- త్వరలోనే వర్గల్‌లో మెగా రైస్ మిల్లులు ఏర్పాటు
- త్వరలోనే కొడకండ్ల నుంచి గూడ్స్ రైలు
- గజ్వేల్ నుంచి తిరుపతి, చెన్నైకు రైలు
- సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట, ఏప్రిల్ 13 (ప్రజాతంత్ర బ్యూరో): ఎలాంటి కోతలు లేకుండా రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం సాయంత్రం సిద్ధిపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హన్మంతరావుతో కలసి మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఆర్డీవోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఈ యాసంగిలో జిల్లాలో 2 లక్షల 62 వేల 277 ఎకరాల్లో వరి సాగు చేశారనీ, వచ్చే ధాన్యాన్ని . ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని జిల్లా అధికార యంత్రాంగంకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఎలాంటి కోతలు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలనీ, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. త్వరలోనే జిల్లాలోని వర్గల్‌లో మెగా రైస్ మిల్లులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వానాకాలం జూలై నుంచి జిల్లాలో 25 వేల ఎకరాలలో ఆయిల్‌ఫామ్ సాగు చేపట్టడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.
వెయ్యి ఎకరాల్లో పట్టు పరిశ్రమ చేపట్టాలని, అలాగే పత్తి పంటకు మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా వానాకాలం సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఈ యాసంగి వరి దిగుబడి వివరాలు క్షుణ్ణంగా జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వానాకాలం 25 శాతం వెద సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కొడకండ్ల నుంచి గూడ్స్ రైలు, గజ్వేల్ నుంచి తిరుపతి, చైన్నైకు ప్రయాణికుల రైలు ప్రారంభం కానున్నదని మంత్రి హరీష్‌రావు తెలిపారు.