తేనీటితో మానసిక ఉల్లాసం

తేనీరు (Tea)  ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు (టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమై పోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికి పైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్‌ ‌కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్‌ ‌కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విడుదల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది. చరిత్ర ప్రకారం.. టీని క్రీస్తుపూర్వం మొదటిసారిగా 2737లో చైనా చక్రవర్తి షెన్‌నంగ్‌ ‌కనిపెట్టారు. ఆయన తాగే వేడి గిన్నెలో టీ తేయాకు పడిందట.. దాని నుంచి వచ్చిన టేస్ట్ ఆయనకు నచ్చడంతో మొదట బ్లాక్‌ ‌టీ పుట్టుకొచ్చింది. ఆ తరువాత టీని…మనం తాగే విధంగా తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది.
అలాగే శతాబ్దాలుగా టీని ఔషధంగా వాడుతూ వచ్చేవారు. టీని తాగడానికే కాకుండా.. వివిధ రకాల మందులో విరివిగా ఉపయోగించేవారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభ మయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది.చైనా నుండి బ్లాక్‌, ‌గ్రీన్‌ ‌టీ రకాల విత్తనాలను లార్డ్ ‌మెకార్డెనీ తెప్పించి, భారతదేశంలో 1793 లో కలకత్తా బొటానికల్‌ ‌గార్డెన్స్‌లో ప్రవేశ పెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్‌, ‌కచార్‌, ‌నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి.  చాలాకాలం తర్వాత 1823 లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్‌ ‌సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టి నప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ వృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. ఇవి సింగ్‌ఫో జాతులు తోటల పెంపకంలో మిగిలినవై ఉండవచ్చు. ఈ కొండ ప్రదేశాలలో జనులు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు.
మొట్టమొదట 1838 లో దిబ్రుఘర్‌ ‌నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయ బడ్డాయి. ఈ బ్లాక్‌ ‌టీ సౌచోంగ్‌, ‌పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833 లో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయి నప్పుడు, ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర మైన ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 కి చైనా టీ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వృద్ధిపొందింది. 1880లలో అమెరికాలో మొదటిగా టీ బ్యాగుల వాడకం మొదలైంది. వ్యాపారం నిమిత్తం అక్కడివారికి టీని టేస్ట్ ‌చేయడానికి టీ పొడిని చిన్న బ్యాగుల్లో వేసి ఇచ్చారు. 18వ శతాబ్దం నుంచీ రెండో ప్రపంచ యుద్ధం వరకూ అమెరికాలో గ్రీన్‌ ‌టీ ఫేమస్‌. ‌తైవాన్‌లో 1980 నుంచీ బబుల్‌ ‌టీ అంటే బుడగల టీ వాడకంలో ఉంది. చిక్కటి టీని గిలక్కొట్టి ఇస్తారు. 1904లో వర్జీనియాలో ఐస్‌టీని కనిపెట్టారు. కొన్ని ఐస్‌ ‌ముక్కలపై టీని పోసి తాగేవారు.
నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, కేరళ ప్రాంతాలు భారతదేశంలో టీని అధికంగా ఉత్పాదించే రాష్ట్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భారతదేశపు టీ ఉత్పాదక ప్రదేశాలలో త్రిపుర, కర్ణాటక, మణిపూర్‌, ‌సిక్కిం, అరుణా చలప్రదేశ్‌ ‌ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. నీలగిరి కొండలలో భారత దేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించ బడుతుంది. మొత్తం సుమారు 98 శాతం టీని ఉత్పాదిస్తున్నాయి. సతత హరితపు మొక్క అయిన టీకి వర్షపాతం అధికంగా ఉండాలి. అప్పుడే అది పుష్కలంగా, సమృద్ధిగా పెరుగుతుంది.
దిగుబడి అధికంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రదేశాలలో పెరిగే టీ ఉత్తమమైనది. కానీ మైదానాలలో పెరిగే టీ వల్ల అధిక ఫలసాయం వస్తుంది. దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భారతదేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్‌ ‌లోని డార్జిలింగ్‌ ‌టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసన భరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల, ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో తేయాకు సాగు ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధి కలుగుతోంది. ఈ రంగంలో సుమారు 20 లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు ఉన్నారు.
చైనా, జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవం (Tea Ceremony) గా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్‌ ‌వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం, బ్రిటన్‌లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్‌ ‌టీని ఉప్పు, యాక్‌ ‌వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే, భారత దేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్‌ ‌లేక గ్రీన్‌ ‌టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరీలు త్రాగుతారు. ఇది చాల పుష్టికరమైన, రుచికరమైన పానీయం. గ్రీన్‌ ‌టీ లేదా ఆకుపచ్చ తేనీరు, అల్లం తేనీరు, తెల్ల తేనీరు, నల్ల తేనీరు, డార్జిలింగ్‌ ‌టీ ఇలా పలు రకాలుగా ఉన్నాయి.
టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ సువాసనల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన పానీయం. దీనిలో విటమిన్లు ముఖ్యంగా బీ గ్రూప్‌ ‌విటమిన్లు, రిబోఫ్లేవిన్‌, ‌నియాసిన్‌ ఉం‌టాయి. దీన్లో అతి తక్కువగా లభించే కెఫీన్‌ ‌మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అపాయకారి కాదు. తేనీరువల్ల కలిగే ప్రయోజనాలలో,  రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి. బ్లాక్‌ ‌టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు. రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది. టీలో ఉండే ఫ్లోరైడ్‌ ‌దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్ ‌గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి. గ్రీన్‌, ‌బ్లాక్‌ ‌టీలలో ఉండే ఎల్‌-‌థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ ‌రాకుండా కాపాడతాయి. అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు. టీ డీహైడ్రేషన్‌ ‌సమస్యనూ దూరం చేస్తుంది. అలాగే టీ వల్ల నష్టాలూ లేక పోలేదు. ఆహారముతో పాటు టీని తీసుకుంటే ఆహారము లోని పోషక పదార్థములు శరీరము గ్రహించడంలో ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ‘ ఐరన్‌ ‘ ‌టానిన్‌ ‌తో కలిసి పనికిరాకుండా పోతుంది. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్‌ ‌రావడానికి అవ కాశ ముంటుంది. టీ మెదడుని ఉత్తేజ పరిచి నందున శరీరం హుషారుగా ఉన్నా కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్‌ ‌కు  లోనవుతుంది. విద్యార్థులు టీ తాగి  నిద్ర రాకుండా చదివినా, ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు. టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి భోజము తీసుకోవడం తగ్గడం వలన ఆరోగ్యము క్షీణిస్తుంది.
 – రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *