Take a fresh look at your lifestyle.

ఏపిలో బిఆర్‌సీ ఎంట్రీతో మారనున్న సమీకరణలు

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఎం‌ట్రీతో అక్కడి రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది . నిన్నటి వరకు ఏపీలో  ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్న అభిప్రాయముంది. ఇక్కడ అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్‌, ‌తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. వాటికి తోడుగా పవన్‌ ‌కళ్యాణ్‌ ‌నేతృత్వంలోని జనసేన పార్టీ ఈసారి ఆ రెండు పార్టీల గెలుపు ఓటముల నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నదన్న వాదనకూడా ఉంది. ఇప్పుడు కొత్తగా బిఆర్‌ఎస్‌పార్టీ ఎంట్రీ కావడంతో ఏపీ రాజకీయల్లో విచిత్రపరిణామాలు ఏర్పడబోతున్నాయి. తాజాగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని సోమవారం ఏపీకి చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయానికి పెద్ద ర్యాలీగా వొచ్చి  ఆ పార్టీ తీర్థం తీసుకోవడంతో ఆంధ్రలో ఆ పార్టీకి ఆదరణ లభిస్తుందన్నది తేలిపోయింది. కాకపోతే అక్కడ వైఎస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం పార్టీల మధ్య నిత్యం జరుగుతున్న రాజకీయ లొల్లి  మధ్య బిఆర్‌ఎస్‌ ఏ ‌మేరకు నిలదొక్కుకోగలదన్నది ముందు ముందు తేలాల్సిన అంశం.

అయినప్పటికీ బిఆర్‌ఎస్‌ ‌రంగ ప్రవేశంవల్ల ఏ రాజకీయ పార్టీ ఇక్కడ లాభపడుతుంది, దేనికి నష్టం వాటిల్లుతుందన్న విషయం ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పును కోరుకుంటున్నట్లు చెబుతున్నా,  బిఆర్‌ఎస్‌ ‌పుట్టిందే బిజెపికి వ్యతిరేకంగా అన్నది తెలియందికాదు. అలాంటప్పుడు బిజెపిని వ్యతిరేకించడంలో బిఆర్‌ఎస్‌తో కలిసిరావడానికి ఏపీలో  ఏపార్టీ ముందుకొస్తుందన్నదికూడా ఇక్కడ ప్రధానాంశంగా ఉంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని పొందాలని వైసిపితోపాటు టిడిపి, జనసేన పార్టీలు ఇప్పటినుండే తీవ్ర కసరత్తు  చేస్తున్నాయి. రాష్ట్రం విడిపోయేవరకు అధికారంలో ఉన్న  కాంగ్రెస్‌ ‌పార్టీకి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఆదరణ  లేకుండా పోయింది. కేంద్రంలో బిజెపిని ఢీ కొనాలన్న లక్ష్యంగా దూసుకుపోతున్న ఈ పార్టీ, రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు  రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా, చివరిలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటుందా అన్నది ఇప్పుడప్పుడే తేలే అంశంకాదు. అలాంటి పరిస్థితిలో ముందుగా చెప్పుకున్నట్లు మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఏర్పడనుంది.

ఈ పార్టీల తీరును కూడా ఒకసారి తరిచి చూస్తే, మూడు పార్టీలుకూడా కేంద్రంలోని బిజెపికి అనుకూలంగా వ్యవహరి స్తున్నవే. టిడిపి మొదట్లో అనుకూలంగానే వ్యవహరించి, ఆ తర్వాత కొంత దూరాన్ని పాటించి ఇప్పుడు తటస్థవైఖరిని అవలంభిస్తున్నది. కేంద్ర సహకారం ఉంటే వైఎస్‌ఆర్‌సిపిని సులభంగా ఓడించవచ్చన్న ఆలోచనను బహిర్ఘతం చేయకుండా జనసేనపార్టీతో నెట్టుకురావాలన్నది టిడిపి ఆలోచనగా ఉందన్నది రాజక•యాల విశ్లేషకులు చెబుతున్న మాట. పొత్తులపై స్పస్టమైన ప్రకటనలేవీ చేయకపోయినా జనసేనాని మాత్రం బిజెపి కనుసన్నల్లోనే రాజకీయం చేస్తున్నట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. పైగా జనసేన, టిడిపి ఒకటేనని వైఎస్‌ఆర్‌సిపి చాలా కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలియందికాదు. ఈ రెండు పార్టీలు కూడా అధికారపార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవే. ఇదిలాఉంటే వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ ‌పార్టీ కి  మొదటినుండి  కేంద్రంతో సన్నిహిత సంబంధాలున్నాయి.. అందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి మీద ఉన్న కేసుల విషయమైతేనేమీ, విభజన హామీలను నెరవేర్చుకునే విషయంలో నైతేనేమీ , కేంద్రంలోని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరాన్ని పూర్తిచేసుకోవాల్సిన అవసరం, రాజధానుల సమస్య తదితర అనేక విషయాలు ముడివడి ఉండడంతో వైఎస్‌ఆర్‌సిపి బిజెపిని తోసి రాజనలేకపోతున్నది. అలాంటప్పుడు  బిజెపి పాత్ర ఏమిటన్నదే ప్రధాన ప్రశ్న.

తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో  కాషాయ జండా ఎగురవేయాలని బిజెపి దృఢసంకల్పంతో ఉంది. తెలంగాణ తర్వాతే ఏపీ గురించి ఆలోచించాలన్నది బిజెపి భావనగా కనిపిస్తున్నది. ఇదిలాఉంటే  ఈసారి తెలంగాణలో పోటీ చేస్తానని చెబుతున్న జనసేన అధినేతకు తోడు టిడిపికూడా తాజాగా ఇక్కడ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీకి ప్రస్తుతం నాయకులు కరువైనా  క్యాడర్‌ ఉం‌ది. ఇక్కడ స్వయంగా అధికారంలోకి రాకపోయినా తన బలం బిజెకి ఉపయోగపడితే, ఏపీలో బిజెపి సహకారాన్ని పొందవచ్చన్న దూరాలోచన టిడిపి అధినేత చంద్రబాబుకు లేకపోలేదు.  చంద్రబాబు ఈ ఆలోచనను గ్రహించే కెసిఆర్‌ ఏపీలో బిఆర్‌ఎస్‌కు ఎంట్రీ ఇచ్చాడన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. బిఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ను నియమించారు. ఆయన ఏపీలోని బలమైన కాపు సామాజికవర్గ నేత. జగన్‌కు వ్యతిరేకంగా కాపు సామాజికవర్గమంతా పవన్‌కళ్యాణ్‌ ‌లేదా చంద్రబాబు వైపున ఉంటారన్నది ఒక ఆలోచన.  బిఆర్‌ఎస్‌ ఎం‌ట్రీతో ఆ వోట్లు  చీలితే జగన్‌ ‌లాభపడే అవకాశంలేకపోలేదు. దీంతో తెలంగాణలో పోటీ విషయంపై చంద్రబాబును కెసిఆర్‌ ఆలోచనలో పడేసినట్లు అవుతుంది. అలాగే వైఎస్‌ ‌షర్మిలను కట్టడి చేయలేకపోతున్న జగన్‌కు పరోక్షంగా కెసిఆర్‌ ‌చెక్‌పెట్టినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద బిఆర్‌ఎస్‌ ఎం‌ట్రీ అటు ఏపీతోపాటు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమార్పుకు కారణం కాబోతున్నది.

Leave a Reply