సిద్ధిపేట జిల్లా పర్యటనకు వొచ్చిన తమిలిసైకి ఊహించని ఘటన చోటుచేసుకుంది. బైరాన్ పల్లి పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న గవర్నర్ తమిళిసైని ఓ మహిళ నడిరోడ్డుమీద ఆపి తన ఇంటికి తీసుకెళ్లి సమస్యను వివరించింది. ఈ ఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసై తిరిగి చేర్యాల మీదుగా హైదరాబాద్ వెళ్తోంది. ఈ క్రమంలో చేర్యాల పట్టణంలోని ఎస్సీ కాలనీ మీదుగా గవర్నర్ కాన్వాయ్ వెళ్లడాన్ని గమనించిన చేర్యాల పట్టణానికి చెందిన మున్సిపల్ సఫాయి కార్మికురాలు మల్లిగారి సంధ్యరాణి చేతులు అడ్డుపెట్టి గవర్నర్ వాహనాన్ని అడ్డుకుంది.
ఆమెను గమనించిన తమిళిసై రోడ్డు పక్కన తమ వాహనాన్ని నిలిపి సదరు మహిళతో మాట్లాడారు. తమది పేద కుటుంబమని, మున్సిపల్ కార్యాలయంలో సఫాయి కార్మికురాలిగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, తమ ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని గవర్నర్ కు తన ఆర్థిక స్తోమత, బాధను ఏకరువు పెట్టుకుంది. ఉండటానికి కనీసం ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం వెంటనే కారు దిగిన గవర్నర్ ఇంటి లోపలికి వెళ్ళి పరిస్థితిని గమనించి, ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం సంధ్యారాణి వివరాలు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్లారు. ఈ విషయంపై స్పందించిన గవర్నర్కు సంధ్యారాణి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.