తిమ్మాపూర్‌ ‌ప్లాంట్‌లో కోకాకోలా 600 కోట్ల పెట్టుబడులు

  • ప్రభుత్వంతో ఒప్పందం
  • మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి

కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ ‌తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. మంత్రి కేటీఆర్‌ ‌సమక్షంలో హిందుస్థాన్‌ ‌కోకాకోలా బేవరేజస్‌ ‌సంస్థతో తెలంగాణ ప్రభుత్వం గురువారం నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేయబోయే కొత్త పరిశ్రమ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కోకాకోలా కంపెనీ భవిష్యత్‌లో మరో రూ. 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. కంపెనీ మహిళలకు 50 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. స్థానికంగా దొరికే వనరులు వాడుకోవాలని కంపెనీకి సూచిస్తున్నామని, ప్రస్తుతం ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు సమస్యగా మారాయన్నారు.

పర్యావరణహితమైన వాటిని వినియోగించాలని సంస్థను కోరుతున్నామని చెప్పారు. ప్యాకేజింగ్‌ ‌రంగంలోనూ హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రం అవుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *