- వారిని మభ్యపెటడుతున్న పార్టీ నేతలు
- పదిశాతం రిజర్వేషన్లపై హావి ఇవ్వండి
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సత్యవతి సూచన
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 30 : గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదే విషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉంటే రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నాయకుడుగా కిషన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుకుంటే కేంద్రం అడ్డుపడకుండా బాధ్యత తీసుకుంటానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్లను రాష్ట్ర పరిధిలో 10శాతం పెంచుకోవచ్చని కేంద్రం నుంచి అధికారికంగా సమాధానం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ బుధవారం సత్యవతి రాథోడ్‌ను మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. బంజారాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నూతన కమిటీకి సూచించారు. ఇన్ని రోజులు గిరిజనులను వోటు బ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్, బీజేపీలు మరోసారి గిరిజనులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
మంత్రిని కలిసిన వారిలో ఆలిండియా బంజారసేవా సంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు కిషన్ సింగ్ రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుపావత్ కిషన్ నాయక్, కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్రు నాయక్, అసోసియేట్ అధ్యక్షులు ఆర్. మోహన్ సింగ్, మహిళా అధ్యక్షురాలు సరోజా సింగ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గోపిచంద్ రాథోడ్, సభ్యులు రాంబాబు నాయక్, హరిసింగ్ జాదవ్ తదితరులున్నారు.