- మూడు టేబుళ్లపై పోలీసుల గురి
- సిసి పుటేజ్ ఆధారంగా ఆధారాల సేకరణ
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 5 : సంచలనం కలిగించిన బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మూడు టేబుళ్లపై బర్త్ డే పార్టీ జరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ మూడు టేబుళ్ల వి•ద పార్టీ చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించారు. ఇరుకు గదిలో చీకటి ఉండటంతో… సీసీ కెమెరాల దృశ్యాల గుర్తింపు పోలీసులకు కష్టంగామారింది. అసలు వారంతా తీసుకున్న డ్రింక్‌లో ఏం కలిసిందనే దానిపై సైతం ఆరా తీస్తున్నారు.
పబ్ మేనేజర్ గోవా ట్రిలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మైనర్లను పబ్బులోకి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు అభిషేక్, అనిల్‌లను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్‌ని పోలీసులు గుర్తించారు. శనివారం రైడ్స్‌లో ఓ అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అతడు గోవాకు రెగ్యులర్‌గా వెళ్తుంటాడని నిర్దారణకు వొచ్చారు. పబ్‌కు వొచ్చిన వ్యక్తుల్లో ముగ్గురిపై డ్రగ్స్ కేసులు వున్నాయి. ఇప్పటికే మేనేజర్ అనిల్, ఓనర్ అభిషేక్ రిమాండ్‌లో వున్నారు. పరారీలో మరో ఇద్దరు ఓనర్లు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పబ్ లోకి డ్రగ్స్ ఎవరు తెచ్చారనే దానిపై ముమ్మర విచారణ సాగుతుంది. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కేసులో పోలీసులపై వరుస ఆరోపణలు, విమర్శలు రావడంతో వారు కేసును సవాల్‌గా తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసును చేధించేందుకు ప్రత్యేక టీమ్‌లను పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.
పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్‌లో 125 మంది యువతీ యువకులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. వారంతా దర్యాప్తు పూర్తయ్యేవరకూ అందుబాటులో వుండాలని ఆదేశించారు. గతంలో కూడా పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దందా నడిచినట్లు పోలీసులు గుర్తించారు . 125 మందిలో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? పబ్‌కు వొచ్చే వారు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారా? పబ్‌లో డ్రగ్స్ ఎవరి కోసం తెచ్చారు? 125 మందిలో పబ్‌కు రెగ్యులర్‌గా వొచ్చే యువతీ యువకుల లిస్ట్ తయారు చేసే పనిలో పోలీసులు పడ్డారు. డ్రగ్స్ కేసు కొలికి వొచ్చే వరకు 125 మంది పోలీసులకు అందుబాటులో ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. 125 మందిలో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు, వారి కోసం అన్వేషిస్తున్నారు.