గుండెల్లోని భావాగ్ని…

నవ్యత వైపు వేసే ప్రతి అడుగూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కాలానుగుణమైన మార్పులను స్వీకరించి ముందుకు సాగడం కవిత్వ లక్ష్యం, లక్షణం కావాలి. బలీయమైన భావనాశక్తితో వస్తువు, విషయ నిష్టత, శబ్ద శక్తి కలిగి రమణీయమైన శైలితో వెలువడే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. నవనవోన్మేషమైన తాత్త్విక సంయోజనా నిపుణతను కలిగిన కవి రమణీయాక్షర  పరిమళాలను అద్ది ఉదాత్తమైన యౌగిక ప్రక్రియగా కవిత్వాన్ని మారుస్తాడు. ఆలోచనల  ఇనబింబాన్ని  వెలిగించే ప్రేరక కేంద్రంగా తన కవిత్వాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే గుణాన్ని కలిగించి హృదయ నేత్రాలను తెరిపిస్తాడు.  నిజానికి కవిత్వం ఒక అద్భుత సమ్మోహన శక్తి. రసాత్మక భావ సమ్మేళనంతో జీవన మూలాలను స్పృశిస్తూ సామాజికతను, ప్రామాణికతనూ అందిపుచ్చుకుని మానవానుబంధాల ప్రాధాన్యతను బలంగా వెల్లడిస్తూ కవితా చైతన్య పతాకాన్నెగరేసిన కవి పొత్తూరి సీతారామరాజు.

రాయడం కన్నా ఎక్కువగా చదవడమే తనకు ఎంతో ఇష్టమని తనలోని నిత్య పాఠకత్వాన్ని గురించి కవి నోట పలుమార్లు నేను విన్న మాటలు గుర్తొచ్చినప్పుడల్లా  అలా నిరంతరం చదవడం వల్లనే ఆయన కలానికి ఇంతటి చిక్కటి కవిత్వం ఒంటబట్టిందేమో అనిపించింది. శీర్షికల ఎంపికలో కనబరిచే ప్రత్యేకత ప్రతికవితకు ఒక తిలకం బొట్టవుతుంది. శీర్షికనే ఆసక్తిని పెంపొందించి పాఠకుడిని కవితలోకి నడిపిస్తుందన్న విషయాన్ని ఎంతో ఆదరణ పొంది జనం నాలుకలపై సజీవంగా నిలిచిపోయిన ఎన్నో కవితలు చెబుతాయి.  ఈ కవి కవితా శీర్షికలన్నీ ఆ కోవలోనివే. ఖాళీ సీసాలో మనిషి  పేరుతో సీతారామరాజు తనలోని భావాలకు ఆలోచనాత్మకంగా కవితామాలికలల్లారు. ఇక్కడ పూతపూసే కాలాన్ని చిదిమేసి, ప్రకృతితో సంభాషించడం ఎప్పుడో మానేసి, మానవీయ కోణాన్ని కరెన్సీగా మార్చేసి మరో దేశానికి అమ్ముడైపోయిన కార్పోరేట్‌ కొడుకు డాలర్ల డబ్బు మూటల్ని ఎగుమతి చేస్తూ పరాయి పంచను పెంచుకుంటూ పోతున్నాడని వేదన చెందారు. ఖండాంతరాలెళ్లినా చివరికి ఆకర్షణ నుండి జారిపోయి విరిగిన వాడి దేహం కలవాల్సింది ఈ మట్టిలోనేనని తెలిపారు. కవితలో చెప్పిన చివరి వాక్యాలు వేదనాగ్నిని రగిలిస్తాయి. కాల్చినా కమురు వాసన వేయని వాడి శరీరం నిండా/  కరెన్సీ కంపు కొడుతోంది/  వాడిని కాల్చకండి… పూడ్చండి అన్న ముగింపు గుర్తుండిపోతుంది.

కలువల కోనేరు లాంటి ఈ దేశంలో/  హంసలు కన్నీరు కారుస్తున్నాయ్‌ అని వేదన పడ్డారు. అదిమ కాలం నాటి కోతి నుండి రూపాంతరం చెంది శతాబ్దాల నుండి వంకరలు తిరిగిన మనిషేగా వాడు… అంతర్గతంగా జాగ్రుతమై వాడే మారుతాడులే.. మలచడానికి వడ్రంగి చేతిలో వాడు చెక్కముక్క కాదంటారు వాడు మనిషేగా మారుతాడులే  అన్న కవితలో ఈ కవి. తిరిగి చూడని మనిషి మట్టిని చీల్చే విత్తనాలను/   దోసిళ్లతో ధరణిపై చల్లి/  మహావృక్షాలను పూయిస్తాడు అని ఆత్మ విశ్వాసం ప్రకటించారు. జీవిత పార్శ్వాలను విభిన్న కోణాలలో చూసిన మనిషి గుండెల నిండా అంతులేని అగాధాలేనని చెప్పారు. తెల్ల కాగితంపై కలం నిర్మించిన కవిత్వ సుందర సౌధంలో అలవికాని ఆనందంతో నిద్రపోయే మనిషిని గుర్తు చేశారు.
జీవితాన్ని మట్టిపరం చేసి విత్తు నాటి కురవని మబ్బు కింద కూర్చుని కన్నీరు కార్చే  నాన్న చెమట నీటితో తడిసిన/  మట్టి కష్టం నన్ను మైమరింపిచేది అన్న నాన్న దుఃఖాన్ని చెప్పే  పంక్తులు అనుబంధాల గడపను తడుతాయి. తొలి వాన చినుకులా  చేతి వేళ్ళ మధ్య రేకలు రాలి విరిసిన నవ్వుల్లా మెరుస్తున్నాయంటూ వెలుగు పూలచెట్టు మీద నుండి రెక్కలతో  ఎగిరిన పిట్ట సాక్షిగా ఉగాదిని ఆప్యాయంగా ఆహ్వానించారు. తన నీడన సేదతీరే మనిషిపై  గ్రీష్మ ప్రకోపం ఇష్టం లేక కంటిలో మరిగిన వేడి నీటి చుక్కను నేలపై కురిసిన బూరుగుచెట్టు పరోపకాన్ని ప్రస్తుతించారు. చీకటి అల కవితలో నిన్న నీవు చేసిన గాయానికి/  రేపటి తరం రాయబోయే చరిత్రకు సజీవ సాక్ష్యమన్న వాక్యాలు మాటున మణిగిన చీకటి దౌష్ట్యాన్ని చిత్రించింది.

గొంతెండిన ఆకాశంలో విరిగిన వరివెన్ను/  ఎండిన మన్నుపై పడి మరణిస్తే/  మన గొంతులోకి  కాసింత బువ్వ దిగేదేలా అని చిటికెలేస్తే కురిసిన వర్షం పిలిచినా పలకరించడానికి కూడా రావడం లేదని ఖేద పడ్డారు. మృగాకలి మిగిల్చిన గుండెలోని దుఃఖాన్ని ఏ చేతి వేళ్లతో తుడుస్తారని ఘాటుగా ప్రశ్నించారు. ఏళ్ల నుండి కొనసాగుతున్న కుటిలత్వాలను పటాపంచలు చేసి ప్రశ్నించిన పచ్చని మొక్క దేశ ప్రగతిలో దూసుకుపోయేదే మేమంటున్న తెగువకు ఇంకనా  జమిలి సంకెళ్లు అన్న కవిత అద్దం పట్టింది. జ్ఞాపకాలకు కళ్ళుంటే చెదిరిన కలల మొక్కలకు మళ్ళీ చివుళ్ళు తొడుగుతాయన్నారు. మళ్ళీ వాడొకసారి నవ్వడానికి గుండెమంటను చల్లార్చడానికి నీ కన్నీటితో అభిషేకించి చూడమని చెప్పారు. మట్టి మొక్కల కల పండి నాన్న తనువు తనివితీరా మన్నును ముద్దాడిరడన్నారు. తనతో చెప్పకుండా వెళ్ళిన వేగిన పాశం మళ్ళీ రేపు పొద్దుపొడుపుపై వస్తుందన్న తల్లి తలపోతను హృదయదఘ్నంగా వివరించారు.

పురిటినొప్పులతో వెంటిలేటర్పై ఉన్న భూమాత ఆకుపచ్చ దేహానికి,  కన్నీటి చెమ్మలేని మట్టిరంగు పూలకు ప్రాణం పోస్తామన్న వాగ్దానం చేసి ఊపిరిపోయమని కవే రైతై కోరుకున్నారు. ఇంకా రక్తపు కుండలో రెప్పలు విప్పని కళ్లు/  నెత్తురులో మోకాళ్ళతో ముడుచుకున్న మరో జన్మ కాపుకు సిద్ధంగా ఉంది… మరణానికీ మరో  జన్మకీ మధ్య మృత్యువు నా శరీరంపై నీడలా కాచుకుని కూర్చుంది… కారుతున్న రక్తతుంపరల మధ్య జీవంతో జారిన ఓ మాంసపు ముద్ద కేరింత అన్న వాక్యాలు మాతృత్వపు మొలక కవితలోని వేదనాంతరంగాన్ని చెప్తాయి.  . మితిమీరిన ఆకలి, ఆశతో కూడిన ఆక్రమణ ప్రకృతి భాషను ఛిద్రం చేస్తున్న తీరును తెలిపారు. విత్తనం జల్లి మట్టి మొక్కలకు పురుడు పోసి పసిడి పంటను ప్రపంచానికి తోలే రైతైన నాన్ననే ఈ కవి మట్టిరంగు మనిషికి నిలువుటద్దం చేసి చూపారు. మంచు ముక్కల భ్రాంతిలో కాళ్ళు గడ్డకట్టుకుపోయిన ఊపిరి పిట్టయిన మనిషితో జీవన తంత్రుల్ని సవరించుకునే సంగీతం విన్న సంగతిని వెల్లడిరచారు. యుద్ధం పరాయి దేశంతో కాదని పక్కనే ఉంటూ కాంతి స్వప్నాలను కాల్చేసే రాక్షసత్వంతో అని నిశి పుష్పాలు కవితలో చెప్పారు. కవిత్వానికీ, మానవ జీవితానికీ మధ్య ఉన్న అమేయమైన, అవిభాజ్యమైన అనుబంధాలకు అచ్చమైన, వెచ్చనైన గుర్తులుగా  ఈ సంపుటిలోని  కవితలన్నీ కవితాలోకంలో ప్రకాశిస్తాయి.
 -డా.తిరునగరి శ్రీనివాస్‌
8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *