- కాంగ్రెస్, బిజెపిలకు దూరంగా పోరు
- తదుపరి అధికారం తమదే అన్న జేడీఎస్ అధినేత కుమారస్వామి
బెంగళూరు, మార్చి 28 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాకట ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమను సంప్రదించాయని కుమారస్వామి అన్నారు. అయితే ఆ రెండు పార్టీలను తాము దూరం పెట్టినట్లుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. గతంలో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని విసిగిపోయామని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో స్వంతంగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాము 140 స్థానాల్లో గెలుస్తామని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టిన తమ పార్టీకి 80 సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని చెప్పారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదన్నారు. గతంలో తమ పార్టీకి 15 సీట్లు కూడా రావన్న బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు 40 నుంచి 50 సీట్లు వస్తాయని చెబుతున్నాయని అన్నారు. దీనికి కారణం ఎంటని ప్రశ్నించారు. తమ పార్టీ సామన్యులకు చేరువయిందని తెలిపారు. ఇక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్లదాడి విషయంపై కుమారస్వామి మాట్లాడుతూ దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో తెల్చలన్నారు. రాళ్లు రువ్విన వారికి తనకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వాతావరణాన్ని బీజేపీనే సృష్టించిందని, కాబట్టి బీజేపీనే పరిష్కరించాలని అన్నారు.