‘గురు’తర బాధ్యత గుర్తెరగాలి..

“ఒక్కసారి ఉపాధ్యాయ వర్గం కంకణబద్దులై సమాజం పట్ల ఆలోచిస్తే మనం ఆశించిన విద్యా విధానాలు సంస్కరణలు మనమే స్వయంగా అమలులోకి తీసుకురాలేమా?విద్యారంగం కుప్పకూలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తరగతి గది నిర్వీర్యమైతే దేశమే చీకటిగా మారిపోతుంది.ఒక్కసారి అధ్యాపక వర్గం ఆలోచించి ఈ సమాజాన్ని నిలబెట్టాలన్న ధృడ సంకల్పంతో సమిష్టిగా ముందడుగు వేస్తే చిత్త శుద్ధితో విధి నిర్వహణలు చేస్తే మనం ఆశించిన ఫలితాలు రావడానికి ఎంతో సమయం పట్టదు.”

జాతి పురోగతిలో ఉపాధ్యాయుల పాత్ర విస్మరించరానిది ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు  సాగడానికి దేశ అక్షరాస్యత ముఖ్యమనే విషయం కాదనలేని అంశం. విద్యారంగం, దేశానికి గుండెవంటిది. ఆ రంగం ఆగిపోతే దేశానికి కావాల్సిన రక్త ప్రసారం ఆగిపోయినట్లుగా ప్రముఖ విద్యావేత్తలు పేర్కొన్నారు.నేటి విద్యావిధానాన్ని చదువుకొంటున్న విధానంగా నేటి విద్యా వ్యవస్థ నయా దోపిడి వ్యవస్థగా లైసెన్స్ ఉన్న మాఫియా వ్యవస్థగా చెప్పవచ్చు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాల నిర్వహణకు ఉపాధ్యాయుల జీతభత్యాలు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఒక అంచనా. అదే విధంగా ఉన్నత పాఠశాలలు. జూనియర్‌, ‌డిగ్రీ కళాశాలలు సాంకేతిక కళాశాలలు మెడికల్‌ ‌పిజి కళాశాలలు సంబంధించి మరిన్ని వేలకోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ఇంత స్థాయిలో ఖర్చు పెడుతున్న ప్రైవేట్‌ ‌రంగం నందలి పాఠశాలలు కళాశాలల్లో మాత్రమే తమ పిల్లల్ని చేర్పించడానికి తల్లితండ్రులు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు.కొన్ని బ్రాండెడ్‌ ‌విద్యా సంస్థలు శాఖోపశాఖలుగా విస్తరించి నిబంధనలు తుంగలో తొక్కి విద్యాదోపిడిని కొనసాగిస్తున్నాయి. విస్తరించిన ఈ విద్యా సంస్థలలో తమ పిల్లలు చదవకపోతే వారికి మంచి భవిష్యత్‌ ఉం‌డదన్న ప్రచారం కొనసాగిస్తున్నారు.

తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు కళాశాలకు పంపడం అంటే వారు మంచి తల్లిదండ్రులు కాదనే భావన ప్రస్థుతం మన సమాజంలో నెలకొంది.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి స్కూళ్ళలో చదివించాలనే ఉద్ధేశంతో ఆస్థులు అమ్ముకుని మరీ ప్రైవేట్‌ ‌విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు.ప్రభుత్వాలు భావి పౌరులను విద్యార్థులను తమ సామాజిక భవిష్యత్‌ ‌దేశ భవిష్యత్‌గా పరిగణించకపోవడంతో అందరికి విద్యను అందించాలనే అతిముఖ్యమైన ప్రాథమికమైన బాధ్యత నుండి
ప్రభుత్వం అంచెలంచెలుగా తప్పుకోవడంతో విద్య ప్రైవేటీకరణకు తదుపరి వ్యాపారీకరణకు ద్వారాలు తెరిచింది. విచ్చలవిడిగా ప్రైవేట్‌ ‌వ్యక్తులకు విద్యా సంస్థలు నడుపుకోవడానికి పాలకులు అనుమతి ఇవ్వడంతో ఇది ఒక మాఫియా వ్యాపారంగా విస్తరిస్తోంది.దాదాపు 90 శాతం విద్యా సంస్థల అధినేతలు ఏదో ఒక రాజకీయ పార్టీలో కీలక స్థాయిలో పని చేస్తుండటం ‘విద్యారాజకీయ’ వ్యాపారులు సిండికేట్‌గా మారడం, రాజకీయ పార్టీల అండదండలు పుష్కలంగా ఉండటంతో విద్యా వ్యాపారమై ఆ వ్యాపారం కలుషితమై మొత్తం వ్యవస్థను బ్రష్టుపటిస్తున్నాయి.

కార్పోరేట్‌ ‌విద్యా సంస్థలు చేస్తున్న విద్యా వ్యాపారాన్ని నియంత్రిం చడానికి ఖచ్చితంగా వ్యవహరించాలని ప్రైవేట్‌ ‌విద్యాకు ధీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దాలని, సమాజం బలంగా కోరుకు ంటుంది. కాని ఇటువంటి చర్యలు, ప్రశ్నలు సందేహాలు ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోయడం కేవలం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందరూ మర్చిపోతున్నారు. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం వరకు షరామామూలే!
ప్రభుత్వాలు ఒకవైపు కోట్లరూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రారంభం నుంచే కనీసం 35 వేలు 40 వేల రూపాయల వేతనం ఉండగా సీనియారిటీ ఉన్న టీచర్లకు హీనపక్షం 70 నుంచి 80 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు.మంచి వేతనాలు పొందుతున్న అధ్యాపకులలో చాలమంది తమ విధుల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారేమో అనే భావన కలుగుతుంది. సమీప పట్టణాల్లో ఉంటూ అసలు వృత్తిని కాలక్షేపం చేస్తూ కొందరు ఇతర ప్రైవేట్‌ ‌వ్యాపారాలలో మునిగిపోతున్నారు.

ఈ రోజు ప్రభుత్వ అధ్యాపకులుగా పని చేస్తున్న వారిలో చాలమంది గ్రామాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వారమనే విషయాన్ని విస్మరిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో వసతులు సరిగ్గా ఇవ్వడంలేదని తాము కోరుకున్న ప్రాంతంలో తమ బదిలీ కాలేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడం. తమ సహా అధ్యాపకులతో తమ జీతాల్ని జీవితాల్ని పోల్చుకుని అసలు వృత్తిని నిర్లక్ష్యం చేస్తున్న అధ్యాపకులను మనం చాలమందిని చూస్తున్నాము.
‘చదువులుచారెడు-బలపాలు దోశెడు’ లాగా వివిధ అధ్యాపక  సంఘాలు ఆధిపత్యపోరులో విధుల్ని విలువల్ని గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి.ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే దాదాపు లక్షా 30 వేల మందికి పైగా టీచర్లు ఉన్నారు. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో అందరి కీ బాగా తెలుసు.అధ్యాపకుల్లారా ఒక్కసారి ఆలోచించండి. పిల్లల చదువులకోసం ఆస్థులను అమ్ముకోవడం లేదా తాకట్టు పెట్టడం అప్పులు చేసే పరిస్థితులను మన సమాజాన్ని బయటపడయ్యలేమా?

ఒక్కసారి ఉపాధ్యాయ వర్గం కంకణబద్దులై సమాజం పట్ల  ఆలోచిస్తే మనం ఆశించిన విద్యా విధానాలు సంస్కరణలు మనమే స్వయంగా అమలులోకి తీసుకురాలేమా?విద్యారంగం కుప్పకూలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తరగతి గది నిర్వీర్యమైతే దేశమే చీకటిగా మారిపోతుంది.ఒక్కసారి అధ్యాపక వర్గం ఆలోచించి ఈ సమాజాన్ని నిలబెట్టాలన్న ధృడ సంకల్పంతో సమిష్టిగా ముందడుగు వేస్తే చిత్త శుద్ధితో విధి నిర్వహణలు చేస్తే మనం ఆశించిన ఫలితాలు రావడానికి ఎంతో సమయం పట్టదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page