద్ది మందికే తెలుసు.అలనాటి ఉద్యమ నాయకులది పెదవుల మాటలు, కేవలం హావ భావాలే ఐతే వారి ఉత్తేజకర ఉపన్యాస ప్రతి పదం వెలువడింది దేవులపల్లి హృదయ లోతుల్లో నుంచి. ఆయన రాయని ఉపన్యాసం లేదు ఆయన పదజాలం లేని అలనాటి కరపత్రాలూ లేవు. వీటి ద్వారా ఆయన గుండె చప్పుడును విన్నారు ప్రజలు కానీ ఆయన మిగిలాడు ఒక కనబడని కాంతి పుంజంగా!
వారిద్దరి మధ్య మొగ్గ తొడిగిన ఆ ఉద్యమ రచనానుబంధం తర్వాత క్రమంలో శ్రీ కృష్ణ దేవరాయ భాషాంధ్ర నిలయంలో శ్రీ ఎం ఎల్ నరసిం హా రావు గారి ఆధ్వర్యంలో 1971 లో నిర్వహింపబడిన కాళోజీ షష్టి పూర్తి ఉత్సవ సందర్భాన ఇద్దరూ భుజం భుజం కలిపి పని చేసేలా చేసాయి.తర్వాత దేవులపల్లి ప్రభాకర రావు గారు అనేక పత్రికల్లో వివిధ పేర్లతో అనేక రాజకీయ – సాహిత్య- సాంస్కృతిక రంగాలకు చెందిన విషయాల గురించి విపులంగా విశ్లేషణా రచనలను చేసారని చాలా మందికి తెలియదు.
చివరగా… మీకు అతి అర్జెంటుగా ఏదేని ఒక మన రాష్ట్ర రాజకీయ – సాహిత్య – సాంస్కృతిక – రంగానికి సంబంధించిన విషయం పై ఉపన్యాసమో, వ్యాసమో కావాలంటే -అదీ సమగ్రంగా వివిధ కోణాలలో పరిశీలించిన విశ్లేషణాత్మక సమగ్ర సమాచారంతొ కూడినదయితే – వెంటనే మీ గూగుల్ సెర్చ్ ను ఆపండి వెంటనే శ్రీ దేవులపల్లి ప్రభాకర రావు గారిని కలవండి. మీకు అందుతుంది ఠంచన్ గా- అదీ ఉచితంగా.ఇదీ శ్రీ ఇందుర్తి ప్రభాకర రావు గారి ద్వారా నేను తెలుసుకున్న శ్రీ దేవులపల్లి ప్రభాకర రావు గారు!
– పాములపర్తి నిరంజన్‌రావు