దేశ వ్యాప్తంగా 741.62 ఎల్‌ఎంటీ కొనుగోలు
మొదటి రెండు స్థానాల్లో పంజాబ్, చత్తీస్ ఘడ్ కేంద్రం ప్రకటన
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : 2021-22 ఖరీఫ్(వానాకాలం) సీజన్‌లో దేశ వ్యాప్తంగా 741.62 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పంజాబ్, చత్తీస్ ఘడ్, తెలంగాణ, ఏపి, గుజరాత్, మధ్య ప్రదేశ్ లతో సహా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందుకోసం 1,15,358 కోట్ల రూపాయలు మద్దతు ధరతో దేశ వ్యాప్తంగా 105.14 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్రం తెలిపింది.
ఈ మేరకు కేంద్ర ప్రజా పంపిణి మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం… ధాన్యం సేకరలో పంజాబ్ ఫస్ట్ ప్లేస్ ఉండగా, చత్తీస్ ఘడ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. పంజాబ్ నుంచి 1,87,28, 335 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, చత్తీస్ ఘడ్ నుంచి 92,01, 000 మెట్రిక్ టన్నుల సేకరించినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ నుంచి 70,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపింది. 13,763 కోట్ల రూపాయల ఎంఎస్పీతో రాష్ట్రంలో 10,62,428 మంది రైతులకు లబ్ది చేకూరినట్లు కేంద్రం తెలిపింది.