- ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి
- హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావు మృతి
- సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన
పోడు భూములు ప్లాంటేషన్ చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరుకోగా గొత్తికోయలు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. భదాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దండాలపాడు ఎర్రపోడు అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ వేయగా ఆ ప్లాంటేషన్‌లో గొత్తికోయలు పశువులు మేపుతున్నారని వాచర్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస్‌రావుకు సమాచారం ఇవ్వడంతో శ్రీనివాస్‌రావుతో పాటు సెక్షన్ ఆఫీసర్ తేజావత్ రామారావు ప్లాంటేషన్‌కు వెళ్లారు. వాచర్ రాములు, సెక్షన్ ఆఫీసర్ రామారావులు పశువులను ప్లాంటేషన్ నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనను మృతుడు చలమల శ్రీనివాస్‌రావు వీడియో తీస్తున్నారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న మరకం తుల వేట కత్తితో తల, మెడ భాగంలో బలంగా గాయపర్చారు.
శ్రీనివాస్‌రావును రక్షించేందుకు సెక్షన్ ఆఫీసర్ రామారావు అక్కడికి వెళ్లగా అతనిపై కూడా దాడి చేశారు. భయపడిన సెక్షన్ ఆఫీసర్, వాచర్ రాములు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడి నుంచి డిఎఫ్వో అప్పయ్యకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఆయన అక్కడికి చేరుకొని గాయపడిన రేంజర్‌ను చండ్రుగొండ ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్‌కు 108లో తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రేంజర్ శ్రీనివాస్‌రావు మృతి చెందారు. శ్రీనివాస్‌రావుకు భార్య భాగ్యలక్ష్మి, 9వ తరగతి చదువుతున్న కుమారుడు యశ్వంత్, 6వ తరగతి చదువుతున్న కూతురు కృతికలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు, జూలురుపాడు సిఐ వసంతరావు, చండ్రుగొండ, జులూరుపాడు ఎస్సైలు, సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రీనివాస్ మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
భదాద్రి కొత్తగూడెం జిల్లాలో గొత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు మృతి చెందడం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్‌రెడ్డిని సిఎం ఆదేశించారు. మరణించిన ఫారెస్ట్ అధికారి కుటుంబానికి 50లక్షల ఎక్స్‌గ్రేషియాను సిఎం ప్రకటించారు. అంతేగాకుండా కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఎం ఆదేశించారు. ఫారెస్టు అధికారి పార్థీవ దేహానికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. శ్రీనివాస్‌రావు అంత్యక్రియల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నారు.



