Take a fresh look at your lifestyle.

కవితను ఈడి విచారణతో దిల్లీలో హైటెన్షన్‌

న్యూ దిల్లీ, మార్చి 11 : దిల్లీలో హైటెన్షన్‌ ‌నెలకొంది. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోనే తిష్టవేశారు. ఒకవేళ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ ‌చేస్తే ఆందోళనలు చేసే అవకాశం ఉందని వచ్చిన సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు సీఎం కేసీఆర్‌ ‌నివాసం వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుంపులు గుంపులుగా పబ్లిక్‌ ఉం‌టే చర్యలు తీసుకుంటామని వార్నింగ్స్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలెవరూ ఈడీ ఆఫీస్‌ ‌పరిసరాల్లో ఉండొద్దని.. అక్కడ 144 సెక్షన్‌ అమల్లో ఉందని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ముందస్తు చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితను విచారించనున్న నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌ ‌వైపునకు ఎవరూ రావొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మైకుల్లోనూ పోలీసులు అనౌన్స్ ‌మెంట్‌ ‌చేశారు.

Leave a Reply