పల్లెలు, పట్టణాల్లో మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు
ఈసారి ఎన్డీఏకు 400 సీట్ల ఖాయం : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు
అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా మోదీ వొదిలిపెట్టరు..
బీజేపీలోకి బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను కండువాకప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి17: సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన పట్ల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలనపట్ల అభిమానంతోనే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నా రన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లో బీజేపీలో చేరగా ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోదీ పాలన పట్ల ఆదరణ పెరుగోతందని.. దీని కారణంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 400కు పైగా సీట్లను గెలుచుకుంటామని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయన్నారు. ప్రతీ ఒక్కరి నోట.. మోదీ మాట వినబడుతోందని.. గత పదేళ్లలో ఇసుమంత అవినీతికి కూడా తావులేకుండా పాలన అందించారని, , అణగారిన వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు వర్గాల సంక్షేమానికి మోదీ నిరంతరం పాటుపడడంతో ప్రజలంతా ఆకర్శితుల్కె ‘మేమంతా మోదీ కుటుంబం’ అని సగర్వంగా చెబుతున్నారని చెప్పారు.
దేశ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న మోదీ నాయకత్వం పట్ల ఆకర్శితుడన్కె బీజేపీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. దీనికితోడు ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని.. అందుకే తాను బీజేపీలో చేరానన్నారు. పదేళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా మోదీ పాలన కొనసాగిస్తుండటంతో గ్రామాల్లో యువత బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారన్నారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అయిన..ధర్మారావు, కొండేటి శ్రీధర్, జ్కెపాల్, పొన్నాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆరూరి రమేశ్ తో పాటు.. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు తదతరులు పార్టీలో చేరారు.