న్యూ దిల్లీ, మే 12(ఆర్‌ఎన్‌ఎ) : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసి) ఐపిఒ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీమ్ కోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీమ్ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపిఒ అంశాలపై మధ్యంతర ఉపశమనం కలిగించలేమని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి.ఎస్.నరసింహాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
తాము ఎటువంటి మధ్యంతర ఉపశమనాన్ని మంజూరు చేయడానికి మొగ్గు చూపడం లేదని తెలిపింది. ఈ పిటిషన్‌లపై ఎనిమిది రోజులలో తమ స్పందనను తెలియజేయాల్సిందిగా ఎల్‌ఐసిని, కేంద్రాన్ని ఆదేశించింది. ఆర్థిక చట్టం, 2021ని మనీ బిల్లుగా ఆమోదించే అంశంపై రాజ్యాంగ ధర్మాసనానికి సూచించిన పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లను జత చేసింది.