సప్తవర్ణాల నూతన సోయగాలతో
హరితకాంతులు వెదజల్లగా..
నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లు..
సేను సెలక..కొండాకోన బృందావనమై
వనమంత పులకింతమై
ఊగే లతల వయ్యారంలో..
సన్నజాజి కన్నెతీగలు పూలజల్లులు కురిపించగా..
మామిడితోరణాలతో ప్రతిగడప శోభించగా..
శిశిరానికి వీడ్కోలు పలుకుతూ..
నవ వసంతానికి స్వాగతమిడుతూ..
కాలమనే రథంపైఎక్కి ఉరకలేస్తూ వచ్చేస్తుంది ఉగాది.
చేదు జ్ఞాపకాలన్నింటిని ఎండిన ఆకుల్లా రాల్చి..
ఆకుపచ్చని చిగుళ్ళతో వసంతోత్సవాన్ని పూయించి..
వేప పువ్వుల పరిమళాల సువాసనలు వీయగా..
కోకిలమ్మ సరాగాలతో వసంతగీతం ఆలపించగా..
మయూరాల నాట్య విన్యాసాలతో..
పచ్చని మైదానంలో భ్రరమరములన్నీ..
రెక్కలు విప్పుకొని ఎగురుతుండగా..
రవికిరణాల వెలుగులను చల్లగా జల్లుతూ..
తెలుగింట నూతన సంవత్సరం వచ్చి ..
ఆశయాల ఉషోదయాలను తెచ్చి..
అందరి హృదయాలనందు ఆనందం వెల్లివిరియగా
నూతన సంవత్సరాది పండుగై..
కోటికాంతులు నింపగా వచ్చేస్తుంది ఉగాది.
అవనిపై అన్నపూర్ణమ్మ పసిడిసిరులు పండించగా..
హాలికుడి మోములో చిరునవ్వులు నింపగా…
ధాన్యపు రాసులకు..కాసుల వర్షం కురిపించగా..
సంపూర్ణ ఆయురారోగ్యాలను తీసుకువచ్చి..
మనుషుల మధ్యప్రేమానురాగాల పూలు పూయిస్తూ
రాగద్వేశాలను హరిస్తూ..శాంతి కపోతమై..
రంగులరెక్కలను విప్పుకొని..
విజయపుఢంకా మ్రోగిస్తూ..
క్రొత్త లక్ష్యాలను ఆహ్వానిస్తూ..
అందరికి శుభాన్ని చేకూర్చే..
నిత్యశోభితమైన శుభకృత్ ఉగాది వచ్చేస్తుంది.
– అశోక్ గోనె, 9441317361