నారాయణ ఖేఢ్ దశ, దిశ మారిపోయింది
నారాయణఖేడ్ చరిత్రలో భూపాల్ రెడ్డి మంచి నాయకుడు…మీ కోసం పరితపిస్తాడు
ఆశీర్వదించండి..పెద్ద మెజారిటీతో గెలిపించండి..
కాంగ్రెస్‌కు వోటు ద్వారానే బుద్ధి చెప్పాలి
కాంగ్రెస్ దద్దమ్మలు గెలువడం చేతకాక దాడులు చేయిస్తున్నరు
అట్లా చేయాలనుకుంటే మేం చేయలేమా..?
నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
నారాయణఖేడ్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : వోట్లు వొచ్చినప్పుడు ఆగం కావొద్దని, గత పాలకుల పాలనలో ఎట్లా ఉండే…ఇప్పుడు ఎట్ల ఉన్నదని ఆలోచించి వోటు వేయాలని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్‌కు ప్రస్తుతం బీఆర్‌ఎస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్‌కు జమీన్‌కు ఆస్మాన్‌కు ఉన్నంత ఫరక్ ఉన్నదని, చాలా మార్పులు వొచ్చినయని, దీనికి ముఖ్య కారకుడు నారాయణఖేడ్ హీరో భూపాల్ రెడ్డి అని ప్రశంసలు కురిపించారు. ఉప ఎన్నికల్లో ఆశీర్వాదం ఇచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఆయన వ్యక్తిగత పని ఒక్కటి కూడా తనను ఎప్పుడూ అడుగలేదన్నారు. కొత్త మండలాలు, పాఠశాలలు, ప్రాజెక్టులు, నియోజకవర్గం కోసం పనులు అడిగేవారని, అందుకే నారాయణఖేడ్‌లో ఇంతగా అభివృద్ధి జరిగిందని, భవిష్యత్తులో ఇంకా జరుగాలన్నారు. సమైఖ్య రాష్ట్రంలో తాను మంత్రిగా ఉండే రోజుల్లో నారాయణఖేడ్‌కు చాలా సార్లు వొచ్చినానని, ఒకప్పుడు ఇక్కడ రేకు డబ్బాలు కనపడేవని, ఇప్పుడు భవంతులు కనపడుతున్నాయని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వొచ్చాయని, ప్రభుత్వ ఉద్యోగులు ఒకప్పుడు ఖేడ్‌కు రావడానికి భయపడే వారని, ఇప్పుడు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు హరీష్ రావు ఇక్కడికి రాగా చిమ్నిబాయి అనే లంబాడీ మహిళ ఆయనను త్రాగడానికి నీళ్లు లేవు…ఎందుకు వోటు వెయ్యాలే అని అడిగిందని, మంచంలో కూర్చుని స్నానం చేసి కింద తాంబూలం పెట్టుకుని నీళ్లు పట్టి పశువులకు పెట్టుకుంటమని అందన్న విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు బసమేశ్వర, సంగమేశ్వర లిఫ్టులు పెట్టుకున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సింగూరుకు లింకు పెట్టుకున్నామని, జహీరాబాద్‌కు నారాయణఖేడ్‌కు లిఫ్టు పెట్టుకున్నామని, తాంతో సింగూరు సంవత్సరం పొడవునా నిండి ఉండే ఉంటదని, శాశ్వతమైన జలవనరుగా తయారైందని అన్నారు. మల్లన్న సాగర్ నుంచి వొస్తున్న కాలువ నర్సాపూర్ వరకు తవ్వకం అయిందని, దీని ద్వారా 40 వేల ఎకరాల వరకు నీళ్లు రాబోతున్నాయని, బసవేశ్వర పూర్తయ్యి మల్లన్న సాగర్ వొస్తే సుమారు లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు వొస్తుందన్నారు.
భూపాలరెడ్డిని గెలిపి నల్లవాగు లిఫ్టు ఇరిగేషన్ పెట్టిస్తాను. రెండు పంటలు పండేట్లు నీళ్లు అందుతాయి. బాధ్యత నాద అన్నారు. మాసాన్ పల్లి రోడ్డు కూడా మంజూరు చేయిస్తా. ప్రజల కోసం ఆయన కోరిన కోరికలు తీర్చుతాను. భూపాల రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర అయిన దగ్గర నుంచి నారాయణ ఖేఢ్ దశ, దిశ మారిపోయింది. నారాయణఖేడ్ లో ఎక్కువగా ఉండి మీ సేవలో ఉంటడు. నారాయణ ఖేడ్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని అన్నారు. ‘కర్ణాటక మీ పొరుగున్నే ఉంటది. కర్ణాటక రైతుల గతి ఏమవుతున్నదో మీకు తెలుసే ఉంటది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మాసిఫాయితనానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వొచ్చి 5 గంటలు కరెంటు ఇస్తామని చెబుతున్నాడు. సిగ్గుండాలే చెప్పడానికి. 24 గంటలు ఇచ్చే రాష్ట్రం వచ్చి అలా మాట్లాడితే దేనితోటి నవ్వాలే.
భూపాల్ రెడ్డి నారాయణఖేడ్ చరిత్రలోనే మంచి నాయకుడు. మీ కోసం పరితపిస్తాడు. 100 తండాలను కొత్త గ్రామ పంచాయతీలను చేసుకున్నాం. లంబాడీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసుకుంటున్నాం. పోడు భూముల సమస్యలు పరిష్కరించుకున్నాం. భూపాల్ రెడ్డిని ఆశీర్వదించండి. పెద్ద మెజారిటీతో గెలిపించండి. మళ్లీ వచ్చి బసవేశ్వర లిఫ్టు ఇరిగేషన్ ప్రారంభిస్తాను.మీ స్కూల్లన్నీ పెట్టించే బాధ్యత తీసుకుంటున్నాను.
న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజల పనులు చేసినం. పేదలను ఆదుకున్నాం. తొమ్మిదేండ్ల నుంచి కరువు లేదు కర్ఫ్యూ లేదు. రాష్ట్రా న్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే వాళ్ల కండ్లలో నిప్పులు పోసుకుని మన మీద దాడులు చేస్తున్నారు. దాడులను తిప్పి కొట్టాలంటే మనం వోటు ద్వారానే బుద్ధి చెప్పాలి. వారి కండ్లు తెరిపించాలి. నారాయణఖేడ్ అభ్యర్థి భూపాల్ రెడ్డిని గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. సభలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీఛైర్మన్ మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.