- జిల్లాలో మరో మూడు ఆలయాల్లోనూ వరుస చోరీలు
- రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు..దర్యాప్తు ముమ్మరం
జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రఖ్యాత కొండగట్టు ఆలయంలోనూ చోరీ జరగడం కలకలం రేపుతుంది. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. రాయపట్నం గ్రామాల్లోని రెండు ఆలయాలతో పాటు, జగిత్యాల రూరల్ మండలంలోని పలాస పౌలస్తీశ్వర ఆలయం, కొండగట్టు ఆలయాల్లో గురువారం రాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో గురువారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో సుమారు 12 రకాల వస్తువులు 37 కిలోల 700 గ్రాముల వెండి వస్తువులు దొంగతనం జరిగినట్లు ఆలయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
సమాచారం తెలుసుకున్న మల్యాల పోలీసులు ఆలయంలోకి వెళ్లి ఆలయాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఐటీకోర్, సాంకేతిక సిబ్బంది సహాయంతో నిందితుల ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆలయాల్లో జరిగిన చోరీలపై జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ఆలయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు భక్తుల ముసుగులో వొచ్చి ఆలయంలోకి చొరబడి దొంగతనాన్ని చేశారన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అందులో ఉన్న వ్యక్తుల సంఖ్యను ఆధారం చేసుకుని ముగ్గురు వ్యక్తులుగా ఉన్నట్లు భావిస్తున్నామని వెల్లడించారు. లభించిన ఆధారాల ప్రకారం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐల ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు.
ప్రధానంగా దొంగిలించిన వస్తువులలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండు వెండి షెటార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక గొడుగు, రామ రక్ష, రెండు షటారిలు, ఒక కిరీటం, స్వామి వారి కవచం, స్వామివారి ప్రధానాలయంలో గోడలకు అమర్చిన వెండి తాపడాలు, మకర తోరణంను తొలగించి దొంగిలించారన్నారు. ఇప్పటివరకు ఉన్న ఆధారాల ఆధారంగా కొండగట్టు గుట్టల్లో వెండి తాపడానికి సంబంధించిన బీడింగ్ లభ్యమవడంతో పాటు మకర తోరణానికి అమర్చే ప్లైవుడ్ ప్రేమ్ లభించిందని వివరించారు. సంతలోని లొద్ది సవి•పంలో మంకీ క్యాప్ లభ్యమైనట్లు సమాచారం ఉందన్నారు. వీటి ఆధారంగా విచారణ చేపట్టామని అన్నారు.