జైలు నుంచి సిద్ధూ విడుదల
చండీఘడ్, ఏప్రిల్ 1 : పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ(59) శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల అయ్యారు. జైలులో సత్పవ్రర్తన కారణంగా రెండు నెలల ముందుగానే ఆయన విడుదల అయ్యారు. పంజాబ్ జైలు నిబంధనల ప్రకారం సత్పవ్రర్తన కలిగిన దోషి క్షమాపణకు అర్హులని సిద్ధూ తరఫు లాయర్ హెచ్‌పీఎస్ తెలిపారు. మరోవైపు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
ప్రస్తుతం ఆమె స్టేజీ 2లో ఉన్నారు. 34 ఏళ్ల క్రితం ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సిద్ధూను దోషిగా నిర్దారించింది. మే 2022 నుంచి ఆయన పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ వచ్చారు. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంలో 65ఏళ్ల గుర్నామ్ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్‌లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుర్నామ్ సింగ్ మృతి చెందాడు. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పార్టీ అతనిపై చర్యలు తీసుకుంది.