ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్‌ఎస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలోని ముఖ్యనేతలు పలువురు కాంగ్రెస్‌కు క్యూ కడుతుండటంతో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. బిఆర్‌ఎస్‌లో కీలక నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి,  ఆయన భార్య వికారాబాద్‌ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి తాజాగా కాంగ్రెస్‌ తీర్థం తీసుకోవడం ఒక విధంగా బిఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ .. విచిత్రమేమంటే 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మహేందర్‌రెడ్డి ప్రాధాన్యతను గుర్తించి బిఆర్‌ఎస్‌ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ  పదవినిచ్చి, మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే అప్పటికే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తుండడంతో ఆయన మంత్రి పదవిలో కేవలం నాలుగంటే నాలుగు నెలలు మాత్రమే కొనసాగారు. అదికూడా ఆయనను అనునయించే క్రమంలోనే ఆయనకా పదవిని నాటి ప్రభుత్వం కట్టబెట్టింది. మరో ఆశ్చర్యకర విషమేమంటే ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్‌పి చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువ కప్పుకోవడం. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకులను బిఆర్‌ఎస్‌ కోల్పోయినట్లయింది. ఈ చేరికలు అంతటితోనే ఆగిపోలేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ మున్సిపాలిటీ మొదటి మేయర్‌గా కొనసాగిన బొంతు రామ్మెహన్‌ కూడా పార్టీ మార్చేశాడు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆయన పదవీకాలంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యత నిచ్చినా, గత ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే  టికట్‌ ఇవ్వలేదని అలిగిన విషయం తెలిసిందే. ఆయన తనతోపాటు తన భార్య చర్లపల్లి కార్పోరేటర్‌ (బిఆర్‌ఎస్‌) శ్రీదేవిని కూడా కాంగ్రెస్‌లోకి తీసుకెళ్ళారు. ఇదే క్రమంలో జిహెఎచ్‌ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్‌  మోతె శ్రీలత, రంగారెడ్డి జడ్‌పి చైర్‌ పర్సన్‌్‌ అనితారెడ్డి, నిజామాబాద్‌ జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ రజితా యాదవ్‌ అదే బాట పట్టారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు నేత వెంకటేశ్‌, సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి లాంటి ప్రముఖులు కూడా కాంగ్రెస్‌ ఆకర్ష్‌ పథకంలో చేరిపోయారు. కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డి చెప్పినట్లు ఇంకా చాలా మంది కాంగ్రెస్‌ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది.  సిఎం రేవంత్‌రెడ్డిని కలిసి, పుష్పగుచ్చాలిచ్చిన పలువురు  బిఆర్‌ఎస్‌ నేతలు, కేవలం తమ ప్రాంత నిధులకోసమే సిఎంను  కలిసినట్లు  చెబుతున్నప్పటికీ మతలబువేరేగా లేకపోలేదన్న వాదన వినవస్తున్నది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత స్థానిక సంస్థలకు చెందిన పలువురు ఆ పార్టీలోకి వెళ్ళేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పంచాయితీలు, మున్సిపాలిటీలు, జడ్‌పీల్లో ఒకదాని వెంట ఒకటిగా అధికారంలోఉన్న బిఆర్‌ఎస్‌ నాయకత్వంపైన అవిశ్వాసాలు పెడుతున్నారు. తాజాగా మంథిని జడ్పీని బిఆర్‌ఎస్‌ కోల్పోయింది. అంతకు ముందు నందికొండ (నాగార్జునసాగర్‌) మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్‌ చైర్‌ పర్సన్‌్‌, వైస్‌ చైర్మన్‌్‌లపైన పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అయితే అక్కడ చైర్మన్‌  పదవిని కాంగ్రెస్‌కు, వైస్‌ చైర్మన్‌    పదవిని బిఆర్‌ఎస్‌కు ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది. గద్వాల చైర్‌ పర్సన్‌ సరిత తనతోపాటు దాదాపు 40 మందికి పైగా సర్పంచులను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్ళడమన్నది బిఆర్‌ఎస్‌కు పెద్ద అఘాతాన్ని సృష్టించిందనే చెప్పాలె.

వాస్తవంగా కాంగ్రెస్‌లో చేరికలన్నది ఎన్నికలకు ముందునుండే కొనసాగుతున్నాయి. పార్టీలో అత్యంత ముఖ్యనేతలు, సీనియర్‌ నాయకులైన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు లాంటి నాయకులను బిఆర్‌ఎస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండీ రెండు సార్లు బిఆర్‌ఎస్‌ పార్టీకి  ప్రజలు అధికారమిచ్చారు. తెలంగాణ అంటేనే (టిఆర్‌స్‌) బిఆర్‌ఎస్‌, బిఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ అన్నట్లుగా కొనసాగిన ఆపార్టీకి మూడవసారి ఎన్నికల్లో వీడ్కోలు చెప్పారు.అందుకు స్యయంకృతాపరాధాలే ఎక్కువన్న విషయాన్ని ఆపార్టీ అంగీకరించక తప్పదు. పేరుకు ప్రజాస్వామ్య ప్రభుత్వమైనప్పటికీ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, స్వయం నిర్ణయాధికారాలు తదితర అంశాలతోపాటు ప్రజాసంక్షేమం పేరున చేపట్టిన పథకాలు, ప్రాజెక్టుల అవినీతిపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను బిఆర్‌ఎస్‌ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే ఓటమికి కారణంగా మారింది. తాజాగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అవే అంశాలను తమ ప్రచార బాణాలుగా సంధిస్తోంది.

తమదే అసలైన ప్రజాప్రభుత్వమని, పాలనంతా ప్రజాస్వామ్యయుతంగా సాగుతుందని చెప్పడంతోపాటు, కార్యక్రమాలనుకూడా ఆ ధోరణిలో చేపడుతుండడం ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని కలిగించేదిగా ఉంది. ఇతర పార్టీలోని నాయకులుకూడా ఆ పార్టీ పట్ల మొగ్గుచూపడానికి ఇష్టపడుతుండడమే వలసల పరంపర కొనసాగడానికి కారణమవుతున్నది. ఈ వలసలను అడ్డుకోవడానికి బిఆర్‌ఎస్‌ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదనడానికి తాజాగా మహేందర్‌రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్‌ దంపుతలతోపాటు మరికొందరు గులాబి కండువను వదిలేసి, కాంగ్రెస్‌ కండువను కప్పుకోవడమే. గత శాసనసభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా నల్లగొండ సభలో నోరువిప్పిన కెసిఆర్‌ కాంగ్రెస్‌పై తన విశ్వరూపాన్ని చూపినప్పటికీ తమ నాయకుల వలసలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. గత ఎన్నికల్లో పోయిన పరువును పార్లమెంటు ఎన్నికల్లో సాధించుకోవాలని  బిఆర్‌ఎస్‌  ఇప్పుడు పట్టుదలతో ఉంది. కాగా బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటుకూడా దక్కకుండా ఆ పార్టీని శంకరగిరి మాణ్యాలు పట్టించాలంటున్న కాంగ్రెస్‌, బిజెపిల లక్ష్యాలకు  ప్రజలతీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందేమరి.

  -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *