- ఆదుకుంటాం అధైర్యపడకండి
- రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం
- రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం
- రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బతినొద్దన్నదే లక్ష్యం
- నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోం
- పంపినా ఎలాంటి ఉపయోగం లేదు
- ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సిఎం
ఖమ్మం/కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 23 : పంటనష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తమది రైతు ప్రభుత్వమని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని గుర్తు చేశారు. పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైమ్ కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందజేస్తామని, కౌలు రైతులను సైతం ఆదుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
వాళ్లక్కూడా న్యాయం చేస్తామన్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.228కోట్లను ఇప్పుడే మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వీచిన గాలివానతో వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో గురువారం నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో సందర్శించారు.
నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోం : ఖమ్మం విలేఖరుల సమావేశంలో సిఎం కెసిఆర్
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల, గార్లపాడు గ్రామాల్లో పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో సిఎం దెబ్యతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో కలిసి రావినూతలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ 10 వేలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు సిఎం అన్నారు. రైతులకు అండగా ఉంటూ, అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మొక్కజొన్న 1,29,446, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని తెలిపారు. ఫలితంగా వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వొస్తున్నారని అన్నారు. అప్పుల నుంచి తేరుకుంటున్నారని సిఎం అన్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారని, ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారని, కానీ తాము ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని గర్వంగా చెబుతున్నామన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో మన రాష్ట్రంలో ఉందన్నారు. జిఎస్‌డిపి పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. జిఎస్‌డిపి పెరుగుదలలో వ్యవసాయం పాత్రే అధికంగా ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉండగా, సరాసరి 16 శాతం వరకు ఉందని సీఎం వెల్లడించారు. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇది మనకు చాలా గర్వకారణమని అన్నారు. రైతులు నిరాశకు గురికావద్దని, ప్రభుత్వం అండదండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని చెప్పారు. ఈ దేశంలో ఓ పాలసీ లేదని, ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప, రైతులకు మేలు చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశానికే కొత్త అగ్రికల్చర్ పాలసీ కావాలన్నారు. గతంలో జరిగిన నష్టాలకు సహాయం కోసం నివేదికలు పంపితే కేంద్రం నుండి సహాయం రాలేదని, అందుకే ఈసారి కేంద్రానికి నివేదిక పంపాలని అనుకోవట్లేదని సీఎం తెలిపారు. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చాడని, కాబట్టి మా రైతులను తాము కాపాడుకుంటామని, వంద శాతం తామే ఆదుకుంటామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్నకు అయితే ఎకరానికి రూ.3,333 లు, వరి చేలకు రూ. 5,400 లు, మామిడి తోటలకు రూ 7,200 ఇస్తామని స్కీమ్‌లో ఉందన్నారు. ఇది ఏ మూలకు సరిపోదు కాబట్టి రైతులను తామే ఆదుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, వాటర్ సెస్ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుందన్నారు. ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమని సీఎం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వొచ్చినప్పుడు నిరాశపడొద్దని, ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరని, రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలని, అందుకే ఎకరానికి రూ 10వేలు ప్రకటిస్తున్నానని తక్షణమే వీటిని అందజేస్తామని అన్నారు.
స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. ఈ నగదును నేరుగా రైతులకు ఇవ్వకుండా, ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి అందించేలా కలెక్టర్‌కు ఆదేశాలిస్తామన్నారు. పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని, జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా, రబ్బర్ బంతి తిరిగొచ్చినట్లుగా, భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలని, ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దని సీఎం రైతుల్లో భరోసా నింపారు. రాష్ట్రంలో పంట దెబ్బతిన్న 2.28 లక్షల ఎకరాలకు రూ 228 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బతినొద్దన్నదే లక్ష్యం
రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే పంట నష్టం కింద రూ.10 వేలు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. మరో రెండు, మూడుసార్లు వడగండ్ల వాన రావోచ్చునని అప్రమత్తంగా ఉండాలని రైతులకు కేసీఆర్ సూచించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రాష్ట్ర రైతులను తామే ఆదుకుంటామన్నారు. ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని, వెంటనే వీటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. అన్ని జిల్లాలలో కలిపి అకాల వర్షాలతో 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లుగా కేసీఆర్ వెల్లడించారు. 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని తెలిపారు. పంట నష్టంపై కేంద్రాన్ని సహాయం అడిగే ప్రసక్తి లేదన్నారు.
పంట నష్టంపై నివేదికలు పంపినా ఎలాంటి ఉపయోగం ఉండడం లేదన్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 84 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉందని తెలిపారు . యాసంగి సాగులో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలు బాగా పండుతున్నాయని కేసీఆర్ అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతులను సైతం ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లో పంటలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10వేలు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదలకు సంబంధించిన జీవో జారీ చేసిందన్నారు. పంట నష్టం దెబ్బతిందని రైతులు నారాజ్ కావొద్దని సూచించారు.
రాష్ట్ర జీడీపీ పెరుగుతున్నది. ప్రజలకు పని దొరకుతుంది. ప్లలెలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితిని వెనక్కి పోనివ్వొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోవద్దు. వి• వెంట కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటుంది. రైతులు ఆత్మస్తయిర్యం దెబ్బతీసుకోకుండా నిలబడి ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంలో తట్టుకోవాలి తప్పా.. మనసు చిన్నబుచ్చుకొని నారాజ్ కావొద్దు. ఇంకా బలంగా పని చేస్తూ ముందుకుపోవాలి. పంట సాయానికి సంబంధించి సీఎస్ జీవో సైతం జారీ చేశారు. త్వరలోనే రైతులందరికీ డబ్బులు వస్తాయ్. అక్కడక్కడ కౌలు రైతులు సైతం ఉన్నరు. వారు కూడా మొత్తం మునిగిపోతరు కాబట్టి వారిని సమన్వయం చేసి వారికి సహాయం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలి చ్చాం. సీఎస్ ఆదేశాలు జారీ చేస్తారు.
ఈ సందర్భాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. మర్పల్లిలో వడగళ్లు భారీగా కురిశాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కొన్ని జిల్లాల్లో నష్టం జరిగింది. జగిత్యాలలోనూ నష్టం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడ నష్టం జరిగినా ఆదుకుంటాం. ఉజ్వలమైన తెలంగాణ వ్యవసాయరంగం.. ఎందుకు పరిహారం పెంచి ఇస్తున్నామంటే.. రైతాంగం నారాజ్ కావొద్దని.. తెలంగాణలో వ్యవసాయరంగానికి సంతరించబడిన స్థితి ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ ముందడుగు వేయాలే తప్ప వెనుకడుగు వేయొద్దని సదుద్దేశంతో ముందుకెళ్తున్నాం. దీన్ని అందిపుచ్చుకొని రైతులోకం గొప్పగా ముందుకురావాలి. ధైర్యం కోల్పోకూడదు’ అంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాన్వాయ్‌లోనే మంత్రులతో కలసి సిఎం భోజనం
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తన కాన్వాయ్‌లో భోజనం చేశారు. హెలీప్యాడ్ దగ్గర కొద్దిసేపు అధికారులు కాన్వాయ్ ఆపారు. బస్సులోనే సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు భోజనం చేశారు. కేసీఆర్ అండ్ టీం ఈ విధంగా భోజనం చేయటం విశేషం. బస్సులోని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొసరి కొసరి వడ్డించారు. పులిహోరతోపాటు ఇతర ఆహార పదార్థాలను స్వయంగా వడ్డిస్తూ..అందరూ తిన్నారా లేదా అని మరీ మరీ అడిగారు. ఎర్రబెల్లి వడ్డింపులో పులిహోర ఐటమ్ స్పెషల్‌గా కనిపించింది.
ఇక మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ప్లాస్టిక్ బౌల్స్ లోనే తినటం విచిత్రం. అటు ఎంపీ సంతోష్ కుమార్ మాత్రం ప్లేట్‌లో భోజనం చేశారు. సీఎం టూర్ అంటే అన్నీ ముందుగానే అరేంజ్ చేస్తారు అధికారులు. అయితే నాలుగు, ఐదు చోట్ల ఒకే రోజు పర్యటన చేయాల్సి రావటంతో.. టైం సరిపోదని.. బస్సులోనే ఈ విధంగా భోజనం కానిచ్చేశారు. విజువల్స్‌లో.. సీఎం కేసీఆర్ కూడా పులిహోరతోపాటు అరటి పండు తిన్నారు.