ఆ కలం ప్రకంపనం
ఆ అక్షరం ప్రజ్వలనం
ఆ కవనం సంచలనం
ఆ రచనం అచంచలం
తనే చలంగా ప్రసిద్ధుడైన
గుడిపాటి వెంకటాచలం
స్త్రీజాతి దాస్య విముక్తికి
అక్షర యుద్ధం చేసినవాడు
ఛాందసవాదశక్తుల మీద
ధిక్కార స్వరమెత్తినవాడు
మైదానం, బ్రాహ్మణికం,
శశిరేఖ వంటి నవలలతో
జగతిని మేల్కొల్పినవాడు
విప్లవాత్మక రచనలతో
ప్రకంపనలు రేపినవాడు
విమర్శలు ముంచెత్తినా
సమాజం తిరస్కరించినా
నమ్మిన ఇజం వీడనివాడు
స్త్రీవాదం విస్మరించనివాడు
సంఘసంస్కర్త,తత్వవేత్త
సాహితివేత్త, స్త్రీపక్షపాతి
వేదాంతిగా వినతికెక్కాడు
కొందరికి ఆశ్చర్యార్థకం
ఇంకొందరికి ప్రశ్నార్థకం
మరెందరికో నివృత్తి గీతం
వెరసి ‘‘చలం’’ సంచలనం
కవన మహర్షి
సాహితి ఋషి
మహిళా హితైషికి
అక్షర సుమాంజలి
జనగణ జయహారతి
(ఏప్రిల్ 19 న ‘‘చలం’’ జయంతి సందర్బంగా అక్షరప్రణతి అర్పిస్తూ..)
– కోడిగూటి తిరుపతి :9573929493