ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ మూడు విధానాలను సూచించింది. రెండు డిగ్రీలను ప్రత్యక్ష తరగతులకు హాజరై పూర్తి చేయడం ఇందులో మొదటిది. ఈ సందర్భంలో తరగతులు ఒకే సమయంలో ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. ఇక, ప్రత్యక్ష తరగుతుల ద్వారా ఒక డిగ్రీ, ఆన్‌లైన్ లేదా దూరవిద్య ద్వారా మరో డిగ్రీ పూర్తి చేయడం రెండో విధానం. రెండు డిగ్రీలను ఆన్‌లైన్ లేదా దూరవిద్య ద్వారా పూర్తి చేయడం మూడో విధానం.
విద్యార్థులలో జ్ఞాన తృష్ణ, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత వంటి బహుళ నైపుణ్యాలు పొందేందుకు నూతన జాతీయ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకు రావడం జరిగింది.దీనిలో భాగంగానే యూజీసీ విద్యార్థి బహుళ నైపుణ్యాల ప్రాతిపదికగా ఉన్నత విద్యలో ఒక విద్యార్ధి ఏకకాలంలో 2 డిగ్రీలు చదివేందుకు అవకాశం కల్పిస్తూ ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది .ఇంత వరకూ ఓ విద్యార్థి ఒకే సారి రెండు డిగ్రీ(ఫుల్‌టైమ్)లు చేసేందుకు యూజీసీ అనుమతించలేదు.కేవలం డిగ్రీకి అనుబంధంగా ఏదైనా డిప్లొమో లేదా షార్ట్‌టర్మ్ కోర్సులు చేసేందుకే మాత్రమే. అవకాశముండేది.కానీ ఇప్పుడు యూజీసీ కల్పించిన సరికొత్త ప్రతిపాదన ప్రకారం. ఓ విద్యార్థి తన ఆసక్తికి అనుగుణంగా ఒకేసారి రెండు వేర్వేరు డిగ్రీలు లేదా రెండు పీజీలు లేదా రెండు డిప్లొమో కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ మూడు విధానాలను సూచించింది. రెండు డిగ్రీలను ప్రత్యక్ష తరగతులకు హాజరై పూర్తి చేయడం ఇందులో మొదటిది. ఈ సందర్భంలో తరగతులు ఒకే సమయంలో ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. ఇక, ప్రత్యక్ష తరగుతుల ద్వారా ఒక డిగ్రీ, ఆన్‌లైన్ లేదా దూరవిద్య ద్వారా మరో డిగ్రీ పూర్తి చేయడం రెండో విధానం.
రెండు డిగ్రీలను ఆన్‌లైన్ లేదా దూరవిద్య ద్వారా పూర్తి చేయడం మూడో విధానం.అయితే ఏక కాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యూజీసీ ముందుకు వచ్చాయి అయితే అప్పటి ఈ ప్రతిపాదనను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్ చాన్స్‌లర్ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది.రెగ్యులర్ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి, అదే సమయంలో ఓపెన్ లేదా డిస్టెన్స్ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. రెగ్యులర్ మోడ్‌లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి పాలనా పరంగా వీలుకాదని ఆ ప్రతిపాదనను ఆనాడు తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం మారుతున్న ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, పెరుగుతున్న పోటీతత్వంతో విద్యార్థులు వాటిని ఎదుర్కొనాలంటే మరింత పరిజ్ఞానం అవసరమని భావించిన యూజీసీ నేడు ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం కల్పించింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థి రెండు డిగ్రీలు ఏక కాలంలో చదవొచ్చు.ఆయితే ప్రస్తుతానికి మాత్రం నాన్ టెక్నికల్ కోర్సులకే ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.
ఈ నూతన ప్రతిపాదనలో మరొక కొత్త విషయం ఏమిటంటే సైన్సు డిగ్రీ చేస్తూనే, కామర్స్, సోషల్ సైన్స్ లాంటివి చదవచ్చు. కామర్స్ డిగ్రీ చేస్తూనే, సైన్స్ చదవచ్చు. ఇది విభిన్న శాఖల మధ్య జ్ఞానపంపిణీకీ, అర్థవంతమైన సంభాషణలకూ ఉపయుక్తం అవుతుందని యూజీసీ ఆలోచన.అటు విద్యావిషయకంగానూ, ఇటు విద్యకు సంబంధంలేని ఇతర రంగాల్లోనూ విద్యార్థుల సమగ్ర పురోగతిని ప్రోత్సహించేందుకు ఈ ప్రతిపాదన ఎంతగానో సహకరిస్తుంది అని యూజీసీ ఆలోచన. దీనివల్ల సైన్స్, సోషల్ సైన్స్, ఆర్టస్, హ్యుమానిటీస్, వివిధ భాషలతో పాటు ప్రొఫెషనల్, టెక్నికల్, ఒకేషనల్ – ఇలా ఏ అంశమైనా తీసుకొని చదివే వీలు విద్యార్థికి కలుగుతుంది. దీనిని సరైన రీతిలో ఆచరణలో పెడితే, విద్యార్థుల్లో విశాల దృక్పథానికీ, ఆలోచనా పరిధి పెరగడానికీ ఈ ఉదార విద్య దీర్ఘకాలంలో ప్రయోజనకరం అవుతుందని ఉన్నత విద్య విషయంలో భారతీయ విద్యార్థులకు దక్కిన ఈ అవకాశం ప్రపంచంలో వేరే దేశంలో ఎక్కడా లేదని విద్యావేత్తలు భావిస్తున్నారు..
అయితే ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కూడా మొదలయ్యాయి. . యూజీసీ ప్రకారం ఏక కాలంలో రెండు డిగ్రీల నిర్ణయం అనేది విద్య నాణ్యతపై ప్రతికూల ప్రభావం కూడా చూపే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్ధాయిలో ఒక డిగ్రీ పూర్తి చేయాలి అంటే సరిపడిన సమయం అవసరం.దానిపై పూర్తి గా దృష్టి పెట్టాలి అంటే సమయం తో పాటు ఏకాగ్రత ఉండాలి.ఒకే విద్యా సంవత్సరంలో భిన్న సబ్జెక్టు లపై దృష్టి పెట్టడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే ఇంటర్ తరువాత సబ్జెక్టు వారీగా ప్రాధాన్యతలు ఇచ్చే కోర్సులు ప్రవేశ పెట్టారు.మనకు ఆసక్తి ఉన్న కోర్సు పై దృష్టి పెట్టి డిగ్రీ అభ్యసిస్తే దానిపై ప్రత్యేక పట్టు లభిస్తుంది. ప్రస్తుతం డిగ్రీ స్ధాయి కళాశాలల్లో ఫిజికల్ క్లాసులకు దాదాపు 40 శాతం మంది హాజరు కావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.అంటే ఒక డిగ్రీ కి సంబంధించి నిర్ణీత సమయాన్ని కూడా దృష్టి పెట్టలేని వాళ్ళు అనేకులు మన ముందు కనిపిస్తున్నారు. రెగ్యులర్ క్లాసులు విషయం లో తరచూ గైర్ హాజరు అయితే మరుసటి టాపిక్ విషయంలో అవగాహన సాధ్యం కాదు.అందునా సైన్స్ కోర్సుల విషయంలో అయితే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది..
అయితే ప్రస్తుత విద్యా విధానంలో చాలా మంది విద్యార్థులు కేవలం పరీక్షలు సమయంలో గైడ్ లు వంటి మెటీరియల్ తో ప్రిపేర్ అయి మమ అనిపించేస్తున్నారు.అంటే వీరి లక్ష్యం ఏదో విధంగా చేతికి డిగ్రీ సర్టిఫికెట్ వస్తే చాలు.పరీక్షలు సమయానికి ఎదో ముక్కున పట్టుకుని క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నిస్తారు.సర్టిఫికెట్ వస్తే చాలు నైపుణ్యాలు అవసరం లేదని వీరి అభిప్రాయం.వాస్తవంగా డిగ్రీ అభ్యసనంపై దృష్టి పెట్టి చదివితే ఈ నిర్ణీత సమయం చాలదు.అటువంటిది ఈ సమయంలోనే రెండు డిగ్రీలు చేయండి అవకాశం కల్పిస్తాం అనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసం అంటూ విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
అభ్యసనం అంటే తక్కువ సమయంలో ఎక్కువ డిగ్రీలు సంపాదించడం కాదు.అభ్యసనం అంటే సామర్ధ్యాలను మెరుగు పర్చుకోవడం అది కేవలం ఫిజికల్ క్లాసులలో అధ్యాపకులు చెప్పే పాఠాలపై దృష్టి నిలప గలిగినపుడే సరైన అభ్యసనం అవుతుంది.అటువంటి అభ్యసనమే విద్యార్థుల లో నైపుణ్యాలను సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.ఇటువంటి సామర్ధ్యాలు నైపుణ్యాలు దూర విద్యలో కానీ ఆన్లైన్ విద్యలో సాధ్య పడదు అనే చెప్పవచ్చు.ఏక కాలంలో ఒకే విద్యార్ధి రెండు భిన్న డిగ్రీలను విభిన్న సబ్జెక్టులను చదవడం అనేది చెప్పినంత సులభం మాత్రం కాదు.ఒక విద్యార్థి ఏక కాలంలో ఫిజికల్ గా ఎకనామిక్స్.. ఫిజిక్స్ లలో డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడని అనుకుందాం.ఈ నిర్ణీత కాల వ్యవధిలో సమీపంలో గల ఫిజికల్ గా రెండు క్లాసులకు హాజరు కావడానికి వీలు పడుతుందా.ఉదయం ఒక చోట మధ్యాహ్నం ఒక చోట హాజరు అయ్యే అవకాశం కలుగుతుందా.
ఈ రెండు కళాశాలల సమయం అనుకూలంగా ఉంటుందా. ఒక వేళ అనుకూలించినా వేరే కళాశాలకు చేరుకోవడానికి చేసే ప్రయాణంలో సమయం గడిచిపోతుంది.ఈ అసౌకర్యం వలన విద్యార్థి కి అధ్యయనంపై ఆసక్తి తగ్గి పోయే ప్రమాదం ఉంది .ఫలితంగా రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది.అంటే ఇక్కడ దేనిపైనా పూర్తిగా దృష్టి పెట్టలేక విద్యార్థి సంఘర్షణకు గురి కాక తప్పదు కదా..ఒక డిగ్రీ పరీక్షలు సమయంలోనే రెండవ డిగ్రీ పరీక్షలు ఉంటే అప్పుడు ఏం చేస్తారు. ఈ కోర్సుల విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు టైం టేబుల్ నిర్దారించడం సులభం కాదు.ఒక దానికొకటి అనేక అవాంతరాలు ఏర్పడతాయి.ఒక వేళ ఒకటి ఫిజికల్ క్లాస్ ఇంకొకటి దూర విద్య ఎంపిక చేసుకున్నాడు అనుకుందాం. అప్పుడు దూర విద్య తరగతులు నిర్వహించే సమయంలో రెగ్యులర్ క్లాసులకు సెలవు పెట్టాలి అయితే ఆ సమయంలో విద్యార్థి కొన్ని పాఠాలు కోల్పోవాలి.ఇలా కాకుండా ఒక దూర విద్య మరొకటి ఆన్లైన్ విద్య అనుకుందాం లేదా రెండూ కూడా ఆన్లైన్ విద్యనే అనుకుందాం ఈ తరహా విద్య విధానం కేవలం డిగ్రీ సంపాదించకోవడానికి వీలు పడుతుంది తప్ప నైపుణ్యాలుసంపాదించుకోవడానికి ఎంత వరకూ వీలుపడుతుంది అని సందేహాస్పదమే.ఎందుకంటే దూర విద్య కానీ ఆన్లైన్ విద్య లో కానీ డిగ్రీ అభ్యసిస్తూనే వేరే వృత్తిలో ఎక్కువ మంది నిమగ్నమై ఉంటారు.
ఈ స్ధితిలో ఒక డిగ్రీపైనే దృష్టి పెట్టలేని వాళ్ళు రెండు డిగ్రీలు అభ్యసించడం ఆచరణ సాధ్యం అవుతుందా? ఒక వేళ పేద విద్యార్థులు ఏక సమయంలో రెండు డిగ్రీలు పూర్తి చేయడానికి ముందుకు వస్తే వారికి రెండు కోర్సులకు అవసరమైన ఉపకార వేతనాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందా అనేది ప్రశ్నార్ధకం? ఏది ఏమైనా డ్యూయల్ డిగ్రీ విధానం రెండు సర్టిఫికెట్లు ఇస్తుంది కానీ విద్యార్దుల్లో నైపుణ్యాలను పూర్తి స్ధాయిలో అందిస్తుందని చెప్పలేము.ఎందుకంటే ఇది రెండు సబ్జెక్టులకు సంబందించి పరిజ్ఞానం ఇస్తుంది తప్ప లోతుగా అధ్యయనం చేసే అవకాశం మాత్రం ఉండదనే చెప్పవచ్చు ను.ఫలితంగా డిగ్రీ పట్టాలు లభిస్తాయి తప్ప వాటిపై పరిపూర్ణ పరిజ్ఞానం మాత్రం దక్కకపోవచ్చు.ఈ కారణం చేతనే మన సాంప్రదాయ విద్యా విధానంలో స్పెషలైజేషన్ డిగ్రీ విధానం కొనసాగిస్తూ ఉన్నాం.ఈ తరహా సంప్రదాయంకు భిన్నంగా డ్యూయల్ డిగ్రీ అనే ప్రయోగాన్ని ప్రవేశ పెట్టడం దాని ప్రభావం అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.. రెండు డిగ్రీల ప్రతిపాదన విషయమై యూజీసీ విద్యార్థులను ‘సూపర్ మ్యాన్’గా లేదా 24 గంటలు చదువుకునే వ్యక్తిగా ఊహిస్తోంది తప్ప క్షేత్ర స్ధాయిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోనికి తీసుకోలేదని చెప్పాలి.
అసలే ఒత్తిడితో కూడిన చదువులతో సతమతమవుతున్న విద్యార్థులకు ఇది మరింత ఒత్తిడి కలిగించవచ్చు. దీనివలన చదువుల నాణ్యత ఈ ఒకటికి రెండు డిగ్రీల ప్రతిపాదనతో మరింత క్షీణించవచ్చు ఈ విధానం రెండు సబ్జెక్టులకు సంబంధించిన నాలెడ్జ్‌ను ఇస్తుందే గానీ, లోతుగా అధ్యయనం చేసే వెసులుబాటు ఉండదు. ఫలితంగా సర్టిఫికేట్ చేతిలో ఉన్న పూర్తి పరిజ్ఞానం కొరవడుతుంది.ఆయితే దీనిని సమర్ధించే వాళ్ళు లేకపోలేదు.దాని ప్రకారం ఒక విద్యార్ధికి నిర్ణీత కాల వ్యవధిలో వివిధ సబ్జెక్టులను అభ్యసించడం వల్ల కోర్సులను ముగించేనాటికి పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుకుంటాడు.ఇది కెరీర్‌లోనూ ఉపయోగపడుతుంది. మరిన్ని ఉపాధి అవకాశాలకు తలుపు తెరుస్తుందని మరి కొందరు విద్యావేత్తలు సమర్దిస్తున్నారు.ఉదాహరణకు ఈ విధానంలో బీటెక్ డిగ్రీని చదివే విద్యార్ధి ఎంబీఏ కూడా మరో డిగ్రీని చదవొచ్చు. ఇలా చేయడం వలన ఉద్యోగ సముపార్జనలో ఒకే డిగ్రీ చదివిన విద్యార్ధికంటే రెండు డిగ్రీలు చదివిన విద్యార్ధి ముందంజలో ఉంటాడని వీరి వాదన.అంతే కాదు నేటి పోటీ ప్రపంచంలో విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా పోటీలో నిలబడగలిగేలా తయారవ్వాలి. అటువంటి మల్టీ టాస్కులు చేయగలిగిన భిన్న ప్రతిభావంతుల కోసమే నేడు యాజమాన్యాలు కూడా అన్వేషిస్తున్నాయి.
అందువల్ల ఉన్నత విద్యావిధానంతో ఏక డిగ్రీని మాత్రమే సముపార్జించాలనే సంప్రదాయాన్ని పక్కన పెట్టి డ్యూయల్ డిగ్రీ విధానాన్ని ఆహ్వానించక తప్పదు అనే చర్చ జరుగుతూ ఉంది. ఆర్కిటెక్చర్ చదివే విద్యార్ధి బిల్డింగ్‌ల డిజైన్ గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు.. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి కూడా అవగాహన కలిగి ఉండటానికి ఎకనామిక్స్ కూడా తెలుసుకోవాలి. ఒకే స్పెషలైజేషన్లో డిగ్రీ చేసే విద్యార్ధికి ఇది సాధ్యం కాదు. ఈ అవకాశం డ్యూయల్ డిగ్రీ కల్పిస్తుందని డ్యూయల్ డిగ్రీని సమర్ధించే వాళ్ళు చెబుతున్నారు.వీరి ప్రకారం ఈ ప్రతిపాదన అమలులోకి తీసుకురావాలి అంటే కొత్త రెండు డిగ్రీల తగ్గట్టు కోర్సులు తయారు చేయాలి. మారిపోతున్న ఈ తరగతి గది స్వరూప స్వభావాలకు అనుగుణంగా ఆచార్యులకు బోధనలో యూజీసీ శిక్షణనివ్వాలి.ఇవన్నీ పట్టించుకోకుండా ఇదే మూసలో వెళితే మాత్రం ఈ నూతన విద్యావిధాన ప్రయోగం నిష్ఫలమయ్యే ప్రమాదం లేకపోలేదు.
రుద్రరాజు శ్రీనివాసరాజు..
9441239578.
లెక్చరర్..ఐ.పోలవరం..