పిఓ రాహుల్‌కు గవర్నర్ అభినందనలు
ట్రైబల్ మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్
భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్ కు ఐటీడీఏ వద్ద గిరిజన సంప్రదాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ ట్రైబల్ మ్యూజియంను సందర్శించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ వస్తువులను చూసి గవర్నర్ ఐటీడీఏ పీవో రాహుల్ ని ప్రత్యేకంగా అభినందించారు. భావితరాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని గవర్నర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. గిరిజనులను ఇంకా అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ ఈ సందర్భంగా పిఓ కు తెలిపారు. ఇంకా ట్రైబల్ మ్యూజియంను ఆధునికరించాలని కోరారు.
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాఖండాలను తయారు చేస్తున్న గిరిజనులకు వాటిని సందర్శకులకు విక్రయించి ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా చొరవ చూపాలని ఆయన అధికారులకు సూచించారు. ట్రైబల్ మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల మట్టి ఇళ్ళు , ట్రెడిషనల్ హౌస్ లు వీక్షించి గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేసిన గిరిజన వంటకాలను చవిచూసి మరల భద్రాచలం వొచ్చినప్పుడు తప్పనిసరిగా గిరిజన వంటకాలను తనివి తీర భోజనం చేస్తానని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ఫోటో దిగి అక్కడున్న వారిని ఆనందింప చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఐటీడీఏ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.