సర్కార్ అసమర్థ పోకడపై
నిరుద్యోగ లోకం ధ్వజమెత్తి
కొలువుల కొట్లాటకు దిగింది
పేపర్ లీకులు స్కాములపై
ధిక్కార గళాన్ని వినిపిస్తూ
ఆందోళనల బాట పట్టింది
కుంభకోణాలకు తావిచ్చి
సన్నాయి నొక్కులు ఏలని
ప్రశ్నాస్త్రాన్ని ఎక్కుపెట్టింది
దీర్ఘ మౌనాన్ని బద్దలుగొట్టి
జంగ్ సైరను పూరించింది
ఎల్లనాటి నిరీక్షణ కాదని
కదంతొక్కి పదం పాడింది
న్యాయం సాధించే దాకా
ఆందోళన బాట వీడమని
బేషరతుగ భీష్మించుకుంది
ఆంక్షలు అణిచివేతలు
బలగాలు బందుకులకు
తలోగ్గమని నిలబడింది
నమ్మబలుకు ముచ్చట్లు
ఇంకానా ఇకపై చెల్లవని
తొడగొట్టి తెగేసి చెప్పింది
కుహనా కుయుక్తులు
ఇకమీద సాగనివ్వమని
తీవ్రంగా హెచ్చరించింది
ఓయి పాలకవర్యా
ఇకనైనా నిషా నిద్దుర వీడి
పేపర్ లీకు ముఠాను శిక్షించి
నియామకాలు చేపడితే సరి!
కాదని కాలయపనకు దిగితే
గడీలు కూలక తప్పదు సుమీ!!
– కోడిగూటి తిరుపతి, 9573929493