Take a fresh look at your lifestyle.

తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీ బాయి

 ‘‘చరిత్ర పుటల నిండా మనుధర్మం పరుచుకున్న వేళ,సమాజం మహిళను అబలగా,బానిసగా,శృంగారవస్తువుగా  చూస్తున్న  నాటి చీకట్లను చీల్చి చెండాడిన మహిళ శక్తికి నిర్వచనంగా నిలిచిన తొలి మహిళా సామాజిక ఉద్యమకారిణి సావిత్రీ బాయి. నమ్మిన లక్ష్యాల సాధనలో ఎదురైనా సవాళ్ళను తిప్పికొడుతూ మహిళల అభ్యున్నతికి తన జీవితాచరణనే దర్పణంగా చూపిన ఉద్యమ దివిటీ సావిత్రీ బాయి.’’

అజయ్‌ ‌బాబు వాడపల్లి :

చరిత్ర పుటల నిండా మనుధర్మం పరుచుకున్న వేళ,సమాజం మహిళను అబలగా,బానిసగా,శృంగారవస్తువుగా  చూస్తున్న  నాటి చీకట్లను చీల్చి చెండాడిన మహిళ శక్తికి నిర్వచనంగా నిలిచిన తొలి మహిళా సామాజిక ఉద్యమకారిణి సావిత్రీ బాయి. నమ్మిన లక్ష్యాల సాధనలో ఎదురైనా సవాళ్ళను తిప్పికొడుతూ మహిళల అభ్యున్నతికి తన జీవితాచరణనే దర్పణంగా చూపిన ఉద్యమ దివిటీ సావిత్రీ బాయి.ఏ సామాజిక సమస్యలకు ఎదురు నిలిచి తన జీవిత కాలమంతామొక్కవోని దీక్షతో తలపడిందో ఖచ్చితంగా తిరిగి అదే మనుధర్మ వ్యవస్థ నేడు ప్రాణం పోసుకునేందుకు సిద్దపడుతూన్నది. మహిళను బానిసగా చూసిన మను ధర్మ పునఃప్రతిష్టకు ఉవ్విళ్ళూరుతున్న హిందూ బ్రాహ్మణ ఫాసిస్ట్ ‌శక్తుల కు ఎదురొడ్డి నిలిచే మహిళా ఉద్యమాన్ని నిర్మించాల్సిన తక్షణ చారిత్రక కర్తవ్యాన్ని ప్రగతిశీల భావజాలంతో ఉద్యమాల బాటన నడిచే ఫెడరేషన్‌ ‌మహిళా ఉపాధ్యాయులే నిర్వహించాల్సివుంది. సావిత్రీ బాయి ఉద్యమ కార్యాచరణ ఇందుకు మార్గదర్శకంగా దోహదపడుతుంది. కులరక్కసి జడలు విచ్చుకున్న సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని సవాలుగా స్వీకరించి, ఉపాధ్యాయులకు సామాజిక కర్తవ్యాలుంటాయని చాటి,వాటిని నెరవేర్చిన తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీ బాయి.సమాజానికి, బడికి వున్న సంబంధాలను,వాటిలో సమస్యలను,వాటి పరిష్కారాలను అర్ధం చేసుకోవటానికి ఆమె ఉద్యమ జీవితమే నిఖార్సైన నిర్వచనం.

సావిత్రీ బాయి గురించి వివరంగా..
సావిత్రీబాయి జనవరి 3, 1831న  ప్రస్తుత సతారా జిల్లాలో వున్న నైగావ్‌లోని ఒక వ్యవసాయ కుటుంబంలో ఖండోజీ నెవేషే పాటిల్‌ ,‌లక్ష్మి దంపతులకు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు ముందుగానే వివాహాలు చేసేవారు. తొమ్మిదేళ్ల వయసులోనే 1840 లో సావిత్రీబాయికి  12 ఏళ్ల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది.జ్యోతిరావు, రచయిత,సామాజిక కార్యకర్త,కుల వ్యతిరేక సంఘ సంస్కర్త, మనే ఆమెకు చదవడం, రాయడం నేర్పించారు. ఆ విధంగా సావిత్రీబాయి వివాహానంతరం విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆమె సాధారణ పాఠశాల నుండి మూడవ,నాల్గవ సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి,బోధన పట్ల మక్కువ పెంచుకుంది. ఆమె అహ్మద్‌నగర్‌లోని శ్రీమతి ఫరార్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో శిక్షణ తీసుకుంది. సావిత్రీబాయి సామాజిక ప్రయత్నాలన్నింటిలోనూ జ్యోతిరావు ఆమెకు అండగా నిలిచారు.
సాధికారత సాధన దారిలో మహిళా విద్య
1848లో జ్యోతిరావు, సావిత్రిబాయి యుక్తవయస్సులో ఉన్నప్పుడు పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఈ తొలి ప్రయత్నంతోనే వారికి సవాళ్ళు మొదలయ్యాయి. వారు కుటుంబం నుండి,సంఘం నుండి బహిష్కరణను ఎదుర్కొన్నారు.స్నేహితుడు ఉస్మాన్‌ ‌షేక్‌ అతని సోదరి ఫాతిమా షేక్‌  ‌తోడునిలిచి,పాఠశాలను ప్రారంభించడానికి వారి సొంత స్థలం ఇచ్చారు.ఆ విధంగా వెలుగు చూసిన తొలి పాఠశాలలో సావిత్రీబాయి  ప్రథమ ఉపాధ్యాయురాలుగా సేవలందించారు. అంటరానివారిగా పరిగణించబడే మాంగ్‌ ,‌మహర్‌ ‌కులాల పిల్లల కోసం1852లో మూడు ఫూలే పాఠశాలలను ప్రారంభించారు.
వ్యవసాయకూలీల కోసం 1855లో  రాత్రి పాఠశాలను  ప్రారంభించారు.పాఠశాల ఉపాధ్యాయురాలుగా మిగిలిపోవడం కన్నా తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకోవటమే మిన్న అని ఆమె భావించారు సామాజిక సమస్యలపై తన దృష్టి నిలిపారు.సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి మహిళలకు వారి హక్కులు, గౌరవం ల పై అవగాహన కల్పించే లక్ష్యంతో 1852లో మహిళా సేవా మండలిని కూడా ప్రారంభించింది. వితంతువులకు శిరోముండనం చేసే ఆచారాన్ని వ్యతిరేకిస్తూ ముంబయి,పూణే లలో క్షౌరకుల సమ్మె నిర్వహించడంలో ఆమె విజయం సాధించింది.
పలు కారణాల చేత 1858 నాటికి వీరు నిర్వహిస్తున్న మూడు పాఠశాలలు మూసివేయబడ్డాయి. అధైర్య పడకుండా ఫాతిమా షేక్‌ ‌సాయంతో సావిత్రీబాయి తిరిగి 18 పాఠశాలలను తెరిచి వివిధ కులాల పిల్లలకు విద్యనందించారు మహిళలతో పాటు అణగారిన కులాలకు చెందిన ఇతర వ్యక్తులకు బోధించడం పై చాలా మంది, అగ్రవర్ణాలతో పెద్ద ఎత్తున సమస్యలు ఎదురయ్యాయి.సావిత్రీబాయి, ఫాతిమాషేక్‌లను స్థానికులు బెదిరించటం,సామాజికంగా వేధించటం, పలురకాలుగా అవమానించటం పెరిగిపోయింది. సావిత్రీబాయి స్కూల్‌ ‌వైపు వెళ్లేసరికి ఆవు పేడ, మట్టి, రాళ్లు విసిరేవారు.బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని,తిరిగి వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. అందుకోసం ఆమె రెండు చీరలను తీసుకువెళ్ళేది.ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నానని చెప్పేది. అగ్రకులాల మూకలు చేసే అటువంటి దురాగతాలు  సావిత్రీబాయిని నిరుత్సాహపరచలేకపోయాయి. సావిత్రీబాయి,ఫాతిమా షేక్‌ ‌లతో సగుణ బాయి కూడా చేరారు,              స్కూల్‌ ‌డ్రాపౌట్‌ ‌రేటును తనిఖీ చేయడానికి, సావిత్రీబాయి పిల్లలకు పాఠశాలకు హాజరైనందుకు స్టైఫండ్‌లు ఇచ్చే పద్ధతిని ప్రారంభించింది.  విద్య యొక్క ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఆమె క్రమం తప్పకుండా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించింది, తద్వారా వారు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతారని విశ్వసించేది.మానవ హక్కుల గురించి 1863లో జ్యోతిరావు,సావిత్రీబాయి ‘బల్హత్య ప్రతిబంధక్‌ ‌గృహ’ అనే సంరక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు, ఇది బహుశా భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి శిశుహత్య నిషేధ గృహం. గర్భిణీ బ్రాహ్మణ వితంతువులు,అత్యాచార బాధితులు తమ పిల్లలను సురక్షితమైన ప్రదేశంలో ప్రసవించేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, తద్వారా వితంతువుల హత్యలను నిరోధించడంతోపాటు శిశుహత్య రేటు తగ్గుదలకు కృషి చేసింది.1874లో వీరు కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు నుండి ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు. జ్యోతిరావు వితంతు పునర్వివాహాన్ని సమర్ధించగా, సావిత్రీబాయి  స్త్రీల ఉనికిని క్రమంగా బలహీనపరుస్తున్న అత్యంత సున్నితమైన సామాజిక సమస్యలైనబాల్య వివాహాలు మరియు సతి ప్రాత వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పనిచేసింది. బాల వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పడం మరియు సాధికారత కల్పించడం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో కూడా ఆమె కృషిచేసింది.వారి పునర్వివాహం కోసం కృషి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు సంప్రదాయవాద,ఉన్నత కుల సమాజం నుండి ఎదురైన బలమైన ప్రతిఘటనలకు తట్టుకొని నిలిచింది.
విస్తరించిన సేవలు
ఆమె తన భర్తతో కలిసి అంటరానితనం మరియు కుల వ్యవస్థను నిర్మూలించడంలో, అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడంలో  పనిచేసింది. దాహంతో ఉన్న అంటరానివారికి నీరు అందించడానికి కూడా ఎవరూ ఇష్టపడని కాలంలో వీరు అంటరానివారి కోసం తమ ఇంట్లో బావిని తెరిచారు.1876 లో వచ్చిన కరువు సమయంలో ఆమె వివిధ ప్రాంతాలలో ఉచిత ఆహారాన్ని పంపిణీ చేసింది. మహారాష్ట్రలో 52 ఉచిత ఆహార వసతి గృహాలను ప్రారంభించారు. ఆమె 24  సెప్టెంబర్‌ 1873‌న పూణెలో జ్యోతిరావు స్థాపించిన ‘సత్యశోధక్‌ ‌సమాజ్‌’ ‌సామాజిక సంస్కరణ సంఘంతో కూడా బాధ్యతలు పంచుకుంది. ముస్లింలు, బ్రాహ్మణులు,బ్రాహ్మణేతరులు,  మరియు ప్రభుత్వ అధికారులను సభ్యులుగా చేర్చిన సమాజ్‌ , ‌స్త్రీలు, శూద్రులు, దళితులు మరియు ఇతర అణగారిన వర్గాలు దోపిడీకి గురి కాకుండా విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేశారు.. ఈ సమాజ్‌లో పూజారి కానీ, ఏ కట్నకానుకలు కానీ లేకుండా కనీస ఖర్చుతో వివాహాలు ఏర్పాటు చేయించారు.  వధూవరులు ఇద్దరూ తమ వివాహంలో  ‘‘వివాహ ప్రతిజ్ఞలు’’ తీసుకునేవారు. సావిత్రీబాయి దాని మహిళా విభాగానికి అధిపతిగా పనిచేసింది.1890 నవంబర్‌ 28 ‌న భర్త మరణించడంతో తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.తన భర్త మరణించిన తరువాత, ఆమె సమాజ్‌
‌ఛైర్‌పర్సన్‌ అయ్యారు. సావిత్రీబాయి తన భర్త తరువాత కూడా సత్య శోధక్‌  ‌సమాజ్‌ ‌ద్వారా తన కార్యాచరణను  చివరి శ్వాస వరకు ముందుకు తీసుకెళ్లింది.విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త గా కుల మరియు లింగ వివక్షకు వ్యతిరేకంగా తన స్వరం పెంచారు.

Leave a Reply