తెలంగాణ ఎన్నికల రణరంగం జోరుమీద నడుస్తోంది. అలవికాని వాగ్దానాలు, పరస్పర దూషణలు నిస్సిగ్గుగా ప్రవహిస్తున్నాయి. ఇంకో రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లబోతున్నదనేది తెలిపోతుంది. ఈ సందర్భంగా కొన్ని ‘రాజకీయ ముచ్చట్లు’ చెప్పుకుందాం. ఇప్పుడు జరుగుతున్నదంతా అదేగా, మళ్లీ కొత్తగా మీరు చెప్పే రాజకీయం ఏముంది అని ఎగతాళి చేయవచ్చు కొందరు! రాజకీయం అంటే ఆ పార్టీవాళ్లని ఈ పార్టీవాళ్లు, ఆ రెండింటినీ ఇంకో పార్టీవాళ్లు విమర్శించుకోవటమనే ‘బావి’ నుంచి బయటకు వస్తే గానీ ఇప్పుడు చెప్పబోయే రాజకీయ ప్రశ్నలు అర్థంకావు!
తెలంగాణ ఎన్నికల రణరంగం జోరుమీద నడుస్తోంది. అలవికాని వాగ్దానాలు, పరస్పర దూషణలు నిస్సిగ్గుగా ప్రవహిస్తున్నాయి. ఇంకో రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లబోతున్నదనేది తెలిపోతుంది. ఈ సందర్భంగా కొన్ని ‘రాజకీయ ముచ్చట్లు’ చెప్పుకుందాం. ఇప్పుడు జరుగుతున్నదంతా అదేగా, మళ్లీ కొత్తగా మీరు చెప్పే రాజకీయం ఏముంది అని ఎగతాళి చేయవచ్చు కొందరు! రాజకీయం అంటే ఆ పార్టీవాళ్లని ఈ పార్టీవాళ్లు, ఆ రెండింటినీ ఇంకో పార్టీవాళ్లు విమర్శించుకోవటమనే ‘బావి’ నుంచి బయటకు వస్తే గానీ ఇప్పుడు చెప్పబోయే రాజకీయ ప్రశ్నలు అర్థంకావు! రాజకీయ పార్టీలతో పాటు వివిధ సామాజిక అంశాల మీద పనిచేసేవాళ్ల డిమాండ్లు కూడా ఎంతో కొంత ప్రచారంలోకి వస్తూ వుంటాయి. ఆయా సమూహాల నుంచి పనిచేసే వ్యక్తులను సీనియర్ పత్రికా సంపాదకులు కూడా గుర్తించి వాళ్లు చేసే పౌర ప్రయత్నాలను కూడా ప్రస్తావిస్తారు. మీడియా ఎంతో కొంత వాళ్ల అభిప్రాయాలను కూడా రికార్డు చేస్తుంది. అంతవరకూ బానే వుంది. అయితే, పౌరసమూహం నుంచి పనిచేస్తున్నవాళ్లలో కూడా మీడియా గుర్తించేది ఎవరిని? ఆ గుర్తించేవారిలో కూడా కొన్ని సమూహాలు ఎందుకు ఉండవు ? ఆ సమూహాలు చేసే సమష్టి కృషి ఎవరి దృష్టికీ ఎందుకు వెళ్ళదు? అరకొరగా వచ్చే అభిప్రాయాలు కేవలం కొన్ని పేజీలకే ఎందుకు పరిమితం అవుతాయి? ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిర్ధిష్టంగా రాతపూర్వకంగా తయారుచేసి వివిధ రాజకీయ సమూహాలను ప్రత్యక్షంగా కలిసి ఇచ్చినా గాని క్షేత్రస్థాయిలో పనిచేసే అట్టడుగు సమూహాల ప్రతినిధుల డిమాండ్లు ఎందుకని ప్రాముఖ్యతను సంతరించుకోదు? తెలంగాణ రాజకీయపార్టీలకే కాదు, పౌరసమాజానికి, పౌరసంస్థలకి కూడా ఈ ప్రశ్నలు వర్తిస్తాయి.
2018 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల, వ్యక్తుల ఐక్య కార్యాచరణ కమిటీ (దాదాపు ముప్పై సంఘాలపైనే దీనిలో భాగం) ఒక ఎన్నికల మానిఫెస్టో తయారుచేసి అన్ని రాజకీయపార్టీలకూ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు 2023 ఎన్నికల సందర్భంగా తమ నిర్ధిష్ట డిమాండ్లను పత్రికాముఖంగా అందరికీ తెలియజేయటమే కాదు- క్షేత్రస్థాయిలో రాజకీయపార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాల మీద ప్రజలను జాగృతం చేసే పనిలో నిమగ్నమయివున్నారు. ఇవి కేవలం మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాలలో పనిచేసేవారి వ్యక్తిగత అంశాలు కావు. భవిష్యత్తులో అధికారంలోకి రాబోయే రాజకీయపార్టీలు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవలసిన రాజకీయ అంశాలు. వోట్ల కోసం మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్ జెండర్ అంశాలను కేవలం సంక్షేమ పథకాలుగా మాత్రమే చూసే దృష్టికోణాన్ని వ్యతిరేకిస్తూ విధానపరమైన అంశాలుగా వాటిని చూడాలని డిమాండ్ చేస్తూ వాటి రూపకల్పనలో తప్పనిసరిగా క్షేత్రస్థాయి సమూహాల ప్రాతినిథ్యం ఉండాలని కూడా తమ మానిఫెస్టోలో పొందుపరిచారు. అందులో రాజకీయ ప్రాతినిధ్యం, హింసకు వ్యతిరేకంగా రక్షణ వ్యవస్థల ఏర్పాటు, విద్య, ఆరోగ్య వ్యవస్థల పటిష్టత, దళిత, బహుజన, మైనారిటీ, ట్రాన్స్ జెండర్ సమూహాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టవలసిన చర్యలు, గృహ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, బీడీ కార్మికులు, మహిళా రైతుల వంటి అనేక అసంఘటిత రంగాల మహిళలకు సంబంధించి తీసుకోవాల్సిన విధానపరమైన అంశాలు అన్నిటినీ ఈ మానిఫెస్టోలో చర్చించారు. వాటిలో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
మొట్టమొదటి అంశం: ఈ ఎన్నికల తర్వాత ఏ రాజకీయపార్టీ అధికారంలోకి వచ్చినా గానీ రెండు నెలల లోపు మహిళా, ట్రాన్స్జెండర్ సంఘాలు, మేధావులు, కార్యకర్తలతో వరుస విస్తృతస్థాయి సమావేశాల్ని ఏర్పాటుచేసి ఈ కింది అన్ని అంశాలతో పాటు జెండర్ సంబంధిత ఇతర విషయాల గురించి కూడా విధానపరమైన రూపకల్పన కోసం కూలంకషంగా చర్చించాలి. విధాన రూపకల్పనలో మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాలను, వ్యక్తులను, సామాజిక కార్యకర్తలను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలి. వివిధ అంశాల మీద పనిచేస్తున్న సామాజికవేత్తల భాగస్వామ్యం ఉంటేనే వివిధ పథకాల రూపకల్పనలో, వాటి కార్యాచరణలో ఒక క్రమపద్ధతికి ఆస్కారం ఉంటుంది. సామాజిక పురోభివృద్ధికి తోడ్పడేవి ఇలాంటి అంశాలు మాత్రమే.
రెండు: మహిళా కమిషన్ ను స్వతంత్ర సంస్థగా పరిగణించి కేబినెట్ అధికారాలతో పనిచేసే వ్యవస్థను ఏర్పరచాలి. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా తమ పార్టీలోని మహిళా నేతను కాకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా పూర్తికాలం ఇదే పని మీద సమయం కేటాయించే నిజాయితీ, నిబద్ధత కలిగిన స్వతంత్ర వ్యక్తులకు బాధ్యత ఇవ్వాలి. నిస్పక్షపాతంగా జెండర్ సమానత్వం కోసం తీసుకోవాల్సిన వ్యవస్థాగత కార్యక్రమాలను రూపకల్పన చేసి పర్యవేక్షించే స్వతంత్ర ప్రతిపత్తి ఈ సంస్థకు వుండాలి.
మూడు: సంవత్సరాల తరబడి మహిళల రాజకీయ ప్రాతినిధ్యం మీద మీనమేషాలు లెక్కించిన పార్టీలు హడావుడిగా ఏ చర్చా లేకుండా, సమాజంలోని వివిధ సమూహాల మహిళల రాజకీయ ప్రాతినిధ్యం లేకుండానే మహిళాబిల్లుని చట్టం చేయటం వల్ల అది కేవలం ఆధిపత్యవర్గాలకు మాత్రమే పరిమితం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విభిన్న సమూహాల మహిళలకు రాజ్యాంగబద్ధంగా అవకాశం కల్పించే అమెండ్ మెంట్ కోసం చిత్తశుద్ధి ఉన్న అన్ని రాజకీయపార్టీలు కృషిచేయాలి. మహిళలకు మేమే ఏదో చేసేస్తున్నాం అని డాబుగా చెప్పటం తప్పించి, ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టిన వాళ్ల సంఖ్య అన్ని పార్టీలలోనూ నిరాశాజనకంగానే ఉంది . అయినా గాని, ఎన్నికల తర్వాత వివిధ సమూహాల మహిళలకు మంత్రివర్గంలో నిర్ధిష్ట ప్రాతినిధ్యం ఉండాలి.
నాలుగు: వివిధ ప్రజాస్వామిక పోరాటాలలో పాల్గొంటున్నవారిపై నిర్బంధం పెద్దఎత్తున కొనసాగుతోంది. పోడుభూముల పరిరక్షణ కోసం, విధ్వంసకర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, ఇటీవల ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో మహిళలపై దాడులు జరిగాయి. ఎన్నో అక్రమ కేసులు, ఉపాలాంటి చట్టాలు ప్రయోగించి ఉద్యమకారులను వేధిస్తున్నారు. వీటిని తీవ్రంగా వ్యతిరేకించి, కేసులు ఎత్తివేయాలి. కక్షసాధింపు ధోరణులు వదిలేయాలి.
ఐదు: రాష్ట్ర ఖజానాకు మద్యం ద్వారా వస్తున్న డబ్బే ప్రధాన ఆదాయ వనరుగా మారిపోవటం అత్యంత దురదృష్టకరం. మద్యం అమ్మకాల్లో ‘దేశం’లోనే ముందున్న తెలంగాణ, దీనివల్ల జరుగుతున్న కుటుంబాల విధ్వంసంలో కూడా ముందుంది. యువతను, పిల్లలను గంజాయి, మద్యంమత్తులో ముంచెత్తుతున్న, మహిళపై హింసను పెంచి పోషిస్తున్న అబ్కారీ విధానాన్నివ్యతిరేకిస్తూ, మద్యం అమ్మకాలను నియంత్రించే పాలసీని వాగ్దానం చేయాలని, మద్యం కాదు ఉపాధి, ఉద్యోగ నియామకాల విధాన రూపకల్పన, విద్యా- ఆరోగ్య వ్యవస్థల రూపకల్పన అత్యంత ప్రధానమని అన్ని రాజకీయపార్టీలను ఈ వేదిక డిమాండ్ చేస్తోంది.
ఆరు: గత అయిదేళ్లలో స్త్రీలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్ సమూహాల మీద హింస విపరీతంగా పెరిగింది. దీనిని నివారించటానికి వ్యవస్థాపరమైన రక్షణ వ్యవస్థలను పెంపొందించే బదులు తక్షణ న్యాయం పేరుతో ప్రభుత్వం ‘ఎన్కౌంటర్’, ‘ఆత్మహత్యల’ను ప్రేరేపించటం దురదృష్టకరం. ప్రతి బస్తీలో, గ్రామంలో రక్షణవ్య వస్థలను పెంపొందించాలి. చాలా మురికివాడల్లో అట్టడుగున ఉన్న ప్రజలు, ఒంటరి మహిళలు, అనాథ పిల్లలు ఉన్నారు. అక్కడ చాలా దారుణాలు, దుర్వినియోగాలు, నేరాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. వీటిమీద నిరంతర పర్యవేక్షణతో కూడిన వ్యవస్థని ఏర్పాటుచేయాలి. ట్రాన్స్ జెండర్ సమూహాల మీద జరుగుతున్న వివక్ష, హింసలను రూపుమాపేలా విద్యా- ఆరోగ్య విధానాలు, ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేక పాలసీని తయారుచేయాలి.
ఏడు: జంట నగరాలను, తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని శాంతి, సామరస్యంతో జీవించడానికి ఒక సమ్మిళిత, సంతోషకరమైన ప్రదేశంగా మారుస్తామని వోటర్లకు అన్ని రాజకీయపార్టీలు భరోసా ఇవ్వాలి. విభిన్న మత సమూహాల ప్రజల మధ్య సామరస్యం పెంపొందేలా చర్యలు తీసుకోవాలి. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను రాజకీయపార్టీలు విడనాడాలి.
ఎనిమిది: గృహ కార్మికుల పై సమగ్ర చట్టాన్ని రూపొందించాలి. ILO కన్వెన్షన్- 189 ఆమోదించాలి. గృహకార్మికులకు వైద్య సదుపాయాల్ని, ముఖ్యంగా ESI లబ్దిదారులుగా చేర్చాలి.
తొమ్మిది: మన దేశంలో అసంఘటిత కార్మికులు ముఖ్యంగా ఇంటి పనివారు, వ్యర్థాలను ఏరుకునేవారు, వ్యవసాయ కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కొనుగోలుకు సరిపడా డబ్బు లేకపోవడంతో వారికి తీవ్రంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కోవిడ్ పరిస్థితి వారిని మరింత సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈ సందర్భంగా సమగ్ర ఆరోగ్యవిధానం, మౌలిక సదుపాయాల కల్పన, సేవ, పేదలకు ఆరోగ్య సంరక్షణ లభ్యతను చూడవలసిన తక్షణ అవసరాన్ని అన్ని రాజకీయపార్టీలు గుర్తించాలి. గ్రామాలు, మురికివాడల్లోని అన్ని పి.హెచ్.సిలలో వైద్యసిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచాలి. మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. విషజ్వరాలను అదుపుచేయడానికి తగిన చర్యలు చేపట్టాలి.
అంటువ్యాధుల నిర్మూలన, నివారణకు ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టంచేయాలి. పిల్లల ఆరోగ్యవంతమైన అభివృద్ధికి, తల్లిపిల్లల మధ్య మరణాల రేటును తగ్గించడానికి, తల్లిపిల్లల ఆరోగ్య సంరక్షణపై కూడా దృష్టి సారించాలి. భారతీయ జనాభాలో 20% పైగా ప్రబలంగా ఉన్న అధిక రక్తపోటు, గుండెపోటులకు దారితీస్తున్న పరిస్థితులపై దృష్టిసారించాలి. పర్యావరణ, ఆహార కాలుష్యం వల్ల ఆస్తమా దాదాపు 7% జనాభాలో ప్రబలంగా ఉంది. దాదాపు 30 మిలియన్ల మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ వ్యాధులతో పేదలు రెట్టింపు భారాన్ని అనుభవిస్తున్నారు. ఈ వ్యాధుల నివారణ, నిర్వహణ (విద్య- ఆహారం- వ్యాయామం- నిరంతర మందుల లభ్యత)లో నూతన దృష్టి విధానం అవసరం. మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి, సహానుభూతితో కూడిన వ్యవస్థల రూపకల్పన జరగాలి.
పది: రాజకీయాల్లో విమర్శలు అంటే వెంటనే జెండర్ వివక్షతో కూడిన అవమానకరమైన భాష ఉపయోగించటం, స్త్రీల వేషధారణను అవమానపరచటం, ‘గాజులు వేసుకోలేదు’, ‘మగాడివా లేక కొజ్జావా’ అంటూ ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని కించపరచటం వంటివి తరచూ జరుగుతున్నాయి. ఈ ధోరణులను ఖండిస్తూ అలా మాట్లాడిన రాజకీయ నాయకులను కఠినంగా శిక్షించే విధానాన్ని ప్రవేశపెట్టాలి. జెండర్ సెన్సిటివ్ భాషను, వాటిని పెంపొందించే విద్యా విధానాన్ని పాఠశాల స్థాయి నుంచే ప్రవేశపెట్టాలి. అందుకు అవసరమైన విధివిధానాల్ని రూపొందించాలి.
ఎన్నికల ప్రచారంలో మాత్రమే కాదు, ఎన్నికల తర్వాత ఏర్పడబోయే పాలనా వ్యవస్థ ఈ అంశాలను స్వీకరిస్తుందా? లేకపోతే ఇవి అసలు రాజకీయ ప్రశ్నలే కాదు అని వదిలివేస్తుందా?????
-కె. సజయ,
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్